ఒక చీకటి రాత్రి పార్ట్ 1
అరేయ్ చిన్న ఎక్కడున్నావురా? ఇదిగో కర్రీ చేశాను, నువ్వు తినాలి అనుకున్నప్పుడు రైస్ పెట్టుకో అంది కిచెన్ లోంచి పద్మ. హా సరే అమ్మా నేను చూసుకుంటాలే మీరు బయలుదేరండి ముందు మళ్ళీ నాన్న తిడతారు అన్నాడు చిన్న అని ముద్దుగా పిలుచుకునే చేతన్.
హా అవునవును అమ్మా నేహా అయ్యిందా అంది పద్మ. నేను రెడీ అమ్మా పదా, అంది నేహా బ్యా గ్ బుజాన వేసుకుంటూ. ఈ పరీక్షలు లేకుంటే హాయిగా నువ్వు కూడా వచ్చేవడివు కదా రా అంది పద్మ చేతన్ జుట్టు నిమురుతూ…
అవును మమ్మీ పరీక్షలు లేకపోతే నేను కూడా వచ్చేవాడిని హాయిగా ఎంజాయ్ చేసే వాడిని అన్నాడు చేతన్ కాస్త విసుగ్గా.. సరేలే ఈ సారికి ఎలాగో రాసి మళ్లీ ఇంకెవరికైనా పెళ్లి జరిగితే నేనొక్కడినే పంపిస్తాలే అంది పద్మ.
హా అయితే మరి నేను నేను సమ్మర్ లో నా ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళ్తాను అంతే ఇదే ఫైనల్ ఇంకా నువ్వు డాడీ కి చెప్పి ఎలా ఒప్పిస్తావో ఒప్పించు అన్నాడు చేతన్ సంతోషంగా…
సరే, సరే మంచిది వెళ్తున్నా మరి అన్ని పద్మ బయటకు వెళుతూ, ఏంటి ఇంకా ఎంత సేపు? ఇప్పటికే, క్యాబ్ వచ్చి ఎంత సేపు అయింది మీ అమ్మ కొడుకుల ముచ్చట్లు ఏమిటో నాకు అర్థం కావు ట్రైన్ కు టైం అవుతుంది.
ఒరేయ్ చైతన్య నువ్వు ఇంటికి తాళాలు వేసి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి పడుకో, నీ ఫ్రెండ్స్ వచ్చారే అనుకో నీ కాళ్లు విరుగుతాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి క్యాబ్లో కూర్చున్నారు నరేష్ గారు.
నేను ఎవరిని తీసుకురాను డాడీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి పెళ్లికి వెళ్లి మూడు రోజులు ఎంజాయ్ ఎంజాయ్ అన్నాడు చైతన్య.
నేహా చేతన్ దగ్గరగా వచ్చి ఒరేయ్ అన్నయ్య నువ్వు మాత్రం చాటుగా సిగరెట్లు తాగకు అంటూ చెవిలో చెప్పింది. చెల్లెలు చెప్పింది వినగానే చేతన్ కి కోపం వచ్చి నిన్ను అంటూ కొట్టబోయే సరికి గబుక్కున వెళ్లి కరు లో కూర్చుంది నేహ.
అది చూసి మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అన్నాడు వెలు చూపిస్తూ… నేహా నాలుక బయట పెట్టి వే వే వే అంటూ వెక్కిరించింది. కారు కదిలింది. జాగ్రత్త నాన్న అన్న పద్మ మాటలు కారు సౌండ్ లో కలిసి పోయాయి.
వాళ్లకు బై చెప్పిన చేతన్ కారు కనుమరుగు అవ్వగానే ఇంట్లోకి నడిచాడు. ముందు తలుపులు వేసి తన గది లోకి వెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దం గా ఉంది.
ఇంట్లో ఎవరూ లేకపోవడం తో మళ్లీ ముందు గది లోకి వచ్చి టీవీ పెట్టుకుని రిమోట్ తీసుకుని తనకు నచ్చిన ఛానెల్ పెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేయసాగాడు చేతన్.
తనలో తనే మళ్లీ, అబ్బా ఎంత హాయిగా ఉంది. ఇలా ఇంట్లో ఎవరు లేకుంటే నాకు నచ్చినట్టు ఉండొచ్చు. నాకు నచ్చిన ఛానెల్ పెట్టుకుని చూడొచ్చు ఎంతైనా ఎగరొచ్చు, ఆడుకోవచ్చు, అవును సొంత ఇంట్లో హాయిగా కూర్చుని ఎఫ్ ఛానెల్ లో అందాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ కూని రాగాలు తీస్తూ టీవీ లో లీనం అయ్యాడు చేతన్.
