ఒక చీకటి రాత్రి పార్ట్ 5
అమ్మ నాన్న నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంది అప్పుడే కాలేజి నుంచి వచ్చిన కిరణ్మయి. ఏంటమ్మా ఏంటి విషయం అంటూ అడిగాడు తండ్రి బాలయ్య. ఏంటి ఆ విషయం తొందరగా చెప్పు అంది తల్లి లక్ష్మి.
అబ్బా అమ్మ ముందు చెప్పేది వినండి అంటూ నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా మంచివాడు అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు కాదనరు అనే నమ్మకంతో మీకు చెప్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయకండి.
అయితే అతనికి డబ్బు లేదు కానీ గుణం సంస్కారం మాత్రం ఉంది. చాలా మంచివాడు అభివృద్ధిలోకి వచ్చేవాడు. అతనితో నా జీవితం చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఒకవేళ మీరు ఇప్పుడు ఒప్పుకోకపోయినా నేను వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటాను. కాబట్టి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకొని మా ఇద్దరికీ పెళ్లి చేయండి అంది కిరణ్మయి తండ్రితో నిష్కర్షగా.
అయ్యో అయ్యో ఎవడినో ప్రేమించాలా మన కులం ఏంటి వాడి కులం ఏంటి మన పరువు ప్రతిష్టలు గంగపాలు చేస్తావా ఏంటి అంది తల్లి లక్ష్మి. అబ్బా అమ్మ ఈరోజుల్లో కులాలు మతాలు ఎవరూ చూడడం లేదు.
అయినా మీకు చెప్తున్న వినండి కులం కన్నా గుణం మిన్న నేను కులాన్ని చూడలేదు అతని మనసును చూశాను అతని గుణాన్ని చూశాను అందుకే అతను కావాలనుకుంటున్నాను మీరు చేయరు అంటే చెప్పండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంది కిరణ్మయి.
అయినా కులం వాడిని చేసుకుంటే మన పరువు పోతుంది వద్దు నేను దీనికి ఒప్పుకోను అని తల్లి అనడంతో మీరు ఒప్పుకుంటారని నేను అనుకోలేదు.
అయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను మీ నిర్ణయం కూడా అదేనా నాన్న? అలా అయితే నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది కిరణ్మయి.
అమ్మా కిరణ్మయి మాకు ఉన్నది మీరు ఇద్దరు నువ్వు, పద్మ. ఇంటికి పెద్దదానివి అన్ని చూసుకోవాల్సిన నువ్వు ఇలా వెళ్తే మేము ఏమైపోవాలి? మేమెందుకు కాదంటాము తల్లి నీ సంతోషమే మా సంతోషం.
నువ్వు కోరుకున్నట్టుగానే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాం. నువ్వు ఇంట్లోంచి వెళ్ళకు. నువ్వు అన్నట్టుగానే కులం కన్నా గుణం మిన్న.
రేపు అతన్ని తీసుకొని ఇంటికిరా అతనితో మాట్లాడదాం. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను అన్నాడు బాలయ్య.
ఆడపిల్లలు, తెలిసి తెలియని వయసులో అలా చేసి అంటే మీరు కూడా అలాగే అంటారా అతని కులం ఏంటో తెలుసుకోకుండా పెళ్లి ఎలా చేస్తారు?
అయినా ఇదేమీ చిత్రం మీరు దానికి వంత పాడుతున్నారు అంటూ గయ్యిమని లేచింది కిరణ్మయి తల్లి లక్ష్మి.
లక్ష్మీ కొంచెం ఆలోచించి చూడు మనకున్నది ఇద్దరు పిల్లలు వాళ్ళలో ఒకరు పోతే మనం సంతోషంగా ఉండగలమా? అయినా మనం ఉండేది అయిదేళ్లు పదేళ్లు కానీ వాళ్ళు నిండు నూరేళ్లు కలిసి ఉండాలి.
వారికి జీవితాన్ని అందించాలి కానీ వాళ్ళని కట్టడి చేయకూడదు. వాళ్లు ఎంత సంతోషంగా ఉంటే మనం అంత సంతోషంగా ఉంటాం. కడుపునిండా కనుకున్నది వాళ్ళ సంతోషం చూడటం కోసమే కదా.
కన్న బిడ్డలు సంతోషంగా ఉంటే ప్రతి తల్లిదండ్రి సంతోషిస్తారు. వాళ్ళ సంతోషమే మనకు ముఖ్యం. ముందే ఆడపిల్లలు నోరు తెరిచి అడిగారు.
వారి కోరిక తీర్చడం మన ధర్మం. కాబట్టి నువ్వేం అడ్డు చెప్పకు అన్నాడు బాలయ్య తన భార్య లక్ష్మితో. ఆ బిడ్డల కోరిక తీర్చడానికి వాళ్లు కోరిందల్లా ఇస్తూ పోతే ఇక వాళ్ళ కోరికలకు అంతు ఉండదు అన్నది లక్ష్మి.
వాళ్లు ఆడపిల్లలు కానీ ఈడ పిల్లలు కాదు వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే అనంతలక్ష్మి మన ఇంటికి వస్తుంది. అందుకే వాళ్లని మాట అనకూడదు అనవసరంగా నోరు పాడు చేసుకోకు.
ఆడవారి కన్నీరు ఇంటికి అరిష్టం అలాగే మనం ఇప్పుడు వారి కోరిక తీర్చకపోతే వాళ్ళు మనల్ని ఎన్నో అనుకుంటారు. ఆ మాటలు మనకు తగులుతాయి.
