ఓ పల్లెటూరి కథ
మీ అందరికి తెలుసు పల్లెటూరి మాటతీరు ఎట్లా ఉంటుందో అని… సూరమ్య, రాములమ్మ అనే ఇద్దరి ముసలివాళ్లు ఉండేవారు. వీరి ఇద్దరి ఇల్లులు ఎదురేదురుగా ఉంటాయి. సూరమ్మ ఇంటి పక్కన పంకజం ఉంటుంది. తను తగువుల ముచ్చి.. తగువులు పెట్టే మనిషి. సూరమ్మ మొగుడు తాగుబోతు.. సూరమ్మ కి కోడి ఉండేది. దాన్ని ప్రేమగా పెంచుకునేది..
ఇలా ఉండగా ఒకరోజు సూరమ్మ.. పొద్దు పోతుంది. ఇంకా నా కోడి రావడం లేదు అని… దారవాత.. ఎక్కడ నక్కిపోనావే… దొనకాసోడికే.. నెతికి నెతికి సచ్చిపోనాను గదే… అంటూ ఓ! గంగవ్వ నా కోడిని గాని సూసినవేటి… ఓ! నరస్సయ్య నా కోడి గాని మీ కోళ్లతో వచ్చేసినదేటి?.. అంటూ వీధిలో వాళ్ళని అడుగుతూ ఉంటే.. ఇంతలో ఇదంతా గమనిస్తున్న పక్కింటి పంకజం.
అసలే తగువుల ముచ్చి… సూరమ్మ ని పిలిచి ఏటి అయినాదే? అలా అరుస్తుండావు? అని అడిగితే.. ఇలా నా కోడి కనిపించడం లేదు. ఎటు వెళ్లిపోనాదో.. పొద్దు పోతుండాది అంటూ బాధ పడుతుంది… ఓ! నీ కోడా! ఎదురింటి రాములమ్మ దాసేయడం నేను జూసినాను కదేటి? అంటూ తగువు పెట్టేసింది.
ఇక అంతే పల్లెటూరు మాటలు మాములుగా ఉండవు గదా! ఒసేయ్ రాములమ్మ… నా కోడి ని దాయడానికి నీకు ఎంత ధైర్యమే… బయటికి రాయే.. నా కోడి దాసిన దానికి రోజులు చెయ్య… నీ కళ్ళల్లో బియ్యం పొయ్య.. అని తిట్టడం మొదలు పెడితే.. రాములమ్మ కూడా నీ కోడి నాకెందుకే అంటూ.. నీ కాటికి కర్రలు తోలా.. అంటూ ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటున్నారు.
ఇంతలో సూరమ్మ మొగుడు తాగుబోతుగా.. తాగడానికి డబ్బులు లేక ఆ కోడిని సంతలో అమ్మేసి.. తాగేసి ఇంటికి వచ్చాడు. ఇంతలో దారిలో పోయే దానయ్య నీ పెనిమిటి కోడిని సంతలో నాకే అమ్మేశాడు అని చెప్పగా.. సూరమ్మ నిజం తెలుసుకొని పశ్చాతాపంతో చెప్పుడు మాటలు విని తప్పు చేశాను.. అని బాధ పడింది.
– తోగారపు దేవి