నిశ్శబ్దపు శోకానివై
కల చెదిరిందని గళానికి గాలమవుతు
నిగ్గు తేల్చని నిజాలతో ఆరంభం కాకు…
పలకని భాషతో పగిలిన చీలికలై…
ప్రతి కదలిక అలగా కదలిన దారి
సముద్రమై నిలిచినది….రెంటి తనువులు
ఒకటే అయినా తత్వం వేరు…నిక్షిప్తపు
సమాధులపై నిశ్శబ్దపు శోకానివై
వినిపించకు…
పుస్తకమెరుగని కావ్యం కలాలు
రాయని పర్వం…. నేనన్నది ఎన్నటికి
నిర్వచనం కాని గర్వపు ప్రయాణం
సంసిద్దుడవై సమస్తం కొరకు
ఎదురుచూడు నీ చేష్టల విముఖలతో
లోకాన్ని వెర్రి తనంగా చిత్రిస్తు….
నిర్వీర్యమైన ప్రగతితో అసహనంగా
ప్రతి కదలికకు మౌఖికమవుతు
నాస్తికత్వానికి దారి వేయకు…
నీ అయోమయపు ఆర్తనాధాలు
కాలంతో రచించబడనిదై…వేచిన అడుగు
నలుగురి స్థానాలలో నిర్ణతమైన ఆనందాన్ని
ఆస్వాదించలేక…కొలతలకు దొరకని దేహపు
మరుపులతో రూపాన్ని గుర్తించడం తటస్థ
మవుతు…ఉరిమే ఉత్సాహాన్ని శూన్యం
కొలిచినదై…అవగాహన లేని కూలదోపులతో
అంత మొందుతున్నావు….
వెనుదిరుగకు కాలానికి తలవంచు…
క్షణమెంతో విలువైనది…యుగాలుగా
నమ్మకం చేసిన వంతులతో ప్రమిదలు
కాల్చిన చీకటి వెలుగవుతు…నడక తెలిసిన
దారులలో ప్రతి అన్వేషణ నూతనమై…
ప్రవేశపు ద్వారాలలో కనిపించే గమ్యమొక
ఎండమావిగా కరిగిపోకుండ…భావమై
మధించి ప్రతి క్షణాన్ని ప్రత్యక్షంగా
సాధించిన విజయంతో నిరంతరమై
నడిపించు….
-దేరంగుల భైరవ