అలా సమయం మొత్తం గడిచింది. మధ్యాహ్నం అయ్యింది. కడుపులో ఎలుకలు గోకడం, చేతన్ ఫోన్ మోగడం ఒకేసారి జరిగాయి. ఎవరా అని ఫోన్ చూస్తే అవతల తల్లి పద్మ.
అబ్బా అమ్మ కు మళ్లీ ఏం గుర్తుకు వచ్చిందో అనుకుంటూ అబ్బా ఇప్పుడే వెళ్లారుగా అప్పుడే ఏం మునిగింది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు చేతన్
ఏరా తిన్నావా అడిగింది తల్లి. లేదమ్మా తినాలి అన్నాడు చేతన్. రైస్ పెట్టావా అంది తల్లి, లేదు పెడతా అన్నాడు చేతన్ నువ్వు పెట్టీ, అయ్యేసరికి మూడేళ్లు అవుతుంది కానీ నీకోసం వండి పెట్టాను పెట్టుకుని తిను, ఆ టివి కట్టేయి, నిద్ర పొయింది చాలు ఇక చదువుకో అంది తల్లి అన్ని చూసినట్టు గానే…
వామ్మో నువ్వు ఎక్కడున్నావ్ అంటూ చుట్టూ చూసి ఎంటే అన్ని చూసినట్టే చెప్తున్నావు అన్నాడు చేతన్. హా, నా కొడుకు సంగతి నాకు తెలియదా మూసుకుని తిని టివి కట్టేసి చదువుకో ఇప్పుడొకడు వస్తాడు వాడితో బయటకు వెళ్ళకు సరేనా అంది తల్లి.
ఎవడే ఎవడోస్తాడు అన్నాడు చేతన్. అదేరా నీ జన్ జీగ్రి దోస్తు లుంబు లాగా ఉండే నంద కిషోర్ రా అంది పద్మ అబ్బా అమ్మ వదిలేయ్ బై అని ఫోన్ కట్ చేసి, కిచెన్ లోకి వెళ్లి అన్నం ప్లేట్ లో పెట్టుకుని మళ్లీ టీవీ చూస్తూ తినడంలో మునిగి పోయాడు.
********
సాయంత్రం అయిదు గంటలు అయ్యింది. టాక్ టాక్ మన్న తలుపు శంబ్దనికి మెలకువ వచ్చింది చేతన్ కి ఒరేయ్ చేతు చేతు అంటూ నందు పిలుపు విన్న చేతన్ కళ్ళు నులుముకుంటూ వెళ్లి డోర్ తీశాడు.
ఈ టైం లో నిద్ర ఏంట్రా అంటూ లోపలికి వచ్చాడు నందు. మధ్యాహ్నం పడుకున్నా రా అలాగే నిద్ర పోయాను అంటూ చెప్పి, మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యి వచ్చాడు చేతన్. ఈ లోపు నంద కిషోర్ గిన్నెలు ప్లేట్ లు అన్ని తీసేసాడు.
రేయ్ పదరా, మీ అమ్మ మా అమ్మకి చెప్పింది. ఈ రోజు రాత్రి నువ్వు మా ఇంట్లోనే ఉండాలని. కాబట్టి అలా అలా తిరిగేసి ఇంటికి వెళ్లి డిన్నర్ చేసి చదువుకుందాం అన్నాడు నందు.
సరేరా పది నిమిషాల్లో రెడీ అవుతా అంటూ డ్రెస్ మార్చుకున్నాడు చేతన్. ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లారు బైక్ మీద. ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలవరకు గల్లీలలో నాలుగు రౌండ్లు వేసి ఇంటికి తిరిగి వచ్చారు.
ఆ సమయంలో ఇల్లంతా గందరగోళంగా ఉంది. నందు, చేతన్ లకి ఏమి అర్ధం కాలేదు. బైక్ దిగి నందు తల్లి దగ్గరికి వెళుతూ, ఏంటి అమ్మ ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? అంటూ అడిగాడు ఏం లేదురా మీ తాత గారికి ఆరోగ్యం బాగా లేదట మనం ఇప్పుడు వెళుతున్నాం అందుకే కంగారు అంది తల్లి.
