ఓ చిన్న తప్పు

ఓ చిన్న తప్పు

అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎత్తైన వేదిక ముందు కొన్ని వందల మంది గుమిగూడి ఉన్నారు. పామరుల నుండి పార్లమెంటు సభ్యులు వరకు ఏదో ఉత్సుకత తో ఎదురుచూస్తూ నిల్చున్నారు. సాయంత్రం వేళ కావడంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలతో అక్కడ పండువెన్నెల కురుస్తోంది.

అదో పెద్ద వ్యాపార కూడలి. దాని విలువ కొన్ని కోట్ల లోనే ఉంటుంది. పైగా పట్టణ నడిబొడ్డున ఉంది అది. ఆ ఆస్తులు అన్నిటికీ రంగనాథ్ గారు యజమాని.

తాను జీవితంలో కోల్పోయిన దాని ముందు ఇవన్నీ పిసరంత మాత్రమే. ఆరోజు ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే రంగనాథ్ గారు ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేశారు.

జనాలు ఆయన రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అక్కడ చేరిన వారిలో కొంతమంది సెలబ్రిటీలు కొందరు ఆయన అభిమానులు ఎక్కువ మంది ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు.

మంది అధికంగా ఉండటంతో అక్కడ అల్లరి వాతావరణం నెలకొంది. ఈ లోపు మైక్ లోంచి ‘రంగనాథ్ గారు వస్తున్నారు’ అని ఆ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించారు.

అది విన్న తడవుగా అక్కడ అంతా ప్రశాంత వాతావరణం వచ్చేసింది. సూది కూడా కింద పడితే వినిపిస్తుందేమో అన్నంత గంభీర పరిస్థితి నెలకొంది.

**********

లక్ష్మీ హడావిడిగా అటూ, ఇటూ తిరుగుతోంది. ఒక వైపు వంట, ఇంకో వైపు పిల్లల్ని తయారు చేయాలి బడికి. ఇదే కాకుండా రెండు ముద్దలు నోట్లోకి తీసుకొని లంచ్ పెట్టుకొని తన ఆఫీసుకు బయలుదేరాలి.

ఇవేమీ పట్టని రంగనాథ్ గారు చల్లగా పేపర్ చదువుతూ కూర్చున్నారు. ఆయనకు భార్య కి కొంచెం చెయ్యి తోడు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు.

పైగా మధ్యలో కాఫీ కాస్త నా మొహాన పడేయి అని భార్యపై చిరాకులు. “ఆ, ఒక్క నిమిషం అండి ఇస్తున్నాను” అంటూ నడకలని కాస్త పరుగులు గా మార్చింది పాపం ఆ ఇంటి ఇల్లాలు. కాఫీ తెచ్చి ‘ఇదిగోండి’ అని భర్తకు ఇచ్చింది లక్ష్మి.

ఉన్న కాస్త సమయాన్ని వాడుకోవటం కోసం, భర్తతో, “ఏవండీ, అదేదో కంపెనీ లో ఉద్యోగాలు ఉన్నాయి. మీ అనుభవం దానికి సరిపడుతుంది. వెంటనే అప్లై చేయండి. పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు. ముందు ముందు ఖర్చులు అధికమవుతాయి. అప్పులు చేస్తే బంధువుల్లో చులకన అవుతాము”, అంది.

కొట్టే అంత పని చేసాడు రంగనాధ్. “చెప్పావులే బోడి సలహా….! నాకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. నీ కర్ణ కఠోరమైన పాట ఆపి నీ పని చేసుకో” అని గార్దభ స్వరాన్ని వినిపించాడు.

” అలాగే అండి, కోపం వద్దు…. మీకు అన్ని సిద్ధంగా ఉన్నాయి. సమయానికి లంచ్ తీసుకోండి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది” అని చిరునవ్వుతో చెప్పి ఆఫీస్ కి వెళ్లి పోతుంది.

రంగనాథ్ గారు ఉద్యోగాల వేటలో రెండు రోజులు ఇంటికి దూరంగా ఉన్నాడు. మొత్తానికి ఆయన యోగ్యత కి తగిన ఉద్యోగం వస్తుంది. మూడో రోజు ఇంటికి తిరిగి వస్తాడు.

ఇంటి ముందు గుమ్మి కూడిన జనాలను చూసి కంగారు పడతాడు కొంచెం అక్కడ చేరిన వారి సంఖ్య అధికంగానే ఉంది మరి.

” జరగండి అయ్యా, జరగండి” అంటూ ఆయన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. భార్య తల దగ్గర దీపం చూసి కుప్ప కూలి పోతాడు.

అసలు భార్య చనిపోవడం ఏంటి? ఈ మూడు రోజుల్లో ఎం జరిగింది? రంగనాథ్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాడు? రంగనాథ్ ఈ వెదికపై ఎం చెప్పబోతున్నాడు? తెలుసుకుందాం మన తదుపరి భాగంలో

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *