ఒక మర్రిమాను
కాలం గడిచిపోతున్నా
దేహం విడిచిపోతానంటున్నా
నేను ఎవరో తెలియని నేను
సందిగ్ధాల కొలనులో ఈతకొడుతున్నాను..
జ్ఞాపకాలను ఊతకర్రతో
ముదిమి వయసు డాంబికాన్ని ప్రదర్శిస్తున్నా
ఆత్మ, శరీరాల ఘర్షణలో
నేను చిక్కుకు పోయింది
సైన్సుసిద్థాంతాలపై
కర్మ సిద్ధాంతం కర్ర దూస్తుంటుంది
పునర్జన్మను పరిహసించే సైన్స్
తన భుజాలపై లోకాన్ని చూడమంటుంది
ఎటూ తేల్చుకోలేని నేను
ఎవరివైపు ఉండనంటుంది
కరిగిపోయే కాలాన్నడగనా
తరిగిపోయే వయసునడగనా
అక్షరాల చెలిమి,ఆంతరంగికుల కలిమితో సత్యాన్ని అన్వేషించగలనా
అప్పటివరకూ దేహాన్ని బతిమాలుకోవాలి..మనసును మారాంచేయాలి
అంతవరకు
సైన్సు, కర్మ తీరాలను ఒరుసుకుంటూ ప్రవహించే “నేను”
అయోమయాల పెద్ద మర్రిమాను
– సి. యస్. రాంబాబు