నిద్ర
వంటింట్లో గిన్నెలు చేజారి దభేల్ మంటూ చప్పుడు రావడం తో అందరూ నిద్రలు లేచారు. శేఖర్ విసుగ్గా లేచి గబగబా వంటింట్లోకి వెళ్ళి సుగుణ ను వీపు వంచి దభదభ బాదాడు.
అయినా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రానివ్వ లేదు. కానీ కన్నీళ్లు కారిపోతున్నాయి. కొట్టి కొట్టి అలసిపోవడం తో లం… పొద్దున్నే నిద్ర పాడు చేస్తావా ? నువ్వు పొడిచేది ఎంటి నలుగురికి వండి పెట్టడమే గా, దానికే పొద్దున్నే నేనే పని చేస్తున్నా అంటూ అందరికీ తెలియాలని ఈ వెధవ నాటకాలు , అంటూ తిట్టాడు.
అయినా ఏమి మాట్లాడకుండా కాఫీ కలిపి అతని చేతికి ఇచ్చింది మౌనంగా , ఒసే పిచ్చి మొఖమా దీంతో నన్ను కూల్ చేద్దామనే అంటూనే ఆ కాఫీ తో బయటకు వెళ్ళాడు.
ఏంటి వదినా పొద్దున్నే మమల్ని లేపడానికి నీ గిన్నెలు చప్పుడు చేయాలా, సర్లే గానీ నాకు కాఫీ పెట్టీ ఇవ్వు అంటు హా నాకెప్పుడూ పెళ్లి చేస్తారో , నేనెప్పుడూ గిన్నెలు చప్పుడు చేయాలో, అంటూ రెండూ చేతులూ నెత్తి లో పెట్టుకుని గొక్కోసాగింది కమల.
సుగుణ వారించాలి అనుకుని మళ్లీ దానికి పెద్ద గొడవ ఎందుకు లే అనుకుని, మౌనంగా తనకు కాఫీ ఇచ్చింది. ఒక గుక్క తాగి ఛీ ఇంత చక్కర వేసవెంటి, అమ్మా నీ కోడలు సరుకులన్ని నాశనం చేస్తుంది. అంటూ ముందు గదిలోకి వెళ్లి తల్లికి చాడీలు చెప్పసాగింది.
ఈ లోపు సుగుణ అందరికీ టిఫిన్ తయారు చేసి ఇచ్చి రెడీగా పెట్టింది. ఆ తర్వాత అందరికీ బాక్సులు కట్టి రెడీగా ఉంచి తాను బాక్సు సర్దుకుంది.. అత్త .భర్త ఉన్న దగ్గరికి వెళ్లి ఏమండీ నాకు ఈరోజు ఒక పది రూపాయలు ఎక్కువ కావాలి అంటూ అడిగింది.
ఎందుకో అన్నాడు భర్త.. బయట చిరు తిళ్ళకు కాబోలు అంది ఆడపడుచు , అవునా అన్నాడు భర్త .అది కాదండి నాకు డ్యూటీ మధ్యలో నిద్ర వస్తుంది. ఆ నిద్రను ఆపడానికి టీ తాగడానికి డబ్బులు అడుగుతున్నా అంది సుగుణ.
అబ్బో అమ్మాయిగారికి నిద్ర సరిపోవట్లేదా ,ఏం వెలగ పడుతున్నావని ఇంట్లో నలుగురికి వంట చేయడమే గా, అంటూ ఎద్దేవా చేసి, ఏమీ అక్కర్లేదు వెళ్ళు అన్నాడు శేఖర్ తలగరేస్తూ.
అబ్బో నలుగురికి వండి పెట్టడానికి నువ్వు ఇలా నిద్ర కాచుకోలేదు అంటున్నావ్, అప్పట్లో మేము మా అత్తలకు తలవుకి ఎంతమంది ఉంటే అంతమందికి వండి వడ్డించేవాళ్ళం. మా కాలంలో అత్తలు నిద్ర పోనిచ్చేవారు కాదు అంటూ అత్త గుణగసాగింది.
ఇక వాళ్ళని అడిగి లాభం లేదనుకున్న సుగుణ ,బయటకు వెళ్లి చెప్పులు వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిగిలిన వారు కూడా ఎక్కడి వారు అక్కడ వెళ్లిపోయారు.
****
సుగుణ చాలా పేద కుటుంబంలో పుట్టింది. కాబట్టి శేఖర్కి వాళ్లు అడిగినంత కట్నం కాకుండా తనకు తోచినంత ఇచ్చి చేయడంతో సుగుణ అంటే అందరికీ చులకన భావమే ఇంట్లో, అందుకే మెట్టినింటికి రాగానే కష్టాలు మొదలయ్యాయి.
తన తల్లిదండ్రులు, తనకు భర్త ,అత్త, మామ ఏమన్నా కూడా మౌనంగా భరించమని చెప్పారు. తప్ప ఎదిరించమని చెప్పలేకపోవడంతో ,మీ బాబు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి నువ్వు డ్యూటీ కి వెళ్లాల్సిందే అంటూ డ్యూటీకి పంపించాడు భర్త .మొదట్లో కొంచెం కష్టం అనిపించినా, తర్వాత అలవాటు అయిపోయింది.
పొద్దున నాలుగు గంటలకే లేచి తన కాలకృత్యాలు అన్ని తీర్చుకొని, ఇద్దరు మరుదులకు మధ్యలో తనకు అత్తమామలకు అందరికీ కలిపి వంట చేసి, వాళ్లకు బాక్సులు కట్టి, తాను కూడా కట్టుకొని అందరి బట్టలు ఉతికేసి, ఆరు గంటలకల్లా రెడీ అయిపోతుంది.
ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీకి చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి రాగానే తలో రకం కూరలు చేయమని చెప్తారు. దాంతో అందరికీ తగినట్లుగా వంట చేసి పెట్టి, అందరికీ వడ్డించాలని అనుకుంటుంది. కానీ అప్పుడు ఒకరు, ఇప్పుడు ఒకరు అంటూ తింటారు. అలా సమయం వృధా అవుతుంది.
అందరూ తిన్న తర్వాత తాను తిని, వంటిల్లు అంతా సర్దుకొని, గిన్నెలన్నీ కడిగేసి, నిద్రకు ఉపక్రమించేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది. మళ్లీ పొద్దున్నే నాలుగు గంటలకు లేవడం వల్ల సుగుణకు నిద్ర సరిపోవడం లేదు. మధ్యలో డ్యూటీ చేస్తూ ఉండగా కళ్ళు వాలిపోతూ ఉండడం తో అది అప్పుకోవడానికి పది రూపాయలు అడిగింది. దానికి ఇంత రాద్ధాంతం చేస్తారు అని అనుకోలేదు.
అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా పిల్లలు లేకపోవడంతో అది కూడా సాకు గా తీసుకొని, సుగుణ నీ తిట్టడం మొదలుపెట్టారు. అలా బాధపడుతూనే సుగుణ రోజులు వెళ్లదీస్తూ ఉంది.
*****************
అయితే ఒక రోజు హఠాత్తుగా సుగుణ కళ్ళు తిరిగి పడిపోయింది అనే భర్త శేఖర్ కు వార్త అనడంతో వెంటనే సుగుణ పని చేసే డ్యూటీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సుగుణ పడిపోయి ఉంది. ఆ కంపెనీకి డాక్టర్ ఫెసిలిటీ ఉండడంతో అక్కడ చేర్చారు.
శంకర్ రాగానే అక్కడ ఉన్న డాక్టర్ అతన్ని చూస్తూ నువ్వేనా ఆమె భర్త వి అంటూ అడిగింది అవును డాక్టర్ నేనే ఆమె భర్తని అని చెప్పాడు శేఖర్.
ఏమయ్యా వస్తానంటున్నావు నీకు సిగ్గు లేదు. పెళ్ళాన్ని చూసుకునేది ఇలాగేనా అసలు ఆడవాళ్ళు అంటే మీకు చులకన భావం ఎక్కువైపోయింది ఏమీ అనరు ఏమి మాట్లాడాలి అని ఇష్టం వచ్చినట్టు చేస్తారు కాస్తలో ప్రమాదం తప్పింది లేదంటే ఆమె క్రషర్ లో పడి చచ్చిపోయేది. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప చెప్పండి.
