నిశి కన్య

నిశికన్య

మది నిండా నీ ఆలోచనలే
ఎప్పుడొస్తావనే ఎదురుచూపులో
కాలం కరిగిపోతూ, వయసు వేధిస్తూ
ఎప్పుడెప్పుడు నీ హృదయం పై వాలిపోవాలనే తలంపులే
నా మధురోహల నిండా నీ చిలిపి అల్లరి పనులే సవ్వడి చేస్తుంటే ,

నువ్వెక్కడ , నేనిక్కడ కాలం పరుగు పెడుతుంటే
నీ రాక కోసం నిలువెల్లా విప్పారిన కనులతో వేచి చూస్తూ
ఆరుబయట మంచం పై నిదురోయినప్పుడు చిన్న

చిరుగాలి సోకినా అది నువ్వేనా అనే చటుక్కున లేచి చూస్తే ….
విశాల ఆకాశం లోని చుక్కలన్ని నా చెంపల పై సోకి

నును సిగ్గుల మోగ్గవుతూ, కళ్ళు మూసుకుంటూoటే.

ఓయీ ప్రియా నీ చెలికాడు నీ కోసం నీ తలపులలో ఉన్నాడంటూ

నక్షత్రాలన్ని నాతో నీ గురించి ఉసులాడుతుంటే,
నీకు చెప్పాల్సిన కబుర్లన్ని వాటితో మౌనంగా చెప్తుంటే
భాష లేని భావాలెన్నో నిన్ను చేరుతాయానే ఆశ తో ..
నువ్వు నాతో లేకపోయినా ,మేము నిశ్చింతగా ఉంటున్నాము

అంటే కారణం అక్కడ నువ్వు మా కోసం
కాపలా కాయడం నాకెంతో గర్వకారణంగా ఉంటుంది.
నువ్వు రాకపోయినా నా మధుర భావాలను

ఈ నక్షత్రాల సాక్షిగా పంపుతున్నా..

ప్రియా వింటున్నావా నా మది మాటలు …

నాతో చెప్పిన కబుర్ల తో జీవితాంతం నీ కోసం వేచి చూస్తూనే ఉంటాను నిశికన్యలా….

 

 

-భవ్యచారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *