ఓదార్పు
చేరుకోలేని గమ్యాలన్నీ
రాత్రివేళ పరిహసిస్తుంటాయి
చేవచచ్చిన జీవితం జ్ఞాపకాల మాటున
దాక్కునే ప్రయత్నం చేస్తుంది
రాత్రి మహా చెడ్డది
పొడుస్తూనే మధనాన్ని మంటలా చేస్తుంది
ఆలోచనల వెచ్చదనాన్ని కాచుకుంటూ
కలల్లోకి జారుకుంటాను
బాల్యమిత్రుడొకడు కనిపించి
కలవరపెడుతుంటాడు
కరగిపోయిన క్షణాలకు
క్షమాపణ చెబుతుంటాను
అపజయాలను విజయాలు చేసి
ఆనందిస్తుంటాను
పరిహాసాలను మందహాసాలు చేసుకుని
అలా స్వప్నసంచారం చేస్తుండగానే
విచలిత స్వరమై రణగొణ ధ్వనులు
ఈ వింతలమారి ప్రపంచంలోకి నెట్టేస్తాయి
తట్టా బుట్టా సర్దుకుని
చెప్పా పెట్టకుండా చెక్కేసిన రాత్రిని శపిస్తూ
వంటరి పోరాటానికి సిద్థమవుతుండగగా
శీతగాలొకటి ఓదారుస్తుంది
– సి. యస్ రాంబాబు