నిప్పులాంటి మనిషి !
ఆయన ఒక సింహం. నడకలో రాజసం. చూపులో ధీరత్వం. నిత్యం గౌరవము అనే రహదారి ఆయనని తన మార్గం వైపు ఆహ్వానిస్తూ ఉంటుంది. నవ్వు శూన్యం.
కానీ ఆయన మనసు విశ్వం. తన చూపులతో బెదిరించేవాడు ఆరోజుల్లో కుర్రకారుని. ఆయన పేరు మూర్తి. ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ లెక్చరర్.
క్లాసు నిశ్శబ్దంగా సాగుతోంది. పైగా అది మూర్తి గారి క్లాస్. ఇక హడలు పిల్లలందరికీ. ఆయన చాలా గొప్ప బోధకుడు. ఆయన అంకితభావం పిల్లల్ని అలా బెంచీలకి అతుక్కు పోయేలా చేసేది.
ఆయన అకౌంట్స్ చెప్తుంటే గోడ చూరు లో గూడుకట్టుకున్న పిచ్చుక సైతం మౌనం వహించేది. అది ఆయన గొప్పతనం.
శ్రీను కొంచెం ఆలస్యంగా కాలేజీ లో ప్రవేశం పొందాడు. చదువులో ఆణిముత్యం వాడు. అదే మొదటి రోజు వాడు క్లాస్ కి వెళ్లడం. దాంతో మూర్తి గారి గాంభీర్యత వాడికి ఇంకా పరిచయం కాలేదు.
మూర్తి గారి క్లాసు ప్రారంభమైంది. శ్రీను క్లాసు లో కొత్తగా కనబడడం తో, “ఏం, అబ్బాయి నువ్వేనా కొత్తగా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ పై ప్రవేశం పొందింది. ఇక్కడ లేదని అక్కడి కి వెళ్ళావా? ” అన్నారు మూర్తిగారు.
శ్రీను బిక్కమొహం వేశాడు. ఇలా ఒక పది రోజులు గడిచిపోయాయి. కానీ శ్రీను మాత్రం ఇంకా అసౌకర్యంగానే ఉన్నాడు. మూర్తిగారు ఒకటి రెండుసార్లు కాస్త హేళన చేస్తున్నట్టుగా మాట్లాడారు. ఇక అమ్మాయిలు ప్రతిసారి పుసుక్కున నవ్వడం.
ఒకరోజు పొద్దున్నే, ఇక ఇలా అయితే లాభం లేదని, శ్రీను మూర్తి గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన ముందర గది లో కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నాడు.
శ్రీను ని చూడగానే, “దా, బాబు దా…!” అని ప్రేమగా ఆహ్వానించాడు. ” ఏంటి విషయం? ” అని అడిగాడు.
శ్రీను భయపడుతూనే, “మీరు నన్ను క్లాసులో కాస్త చిన్న చూపు చూస్తున్నారు” అన్నాడు.
“అలాంటిదేమీ లేదు బాబు. అయినా నీకు అలా అనిపిస్తోంది కాబట్టి నేను నీ ప్రస్తావన తేను లే” అన్నాడు. “కాఫీ తాగే వెళ్ళు” అని భార్యతో కాఫీ తెప్పించి ఇచ్చాడు.
శ్రీను ప్రతి సంవత్సరం ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ కాకుండా ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణత పొందుతూ వచ్చాడు.
25 మంది విద్యార్థులు ఉన్న ఆ తరగతిలో ఒకరు ప్రథమశ్రేణి ఇద్దరు మాత్రం కొద్ది తేడాతో శ్రీను స్థాయిని మాత్రం చేరుకోలేకపోయారు. ఇక మిగిలిన 23 మంది ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్.
శ్రీను అతని స్నేహితులు కాలేజీలో కొన్ని కొత్త సంస్కరణలు తేవడానికి కృషి చేశారు. వీరి బ్యాచ్ చొరవతోనే ఆ కాలేజీలో వెల్కమ్ డే జరపడం ఆనవాయితీ అయింది.
అది రెండో సంవత్సరం. పిక్నిక్ ఒకటి ప్లాన్ చేశారు. శ్రీను మరియు అతని స్నేహితులు కొంత ఆక్టివ్ స్టెప్ తీసుకున్నారు.
అప్పుడే మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఏవో హేళనా చలోక్తులు విసురుతూ ఉన్నారు వీరిపై. ప్రత్యేకంగా శ్రీను ని వారు విమర్శించారు.
ఆ తర్వాత పిక్నిక్ కి వెళ్లి రావడం అంతా అయిపోయింది. బస్సు లో మొదటి సంవత్సరం విద్యార్థులు వారు ప్రవర్తించినట్లు ఆ రోజంతా పిక్నిక్ లో మళ్ళీ ప్రవర్తించలేదు. మరుసటి రోజు సెలవు ప్రకటించారు.
మూడో రోజు మళ్ళీ కాలేజీ హడావిడి. ఆ జూనియర్స్ లో ఒకడు నమస్తే శ్రీను అన్నాడు. నమస్తే భయ్యా అన్నాడు శ్రీను.
“మూర్తి సార్ మమ్మల్ని కడిగి పడేశాడు” అన్నాడు ఆ అబ్బాయి.
“ఎందుకు?” అని అడిగాడు శ్రీను.
” అదే, నువ్వు బస్సులో అరటిపండ్లు పంచుతున్నప్పుడు మాలో ఒకడు కుళ్ళు జోకు వేశాడు నీమీద. ఇక, మమ్మల్ని దులిపి పడేసాడు మూర్తి సార్.” అని చెప్పాడు.
“శ్రీను తెలివైన విద్యార్థి.. వీలైతే వాడిలా చదువుకోండి” అని ఒక హెచ్చరిక జారీ చేశాడు మాకు.
శ్రీనుది డిగ్రీ పూర్తయింది. ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ముందు మూర్తి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ విషయం చెప్పడానికి.
“ఆ, నీకు వచ్చింది 63% ఏ గా?” అన్నారు మూర్తిగారు.
మరి మూర్తి గారి గురించి తెలిసిపోయింది శ్రీను కి. మనసులో ఆయన పట్ల ఉన్న గౌరవం తో ప్రేమతో నవ్వుకున్నాడు శ్రీను. నా జీవితంలో మూర్తిగారు ఒక మధురమైన వ్యక్తి అండి.
కొసమెరుపు:- 100% ఉత్తీర్ణత తేవడం అక్కడ డిగ్రీ కళాశాల చరిత్రలో మా బ్యాచ్ తోనే ప్రారంభమైంది.
– వాసు