నిజంగా జరిగిన కధ
ప్రసాద్ ఒక ప్రైవేటు స్కూలులో పనిచేస్తున్నాడు. వేసవి సెలవలకు తన ఊరు వెళ్ళాడు. ఒక రోజు సెకండ్ షో సినిమా చూద్దామని పక్క ఊరికి వెళ్ళాడు. సొంతూరులో సినిమా హాలు లేకపోవటం వలన ఆ గ్రామస్తులు సినిమా చూడాలంటే పక్క ఊరుకి వెళ్ళే వాళ్ళు. అలాగే ప్రసాద్ వెళ్ళాడు. సినిమా చూసి తన ఊరికి బయల్దేరాడు.
ఆ టైంలో ఆటోలు ఏవీ ఉండవు. తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ కనపడలేదు. సరే ఒక్కడే నడక మొదలు పెట్టాడు. అమావాస్య రాత్రి. పైగా అర్ధరాత్రి అవ్వస్తోంది. ఆ దారిలో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. చుట్టూ చిమ్మ చీకటి అలముకుంది. వేసవి కాలం అన్న పేరేకాని బంగాళాఖాతంలో వాయిగుండం ప్రభావం వలన తుఫాన్ గాలులు వీస్తున్నాయి. అనవసరంగా సెకండ్ షో సినిమాకు వెళ్ళాను అని చాలా బాధపడ్డాడు ప్రసాద్.
అయితే ఇంటికి చేరాలంటే ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. చీకటి అవటం వలన దారీ తెన్నూ లేకుండా నడిచి పోతున్నాడు ప్రసాద్. పొలాల మధ్యలో ఉన్న డొంక దారిలో నడుస్తున్న ప్రసాదుకి తన వెనకే ఎవరో వస్తున్నట్లు అనిపించింది. కిర్రు చెప్పుల శబ్దం వినవస్తోంది. ప్రసాద్ మదిలో భయం అనే భావన మొదలైంది. వేగంగా నడవటం మొదలుపెట్టాడు ప్రసాద్. ఆ శబ్దం కూడా చాలా దగ్గరగా వినపడింది.
పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. అలా పరుగు పెట్టడం వలన అతనికి ఆయాసం వచ్చింది. తాటి చెట్ల ఆకులు కొరివి దెయ్యాల్లా ఊగిపోతూ ఉన్నాయి. అప్పుడే ప్రసాద్ కాలు బెణికింది. చాలా నెప్పి మొదలైంది. ముందుకు వెళ్ళలేడు. వెనుకకు వెళ్ళలేడు. అక్కడే ఉన్న మర్రి చెట్టు నీడలో కూలబడ్డాడు. బాగా అలసిపోవటం వలన కొంత సేపటికి అతనికి నిద్ర పట్టింది.
ఉదయం ప్రసాద్ లేచేటప్పటికి అతనికి ఏ నెప్పీ లేదు. రాత్రి బాగా బెణికి నడవటానికి వీలు లేకుండా ఉన్న కాలు ఉదయానికి ఎలా నెప్పిలేకుండా మామూలుగా అయిపోయిందో అతనికి అర్థం కాలేదు. చాలా విడ్డూరంగా అనిపించింది అతనికి. తను పడుకున్న పక్కనే కిర్రు చెప్పులు వదిలేసి ఉన్నాయి. అంటే రాత్రి అతని వెంట ఎవరో వచ్చారు. ఆ వచ్చింది ఎవరో తెలిస్తే ప్రసాదు సృహ తప్పిపోతాడు. అందుకే మనం అతనికి చెప్పొద్దు.
– వెంకట భానుప్రసాద్ చలసాని