అయినా మన బిడ్డలే కదా మన బిడ్డ సంతోషం కన్నా మనకు ఏది ముఖ్యం కాదు లక్ష్మి. ఒప్పుకో పిల్ల వాడు మంచివాడు అని అంటుంది కదా మనం కూడా ఒక సారి చూద్దాం మనమే ముందుకు వెళదాం ఏమంటావు అన్నాడు బాలయ్య లక్ష్మి అనునయిస్తున్నట్లుగా…
బాగానే చెప్పారు అయినా మీరు ఒప్పుకున్నాక నేనేం అంటాను… మీరంతా ఒకటే కదా ఇక నాదెం చెల్లుతుంది. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డల అని ఊరికే అనలేదు. వాళ్ళ సంతోషం కోసం సంతోషంగా ఉంటూ నన్ను పక్కన పెట్టేస్తున్నారు.
ఎంతైనా తండ్రీ కూతుర్లు ఒకటి. అందుకే ఎప్పుడూ కూతుళ్ల మీదే ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు ఎప్పటినుంచో ఉంది. నాదేముంది ఓ మూలన పడి వుండేదాన్ని అంది లక్ష్మి కినుకుగా….
అయ్యో లక్ష్మి అలా అనకు నువ్వు నా జీవితం లోకి వచ్చాక నాకు అంతా మంచి జరిగింది నువ్వు కూడా ఆడపిల్లవి కదా ఒక తండ్రి కూతురివే కదా. ఆరోజు నన్ను చూసి ఇష్టపడితే మీ నాన్న కూడా ఇలాగే చేసి ఇచ్చారు కదా.
మరి ఇప్పుడు నీ బిడ్డలకు ఎందుకు అలా అంటున్నావు? నీకు ఒక న్యాయం వాళ్లకు ఒక న్యాయమా ఆరోజు నీ తండ్రి కూడా ఇలాగే మాట్లాడి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది ఒకసారి ఆలోచించుకో అన్నాడు బాలయ్య.
ఆ అర్థమైంది లేండి ఇంకా అన్ని చెప్తారు గతాన్ని తవ్వి నా తప్పులు చూపిస్తారు. అప్పుడు మీరు వయసులో ఉన్నారు నేను వయసులో ఉన్నాను కాబట్టి ఇష్టపడ్డాను. పెళ్లయ్యాక తెలిసింది మీ అసలు స్వరూపం.
చూపుకే కానీ చేతిలో ఏమీ లేదని మా నాన్న ఇచ్చిన ఆస్తి అంతా హారతి కర్పూరం చేశారు. చివరికి నాకు స్థలము పెట్టిన వ్యాపారంలో ఇప్పుడు బాగా సంపాదించారు అంది వెటకారం గా…
అబ్బా అప్పుడు నాకు వ్యాపారం అంటే ఏంటో తెలియదు కాబట్టి బిజినెస్ లో లాస్ వచ్చింది. కానీ తర్వాత తర్వాత తెలుసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేశాను కదా ఇప్పుడు రెండు చేతులా సంపాదించాను కదా.
అయినా మొదట ఎవరికీ ఏదీ రాదు అనుభవం మీద ఏదైనా వస్తుంది. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి అలా జరిగింది అనుభవం మీద నాకు అన్నీ తెలిశాయి. ఇప్పుడు నేనే నలుగుర్ని పోషిస్తున్నాను. నేను మగాడిని అన్నాడు మీసం మెలేస్తూ..
ఆ పెద్ద మగాడు నా పుస్తెలు అమ్మారా లేదా అంది లక్ష్మి. అబ్బా ఇచ్చావులే ఓయ్ అది గతం దానికి బదులు రెండింతలు నీకు చేయించాను కదా అన్నాడు బాలయ్య.
మా నాన్నగారు నాకు ఇష్టంతో చేయించిన పుస్తెలు అమ్ముకున్నారు అది చాలదా మీరు ఎలాంటి వారో చెప్పడానికి. మీరు ఎన్ని చేయించినా మా నాన్నగారు చేయించిన దానితో సమానం కాదు అది తెలుసుకోండి అంది లక్ష్మి.
అబ్బబ్బా మీరు మొదలు పెడితే ఇక ఆపరా అసలు విషయం వదిలేసి కొత్త విషయాలు మాట్లాడుతున్నారు అంది కూతురు కిరణ్మయి.
అయ్యో అవునవును అసలు విషయం వదిలేసి కొసరు విషయం మాట్లాడుతున్నాం గొడవ ఎప్పుడూ ఉండేదే కదా… తల్లి నువ్వు రేపు అతని తీసుకురా అన్నాడు బాలయ్య.
లేదు నాన్న నేను అతని తీసుకురాను అతనికి పరీక్షలు ఉన్నాయి. అతన్ని నేను ఆశ్చర్యపరిచాలని అనుకుంటున్నాను.
కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి అన్నీ సిద్ధం చేశాక అప్పుడు అతనికి తెలిసి ఆశ్చర్యపోవాలి. అందుకే ముందు మీరు వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడి రండి అన్నా కిరణ్ మై.
అలాగే అమ్మా నీ కోరిక ఎందుకు కాదంటాను, రేపు వెళ్లి మాట్లాడతాను అని అన్నాడు బాలయ్య.
నిజంగా బాలయ్య తన కూతురు పెళ్ళికి ఒప్పుకున్నాడా? లేదా నాటకం ఆడుతున్నాడా? తన కూతురు ప్రేమించడం తనకి ఇష్టమేనా? మరి అమరేంద్ర తల్లిదండ్రులు వీళ్ళ ప్రేమను ఒప్పుకుంటారా? అసలు ఎం జరగబోతుంది?
-భవ్య చారు
సస్పెన్స్ బావుంది, next part త్వరగా ఇవ్వండి, అభినందనలు.