అయ్యో అవునా మరి మనం వెళ్ళిపోతే వీడి పరిస్థితి ఏంటి అంటూ అడిగాడు చేతన్ ని చూపిస్తూ… ఓ అవును కదూ అయ్యో నేను మర్చిపోయాను చైతన్ నువ్వు మీ ఇంటికి వెళ్లి పడుకుంటావా అంటూ అడిగింది నందు వాళ్ళ అమ్మ శారద.
అమ్మో నేను ఒక్కడినే మా ఇంట్లోనా… నాకు చాలా భయం ఆంటీ అన్నాడు చేతన్. మరి మా ఇంట్లో అయితే? ఆంటీ మీ ఇంట్లో కూడా నాకు భయం వేస్తుంది. నాకు ఎవరైనా తోడుగా ఉంటే బావుంటుంది. మా ఫ్రెండ్స్ ఉన్నారులే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అక్కడే చదువుకుంటాను, అక్కడే పడుకుంటాను. అన్నాడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.
సరే బాబు మరి మేము బయలుదేరుతున్నాం నువ్వు జాగ్రత్త అంటూ వాళ్లు కంగారుగా బయలుదేరారు. వెళ్లేముందు నందకిషోర్ చేతన్ తో అరేయ్ మామ, అమీర్ పేటలో మన ఫ్రెండ్ వాళ్ళ గది ఉందిగా అక్కడే ఉండు, సారీ రా ఇలా అవుతుంది అనుకోలేదు అన్నాడు నందు కొంచం బాధ పడుతూ…
పర్లేదు లేరా నీకు మాత్రం ఏం తెలుసు ఇలా అవుతుంది అని అన్నాడు చేతన్. సరే ఇంటికి వెళ్తావా అన్నాడు నంద కిషోర్. అవును రా ఇంటికి వెళ్ళి తిని అక్కడికి వెళ్తాను అన్నాడు చేతన్ బైక్ స్టార్ట్ చేస్తూ… క్యాబ్ తో పాటు బైక్ కూడా ముందుకు కదిలింది.
చేతన్ ఇంటికి వెళ్ళి ఉన్న అన్నం తినేసి, బుక్స్ అన్ని తీసుకుని, బైక్ పై బయలు దేరాడు . స్నేహితుల గదికి ..
********
చేతన్ తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్లేసరికి, రూమ్ లో ఉండే ఇద్దరు స్నేహితులు బ్యాగ్ లతో బయటకు వస్తూ కనిపించారు. అరేయ్ మీరిక్కడికి రా వెళ్తున్నారు అన్నాడు చేతన్ బైక్ ఆపుతూ…
ఒరేయి టైం కి చేతు వచ్చాడు వాడికి చెప్పి వెళదాం అనుకున్నారు వాళ్ళు. ఏంట్రా ఎక్కడికి ప్రయాణం అన్నాడు చేతన్ ఆదుర్దా పడుతూ, ఏం లేదు రా, నా లవర్ కి యాక్సిడెంట్ అయ్యిందట అందుకే వెళ్తున్నాం.
నువ్వు రూం లోనే ఉండు అలాగే పరమేష్ వస్తాడు, డబ్బులు ఇస్తాడు. అవి చాలా అర్జెంట్ అవి నువ్వు తీసుకుని మాకు పంపు సరేనా ఇక మేము వెళ్తాం, బాయ్ రా అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు.
అబ్బా ఈరోజు నా టైం అస్సలు బాగాలేదు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పరీక్ష లేకపోతేనే. నేను అందరిలా ఎంజాయ్ చెసేవాడిని.
కానీ, ఉద్యోగం కావాలంటే ఇవ్వన్నీ తప్పవు ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నాకు బ్యాక్ లాగ్ లేకపోతే హాయిగా అమ్మ వాళ్ళతో వెళ్ళేవాడిని అనుకుంటూ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేశాడు.
అది రెండు అంతస్థుల బిల్డింగ్ వీరిది పైన పెంట్ హౌస్, కింద షట్టర్ లో షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యామిలీ లు అద్దెకు ఉంటాయి. ఇక పెంట్ హౌస్ లో ఆరుగురు స్టూడెంట్స్ కలిసి ఉంటారు.
ఇప్పుడు అందరూ పనులు ఉండడం తో వెళ్లారు. ఇక చేతన్ ఒక్కడే రూమ్ లో చదువుకుంటూ కూర్చున్నాడు. ఈ సారి పాస్ అవ్వక పోతే తండ్రి కాళ్ళు విరగ కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు అందుకే ఇలా నైట్ అవుట్ చేస్తున్నాడు.
