నిర్భయత్వం
అవధులు లేని ఆకాశమంత ఆసరా!
బంగారు భవిష్యత్తుపై బెంగలేని భరోసా!
మాటల శరాఘాతాలు తాకలేనంత తాదాత్మ్యత!
కాంక్షపూరిత దృక్కుల కత్తుల కందరానంత సుదూరత!
పసిడి వన్నెల ప్రాయం ఉసురు తీసే ఉన్మత్తుల జాడే లేదు!
ఉనికిని విలుప్తం చేసే వేటగాళ్ల ఊసే కానరాదు!
నిండు జీవితాన్ని నిట్టనిలువుగా చీల్చే నయవంచనులకు
తావు కాదు!
ఆధునిక అసురుల ఆధిపత్య పంకిలంలో కొట్టుమిట్టాడాల్సిన అగత్యం అసలే లేదు!
గతమెన్నడూ కనని
మునుపెన్నడూ వినని
పటిష్టమైన రక్షణ వలయంలో
ఎంత నిశ్చింత!
ఇంకెంత నిర్భయత్వం!
అదిగో వస్తున్నారెవరో!
పూల గుచ్చాల సహితంగా!
స్వీకరించు నలుచదరంగా విస్తరించి ఉన్న సమాధి సాక్షిగా!
-మామిడాల శైలజ