నిండు గర్భిణి(కథ)..
అది ఒక అందమైన పల్లెటూరు. పచ్చని చెట్లతో అలరారుతూ ఉంది. చెట్ల మీద పక్షుల కిలకిల రావాలు తీయని రాగాలు తీస్తూ కొయిలమ్మల సందళ్లు. ఆ ఊరిలో ఉన్న స్వచ్ఛమైన సెలయేళ్లు గల గలా శబ్దాలు చేస్తూ పారుతుంటే ఆ ఊరి కాళ్లకు గజ్జెలు కట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ ఊరిలో కమల, రాజశేఖర్ అనే దపతులుండేవారు. వారిది వ్యవసాయ కుటుంబం. వాళ్లకు పదెకరాల భూమి ఉంది, ఒక ఇల్లు ఉంది. వారు ఇరువురు పెద్దగా చదువుకున్నవారు కాదు. వారికి ఒక్కగానొక్క కూతురు ఉంది పేరు విద్య.
వారికి పెళ్లైన చాలా కాలానికి పుట్టింది. వారి ఏకైక కూతురిని కాలికి మట్టి అంటకుండా, గారాబంగా చుసుకుంటారు. కాలం గిర్రున తిరిగింది. విద్య ఇంటర్మీడియట్ చదువు పూర్తయింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే విద్యకు పెళ్లి చేస్తారు తన వయసు అప్పుడు 19. పెళ్లి ఇప్పుడు చేసుకోనని విద్య వారించినా తన తల్లిదండ్రులు వినరు. విద్యకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు. విద్య అత్తవారింట్లో అడుగు పెట్టింది. అక్కడికెళ్లాక కొన్ని రోజులు బాగానే గడిచాయి.
ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇంట్లో పని భారం మొత్తం వాళ్ల అత్తయ్య విద్య మీదనే పెట్టేది. కొన్ని నెలలు గడిచాయి నేల తుడుస్తూ విద్య కళ్లు తిరిగి కింద పడిపోయింది. ఇది గమనించిన వెంటనే తన భర్త హాస్పిటల్ కి తీసుకు పోతాడు. వెళ్లిన తర్వాత వైద్యులు పరీక్షలు నిర్వహిస్తాడు. పరీక్షలు పూర్తయిన తర్వాత వైద్యుడు విద్య భర్తను పిలిచి “మీ మిసెస్ గర్భవతి అయింది చాలా కేర్ తీసుకోండి బరువైన పనులు చేయించకండి.” అని చెప్పాడు.
అనంతరం విద్యను ఇంటికి తీసుకొచ్చాడు. విషయం ఇంట్లో చెప్పాడు. కానీ విద్యకు సపర్యలు చేయడానికి వాళ్ల అత్త సిద్దంగా లేదు. అదలా ఉంచితే విద్యకు వాళ్ల అత్త నుండి సూటిపోటి మాటలు(ఆరళ్లు) తప్పడం లేదు. వాళ్ల అమ్మ వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వాళ్ల అమ్మానాన్నలు తన బిడ్డ గర్భవతి అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషించారు. పురుడుకు పుట్టింటికే రమ్మని అడిగారు.
వారన్నదే తడవుగా విద్య పురుడుకు పుట్టింటికి పోతానని వాళ్ల అత్తయ్యను అడిగింది. కానీ, తను ససేమిర ఒప్పుకోలేదు. ఆ క్షణంలో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాలేదు. వంటింట్లోకి వెళ్లి కన్నీటి పర్యంతమవుతుంది. ఈ లోకంలో అత్యంత మౌన వేదనకు, రోదనకు గురయ్యేది కేవలం స్త్రీ మాత్రమే అని, ఈ భూ మండలంలో ఉన్న సప్త సముద్రాల్లో ఉన్నవి నీళ్ళు కాదు, మానవ జాతి పుట్టినప్పటి నుండి స్త్రీ విడిచిన కన్నీళ్ళు అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలోనే మూడు నెలలు గడిచాయి. విద్య మూడు నెలల గర్భవతి ఒకరోజు సాయంత్రం వంటింట్లో వంట చేస్తూ ఉంది. తన ఫోన్ మోగుతుంది అది వాళ్ల తల్లి గారి (పుట్టింటి) నుండి. విద్య ఫోన్ చేతిలోకి తీసుకొని హలో అంది అవతలి వైపు నుండి వాళ్ల మేనమామ గొంతు “హలో విద్య మీ అమ్మానాన్న ఇకలేరమ్మా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు.
మామయ్య….మామయ్య మీరు చెప్పేది నిజమేనా అంటూ బోరుమంది. నేను నమ్మలేకపోతున్నాను. ఇది కల అయితే బావుండు. నన్ను వారి కంటిపాప లాగ పాలు తాగే చంటిపాప లాగ చుసుకున్న నా తల్లిదండ్రులు పోయారంటే జీవితం అమావాస్య చీకటి అయినట్టే మామయ్య. కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్న మామయ్య అంటూ ఫోన్ పెట్టేసింది. సమయానికి భర్త ఇంట్లో లేడు. ఫోన్ చెస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కొన్నిసార్లు ప్రయత్నించి పుట్టింటికి బయలుదేరింది దారికడ్డంగా విద్య మామయ్య, అత్తయ్య నిలుచున్నారు. ఎటు అని అడిగారు. మా అమ్మానాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మామయ్య ఫోన్ చేసాడు.
చివరి చూపు కోసం వెళ్తున్న. వెళ్తే వెళ్లావు గాని మీ అమ్మానాన్న పేరు మీద ఉన్నా ఇల్లు, పదెకరాల పొలం నా కొడుకు పేరు మీద రాసేలా చూడు. ఎలాగూ వారసులు లేరు కదా. కావునా నా కొడుకే వాటికి వారసుడు. అత్తయ్య నా కన్నవాళ్లు పోయారనే బాధలో నేను ఉంటే ఇలా మాట్లాడుతున్నారేంటి. ఆప్తుల కంటే ఆస్తులు, అంతస్తులు ఎక్కువై పోయాయా మీకు. నిజంగా మీరు మారరు చీ చీ ఇవేం బ్రతుకులో అంటూ అక్కడి నుండి నిష్క్రమించింది విద్య. బస్ లో ఎక్కి అర్ధ గంటలో వాళ్ల అమ్మ వాళ్ల ఊరికి చేరుకుంది. పుట్టినిళ్లు చేరడం చేరడంతోనే తన తల్లిదండ్రుల భౌతిక దేహాల మీద పడి బోరున విలపిచింది. విద్యను ఆపడం ఎవరతరం కాలేదు. బంధువులు, ఇరుగూ పొరుగూ విద్యను ఓదార్చారు. శ్మశానానికి తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేశారు.
ఒకే చితి మీద ఇద్దరి భౌతిక దేహాలను పెట్టారు. విద్య కళ్లు కన్నీటి వర్షం కురిపిస్తుండగా అమ్మానాన్నల చితికి నిప్పు పెట్టింది. పక్కనే ఉన్న నదీ తీరంలో అందరు స్నానాలు చేసి ఇళ్లకు బయలుదేరారు. పదకొండు రోజుల దాకా కార్యక్రమాలు నిండు చూలాలుగా ఉన్న విద్య దగ్గరుండి చాలా బాగా చేసింది. పదకొండో రోజు కార్యక్రమం అయ్యాక తరువాతి రోజు ఆస్తుల గురించి విద్య మేనమామ చర్చ పెట్టాడు. ఒక్కగానొక్క కూతిరివి, వారసులు ఎవరూ లేరు కావున ఇల్లు, పదెకరాల పొలం నీ పేరు మీద పట్టా చేపిస్తాను అని మాటిచ్చాడు. సరే మామయ్య అని విద్య తలూపింది. అక్కడ అన్ని కార్యక్రమాలు అయ్యాక విద్య అత్తవారింటికి వెళ్లేటప్పుడు అందరు తగు జాగ్రత్తలు చెప్పి సాగనంపారు.
అత్తవారింటికి వెళ్ళాక ఆస్తుల కోసం విద్యను రాచి రంపాన పెట్టారు. విద్య వాళ్ల మామయ్య ఆస్థులను తన పేరు మీద బదలాయించాడు. రిజిస్ట్రేషన్ పత్రాలు విద్య చేతికొచ్చాక విద్య జీవితం వేడి వేడి నిప్పుల కొలిమిలో పడ్డట్టయ్యింది. భర్త,అత్త,మామలు పెట్టే బాధలను తట్టుకోలేకపోయింది విద్య. ఎలాగైనా తన పుట్టింటి నుండి సంక్రమించిన ఆస్థిని తన భర్త పేరు మీద రాసి ఇంటి నుండి బయట పడాలని చూస్తుంది. ఆస్తుల కోసం మనుషులను చంపడానికి కూడా వెనుకాడరు ఈ మూర్ఖులు, అఙ్ఞానులు. అనుకున్నట్టుగానే పదెకరాల భూమిని, ఇల్లును వాళ్ల భర్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది.
నాలుగు నెలల గర్భిణిగా చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వేరే ఊరికి వెళ్తుంది. తను బయట పట్టది తన అత్తయ్య వాళ్ల ఇంటి నుండి కాదు నరకం నుండి అని భావిస్తుంది. తను వెళ్లిన గ్రామంలో ఒక హోటల్లో టిఫిన్ సర్వర్ గా ఉదయం 6 గం..నుండి 10గం..వరకు నెలకు 5 వేలకు, ఒకబ్స్క్రాప్ షాప్ లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 6 వరకు అకౌంటెంట్ గా నెలకు 6 వేలకు పనికి కుదురుతుంది. రాత్రి ఇంటికొచ్చాక వంట చేసుకొని, పని పూర్తయ్యాక 8 గం.. నుండి 10గం.. పేపర్ బ్యాగులు తయారు చేసేది. దాని ద్వారా నెలకు 3 వేలు సంపాదించేది. ఒక ఇంటిని నెలకు 15 వందల అద్దెకు తీసుకుని అందులో ఉండెది.
తన డెలివరి సమయం వరకు డబ్బు వృధా కాకుండా జాగ్రత్త పడెది. కాన్పుకు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలని నిర్ణయించుకుంటుంది. మూడు నెలల సమయం గడిచిపోయింది. రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటుంది. ఒక రాత్రి విద్యకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. అమ్మా..అమ్మా అని మూలుగుతుంది. చుట్టుపక్కల వాళ్లు ఇది గమనించి విద్యను గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన రోజు రాత్రి 11 గంటలకు విద్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. వారిలో మొదట అబ్బాయి పుడతాడు తర్వాత అమ్మాయి పుడుతుంది. సాధారణ ప్రసవం కాబట్టి తల్లీబిడ్డలు క్షేమం. విద్యను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు.
ఒక రాత్రి పిల్లలను ఆడిస్తూ విద్య తన చదువు గురించి ఆలోచనను మళ్లిస్తుంది. అమ్మానాన్న వద్దన్నా వినకుండా చదువు ఆపి పెళ్లి చేశారు. కానీ తప్పకుండా డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి అందరిని తయారు చేసే ఉపాధ్యాయురాలుని అవుతా. తరువాతి రోజు ఉదయం వస్తువులు తీసుకోవడానికి కిరాణా షాప్ కి వెళ్తుంది. అక్కడ వార్తా పేపర్ లో డా.బీ ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఇచ్చిన డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ చూస్తుంది. వెంటనే ఫీజు కట్టి డిగ్రీ లో జాయిన్ అయ్యింది.
ఇట్టే మూడు సంవత్సరాలు గడిచిపోతాయి. డిగ్రీ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అవుతుంది. వెంటనే అదే యూనివర్సిటీలో బీఈడీ(తెలుగు) రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తుంది. తర్వాత టెట్ మెరిట్ సాధిస్తుంది. తర్వాతి సంవత్సరం ప్రభుత్వం పెట్టిన ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ లో నిలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తన ఇరుగు పొరుగు వారు విద్య దగ్గరికొచ్చి అభినందనలు తెలిపి, తర్వాతి రోజు సర్పంచ్, కార్యదర్శి, వార్డ్ మెంబర్స్, గ్రామస్తులందరు కలిసి విద్య దగ్గరికెళ్లి డప్పుల మోతలతో, నృత్యాలతో ఆ గ్రామంలో ఉన్న ఒక కొండ శిఖరం మీదకు తీసుకెళ్లి దాని మీద “నిండు గర్భిణి విద్య జీవితంలో పోరాడి గెలిచింది సరస్వతిని గెలిపించింది” అని రాసి ఉన్నా జెండాను ఆ గ్రామ సర్పంచ్ గారు ఊరి ప్రజల సమక్షంలో ఎగురవేశాడు. కొండ శిఖరం చప్పట్లతో మారుమోగి పోయింది జెండా గర్వంతో గాలిలో రెపరెపలాడుతూనే ఉంది. విద్య తెలుగు ఉపాధ్యాయినిగా ఒక గ్రామంలోని హై స్కూల్ లో జాయిన్ అయ్యింది….
(నీతి : ఒక స్త్రీని ఒక మగాడు గాని ఒక కుటుంబం గానీ ఒంటరిగా ఒదిలేసినా ఆమె పోరాటం చేసి, ఙ్ఞానాన్ని సంపాదించి ఆమె అనుకున్న శిఖరానికి చేరుకొని ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది)
-గురువర్ధన్ రెడ్డి