*******
చేతన్ బుక్స్ తో కుస్తీ పడుతూ మనసులో చదువుకుంటూ ఉన్నాడు. స్నేహితుడు చెప్పిన పరమెష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అతను ఎంతకీ రాకపోవడం తో విసుగు వచ్చి పోనీలే వస్తాడు వస్తె చూద్దాం అనుకుంటూ తిరిగి బుక్ లో తల దూర్చాడు. అలా చదువుతూ చదువుతూ నిద్రలోకి జారిపోయాడు చేతన్.
టక్ టక్ టక్ అంటూ తలుపుని గట్టిగా కొట్టిన శబ్ధం వినపడడంతో ఉల్లిక్కి పడి నిద్ర లేచాడు చేతన్. ఈ టైమ్ లో ఎవరా అనుకుంటూ పరమేష్ వచ్చడేమో అనే ఆలోచన రాగానే గబుక్కున లేచి వెళ్లి తలుపులు తెరిచాడు.
ఒక్కసారిగా చల్లని గాలి మొహానికి తగిలి లోనికి వచ్చింది. అబ్బా అంటూ కొంచం వెనక్కి జరిగి మళ్ళీ ఎవరూ అంటూ పిలిచాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. డోర్ కొట్టి వెళ్ళారా ఎంటి అనుకుంటూ బయటకు వచ్చి చుట్టూ చూసాడు.
అసలు ఎవరు వచ్చిన ఛాయలు కూడా కనిపించలేదు. దాంతో గాలి కి తలుపులు చప్పుడు అయ్యాయేమో అనుకుంటూ మళ్లీ లోపలికి వచ్చి తలుపులు మూసి వేశాడు చేతన్ .
అవును నేను ఎంత సేపు పడుకున్నాను ఇప్పుడు టైమ్ ఎంత అయిందో అని అనుకుంటూ ఫోన్ తీసి చూడబోయాడు. కానీ ఫోన్లో చార్జింగ్ చాలా తక్కువగా ఉంది. అప్పటికి టైం ఒంటి గంట అవుతుంది.
నేను చదివింది తక్కువ నిద్ర పోయింది ఎక్కువ, అమ్మో ఇంకో గంట అయినా చదవాల్సిందే అని అనుకుంటూ, అసలు పరమేష్ అనే వ్యక్తి ఇంకా ఎందుకు రాలేదు లేదా వచ్చి వెళ్లిపోయాడా? ఏమో డబ్బులు అర్జెంటు ఉన్నాయి అని చెప్పారు.
కానీ నేనేమో మొద్దులా నిద్రపోయాను అని మనసులో అనుకోని చల్లని నీళ్ళ తో మొహం కడుక్కొని తిరిగి బెడ్ పైకి వచ్చాడు.
పుస్తకం తీసి పట్టుకుంటూ తలుపు వైపు చూశాడు అక్కడ ఎవరో వ్యక్తి ఉన్నట్లుగా కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు చేతన్. ఏంటి నేను తలుపులు తీసినప్పుడు ఎవరైనా వచ్చి ఉంటారా అనుకుంటూ మళ్ళీ కళ్ళు నులుముకుని చూసాడు అక్కడ ఎవరూ లేరు.
నిద్ర కళ్ళకి ఇలా మసకగా కనిపిస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటూ గోడ వైపుగా కూర్చుని కాళ్లు చాపి బుక్ చేతిలోకి తీసుకుంటూ కిచెన్ వైపు చూశాడు. అక్కడ కూడా మళ్ళీ ఎవరో ఉన్నట్లు గా కనిపించింది.
దాంతో ఉలిక్కిపడి ఎవరు అంటూ కొంచెం భయంగా అడిగాడు కానీ ఎలాంటి సమాధానం వినిపించలేదు. అయినా ఇక్కడ ఎవరు ఉంటారు? నేనే కదా డోర్లు వేసింది, డోర్లు తీసింది ఎవరో అయి ఉండాలిలే అని అనుకుంటూ కొంచెం భయపడుతూనే లేచి లైట్ వేశాడు.
రూమంతా లైట్లతో వెలిగిపోతుంది కిచెన్ లోకి వెళ్లి లైట్ వేసి చూశాడు. అక్కడ కూడా ఎవరూ లేరు ఆలోచనతో అతనిలాగే కనిపిస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటూ కిచెన్ లో లైట్ ఆపేసి హాల్లో కూడా లైట్ ఆర్పి తిరిగి తన బెడ్ దగ్గరికి వచ్చాడు.
