ఓ అన్న బా(క)థ
నాకప్పుడు మూడేళ్లు,మా చెల్లి పుట్టింది.నాకు అదృష్టం పట్టింది.చెల్లిని చూస్తూ పెరుగుతున్న నాకు,తను ఎలా ఉన్న లక్ష్మి దేవిలాగే అనిపిస్తుంది.మా చెల్లికి చిన్నప్పటి నుండే అలంకారం అంటే చాలా ఇష్టం.
ఉన్న చిన్న జుట్టుకే మా పెరట్లో ఉన్న పూలు అన్నీ పెట్టుకునేది.ఎవరికీ ఇచ్చేదే కాదు.ఎప్పుడూ అలా చక్కగా తయారు అయ్యి ఉండే చెల్లిని చూసిన ప్రతి రోజూ నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
మా చెల్లితో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం.మా చెల్లి అంటే చెప్పలేనంత ఇష్టం.అలా చిట్టి చిట్టి చేతులతో ఉన్న మా చెల్లి చాలా పెద్దగా అయిపోయింది.
ఎంత అంటే తనకి పెళ్లి అయ్యేంత.చాలా దారుణమైన విషయం ఏంటో తెలుసా మీకు?“ఒక అబ్బాయి, వాళ్ళ చెల్లికి దూరం అవ్వాల్సి రావడం.చెల్లిని దయ్యం అనే అంటాం,కానీ తానే మా దేవత.నన్ను కొట్టి,నా జుట్టు పీకి,నన్ను ఆట పట్టించే హక్కు ఒక్క నా చెల్లికి మాత్రమే సొంతం.”
ఏ అన్నకి అయినా తన పెళ్లి కంటే, తన చెల్లి పెళ్లి చాలా ఘనంగా అవ్వాలి అనే ఉంటుంది.కానీ,పెళ్లి అయితే చెల్లితో రోజు ఉండడం కుదరదు,ఇంట్లో గారాబంగా ఉండే చెల్లి,అక్కడ ఎలా ఉంటుంది అనే భయం.ఆరోజు జనవరి 26 2023.
మా చెల్లి పెళ్లి కూతురుగా కనిపించింది.
లక్ష్మికళ అనే పదానికి అర్ధం తెలిసింది అప్పుడే నాకు.అంతా బాగుంది,అంగ రంగ వైభవంగా జరిగింది.అందరూ సంతోషంగా ఉన్నారు.నవ్వుతూ ఉన్నారు.నిజానికి నేను కూడా సంతోషంగానే ఉన్నాను.కానీ లోపల ఎదో భయం.ఎదోతెలియని భయం.చెల్లి పెళ్లి అయింది,ఇంక పెళ్ళిలో ఆఖరి ఘట్టం,
“అప్పగింతలు”
ఈ ఘట్టం అయ్యాక ఇంట్లో ఉండే లక్ష్మి దేవి ఇంక రోజూ కనిపించదు.కాళ్ళల్లో ఒణుకు మొదలైంది.కళ్ళు చెమ్మగిల్లాయి.
అక్కడే ఉంటే చెల్లి దైర్యంగా ఉండదు అనే భయంతో కొంచం దూరంగా నడిచాను.
కానీ చెల్లి నా వైపు నడుస్తూ “అన్నయ్య” అంది.అంతే తనని హత్తుకొని ఎడ్చేసా…..ఒక పదిరోజులు ఏడ్చి ఉంటాను.
భయం,బాధ.బావగారు మంచివారు అనే తెలుసు,అందరూ బాగా చూసుకుంటారు అనే నమ్మకం ఉంది.
కానీ ఏంటో తెలీదు.
చెల్లిని బావను చూసి చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు.చాలా సంతోషంగా ఉంటున్నారు ఇద్దరు.ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు,30 నిముషాల్లో వాళ్ళ ఇంట్లో ఉంటాను బండి ఎక్కితే.నా లక్ష్మి దేవిని చూడడానికి ఎక్కువ సమయం పట్టదు.
ఉట్టిపడుతున్న లక్ష్మి కళ అనే పదం వింటే చెల్లి గుర్తొచ్చింది.అందుకే ఇది చెప్పాలి అనిపించింది.ఇది నా మదిలోని భావం అని హామీ ఇస్తున్నా.
నాలాగే అనుకునే అన్నలు,తమ్ముళ్లు ఉండే ఉంటారు(వాళ్ళ భావన కూడా ఇదే ఉంటుంది)
రాసింది అయితే నేనే,
-ఈగ చైతన్య కుమార్