నిరీక్షణ
బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో 1982లో విడుదలైన ఆల్ టైం క్లాసిక్ మూవీ “నిరీక్షణ” అంటే నాకు చాలా ఇష్టం. భానుచందర్ అర్చన గారు మెయిన్ రూల్స్ లో నటించారు. నటించారు అనడం కంటే జీవించారు అనడం సమంజసమేమో అంత బాగా సహజంగా ఉంది వారి నటన.
నిరీక్షణ కథ విభిన్నమైనది. ఫారెస్ట్ ఆఫీసర్ అయినా గిరిజన అమ్మాయి అయినా తులసి అంటే అర్చన ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో పోలీసులు భానుచందర్నీ నక్సలైట్ గా పొరపాటు పడి అరెస్టు చేస్తారు. తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా అతిహేయంగా అవమానిస్తారు భానుచందర్ని. సహనం కోల్పోయిన భానుచందర్ కోపోద్రిక్తుడై తిరగబడడంతో ఆ పెనుగులాటలో అనుకోకుండా ఒక పోలీసు మరణానికి కారణం అవుతాడు. దీంతో పోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తుంది.
శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలైన భానుచందర్ బస్సులో ప్రయాణిస్తూ ఆ ప్రయాణికులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే క్రమంలో తన జీవిత చరిత్ర మొత్తం వివరిస్తాడు. తనకోసం ఇంకా అర్చన ఎదురుచూస్తూ ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రయాణికులు కూడా ఆ ఇద్దరి జంట కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వారందరూ ఆశించినట్లు భానుచందర్ యొక్క అపారమైన విశ్వాసం నమ్మకం నిజమై అర్చన అతని కోసం నిరీక్షిస్తూ ఉంటుంది.
దీనితో వారిద్దరి నిరీక్షణ ముగిసి ఇరువురు ఏకమవడంతో కదా ముగుస్తుంది సుఖాంతంగా.
ఇక సినిమా విషయానికి వస్తే ఇది ఒక అపురూపమైన దృశ్య కావ్యం గా అజరామరమైన సంగీత సాహిత్య విలువలు కలిగిన ఉన్నత చిత్ర రాజంగా నిలిచింది.
ఇందులో పాటలు అన్నీ కూడా మనల్ని ఒక కొత్త ప్రపంచంలోనికి తీసుకెళ్తాయి. మన ఉనికిని మర్చిపోయి అందులో లీనమయ్యేలా చేస్తాయి.
ఇందులో నాకు బాగా నచ్చిన పాటలు,
“ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది”
“చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేను వెతికినే” గంభీరమైన యేసుదాసు గారి గళంలో నుంచి జాలువారిన అమృత సమానమైన పాట.
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాటలు, సహజత్వానికి దగ్గరగా అందులో మమేకమై చూడగలిగే సన్నివేశాలు వెరసి నిరీక్షణ మూవీ. చూడకపోతే ఒకసారి చూడండి తప్పక నచ్చుతుంది.
– మామిడాల శైలజ