బెడ్ మీద కూర్చొని బుక్ చేతిలోకి తీసుకున్నాడు అందులో ఒక చాప్టర్ అయిపోయింది. రెండో చాప్టర్ చదవబోతే మళ్లీ ఎందుకో తలెత్తి ఒక సారి చూసాడు.
తన ఎదురుగా ఎవరో నిలబడి ఉన్నారు దాంతో ఉలిక్కిపడి ఎవరు అని అడిగాడు. ఎవరు సమాధానం ఇవ్వలేదు. మళ్లీ లైట్ వేశాడు కానీ ఈసారి వెలగలేదు బెడ్ లైట్ మాత్రం వెలుగుతూ ఉంది.
అదేంటి ట్యూబ్ లైట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనుకుంటూ మళ్ళీ ఆన్ చేసి, ఆఫ్ చేసి చూశాడు. ట్యూబ్ లైట్ వెలగడం లేదు. దాంతో చేతనకి కాళ్ళల్లో చేతుల్లో మెల్లిగా వణుకు స్టార్ట్ అయింది
అయినా ధైర్యాన్ని కూడగట్టుకుని బుక్ తీసి చదవడం మొదలు పెట్టాడు. కానీ భయం వల్ల మెదడులోకి ఏమి ఎక్కడం లేదు. ఇంతలో తన పక్కన ఎవరో కూర్చుని ఉన్నట్లు అనిపించింది.
ఇంకా భయం మొదలైంది బెడ్ పైనుండి లేచి చైర్ లో కూర్చుని ఉన్నాడు. తను కూర్చున్న వైపు చూసాడు అక్కడ మసకగా బెడ్ లైట్ వెలుతురు లో ఒక ఆకారం కూర్చున్నట్లుగా కనిపించింది దాంతో గుండె జరి మోకాళ్ళ లోకి వచ్చింది.
తనది ఊహ కాదు నిజమే అని తెలిసిన మరుక్షణం ఇంకా భయం మొదలైంది. అయినా తను భయపడుతున్నట్లు అదేదో వాడు తెలిస్తే ఇంకేం చేస్తుందో అని అనుకుంటూ కొంచెం ధైర్యం చేసి మొబైల్ తీసి చూశాడు.
కానీ మొబైల్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉండడంతో చేతన్ తీయగానే స్విచ్ ఆఫ్ అయింది. దాంతో ఇంకా భయం మొదలైంది చైతన్య లో ..
అమ్మో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడు ఏం చేయాలి చదువుకుందామని ట్యూబ్ లైట్ వెలగడం లేదు కానీ బెడ్ లైట్ మాత్రం వెలుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ కుర్చీలో అలాగే బిగుసుకు పోయి కూర్చున్నాడు.
బెడ్ మీద కూర్చున్న ఆకారం మెల్లిగా లేచింది. ఆ ఆకారం లేచిన విషయం చూసి చేతన్ కి చెమటలు పట్టాయి అమ్మో ఇది ఏం చేస్తుందో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నాడు మనసులో మాత్రం, నీ అబ్బ ఇప్పుడే ఫోన్ కూడా ఆఫ్ అవ్వాలా అని అనుకుంటూ భయపడుతూ మనసులో ఏడుస్తూ ఉన్నాడు. మెల్లిగా ఆకారం కిచెన్ వైపు అడుగులు వేసింది.
అది గమనించిన చేతన్ తలుపులు తెరిచి బయటకు వెళ్లాలి అని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెల్లిగా లేచి డోర్ వైపు వెళ్లి తలుపులు తీయడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆ ఆకారం వెనక్కి తిరిగి చూసింది. దాంతో చేతన్ ఒక్కసారిగా భయపడి ఆ ఆకారాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు.
అయినా చేతన్ తలుపులు తీసే పని మానుకోలేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని తలుపులు ఎంతకీ తెరుచుకోవడం లేదు. ఇంతలో ఆ ఆకారం చేతన్ వైపు నడక సాగిస్తూ వస్తుంది. ఆ ఆకారం చేతన్ ని ఎం చేస్తుంది? అసలు ఆ దయ్యం ఎవరు? చేతన్ ఉన్నప్పుడే ఎందుకు వచ్చింది? చేతన్ కి ఆ ఆత్మకి సంభంధం ఏంటి?