ఈ కంపెనీలో పనిచేసే మిగతా ఆడవాళ్లంతా ఎంత బాగుంటారు తెలుసా , వాళ్ళ భర్తలు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో తెలుసా నీకు, వాళ్లు అన్నిట్లో సహాయం చేస్తారు భార్యకు ఇంటి పనిలో, వంట పనిలో సాయం చేసి భార్యకి రెస్టు ఇస్తారు. అంతెందుకు నా భర్త కూడా నాకు చాలా సహాయం చేస్తాడు.
ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాపొద్దున నాలుగు గంటలకు లేచి మీ అందరికీ వండిపెట్టి మీ బట్టలు, ఇల్లు అంతా చూసుకొని ఆమె డ్యూటీకి వచ్చి ఆరు గంటలు అంటే 12 గంటలు పనిచేసి మీకు సంపాదించి పెడుతుంటే మీరు ఆమెను సరిగా నిద్రపోనివ్వకుండా,,,, కనీసం సహాయం చేయకుండా ఇంకా మాటలతో తూట్లు పొడుస్తారా ? ఇవన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా ? నేను మీ ఇంటి పక్కనే ఉంటాను ప్రతిరోజు మీ దండకాలన్నీ వింటూనే ఉంటాను.
ఇప్పుడు చెప్తున్నా విను మీ భార్యకు రెస్ట్ చాలా అవసరం. తను చాలా హాయిగా నిద్రపోవాలి. లేదంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఒకవేళ ఆమెకు ఏమైనా జరిగిందో నేను పోలీస్ కేసు పెట్టి నిన్ను జైలుకు పంపించడం మాత్రం ఖాయం. తర్వాత నీ ఇష్టం.. ఆమెకు మంచి నిద్ర కావాలి. మీరేమో హాయిగా పడుకుంటారు, ఏ పని చేయకుండా ఆవిడేమో 24 గంటలు యంత్రంలా పనిచేయాల. ఇక్కడున్న యంత్రాలకు కనీసం మనం 12 గంటలు రెస్ట్ ఇస్తున్నాం కానీ జీవమున్న మనిషికి మాత్రం రెస్ట్ ఇవ్వడం లేదు.
చూడు శేఖర్ ఇప్పటినుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటా, సుగుణకు ఏమాత్రం హాని తల పెట్టాలని చూసినా నేను వెంటనే పోలీసులకు పట్టిస్తాను జాగ్రత్త .తన వెనుక నేనున్నానని మర్చిపోకు. అంటూ డాక్టర్ వార్నింగ్ ఇచ్చేసరికి శేఖర్ ఏమనాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ, అలాగే డాక్టర్ అలాగే అన్నాడు.
ఇప్పుడు ఇక్కడ అలాగే అని ఇంటికి వెళ్లాక, మళ్ళీ సుగుణను కొట్టాలని, లేదా మాటలు అనాలని ప్రయత్నించావో నేను ఊరుకోను చెప్తున్నా, అంటు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది డాక్టర్ ప్రశాంతి.
వెళ్ళు తనని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు ఆటో మాట్లాడు కో అంది డాక్టర్ ప్రశాంతి. శేఖర్ వెళ్లి ఆటో తీసుకొని వచ్చాడు అప్పటికి ఇంకా సుగుణకు మేలుకువ రాలేదు. అలాగే తనని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి ఆటోలో తాను కూర్చొని తన పక్కనే తనని కూడా తన కాళ్ళ పై పడుకో పెట్టుకున్నాడు.
ఆటో వెళ్తుంది. శేఖర్ సుగుణ ముఖం చూస్తూ పెళ్లెప్పుడు ఎంత అందంగా ఉండేది. ఇప్పుడు ఇలా మారిపోయింది ఇదంతా నా వల్లే అనుకుంటూ ఆమె ముంగుర్లు సవరిస్తూ తమ మొదటి రాత్రి ఆ తర్వాత జరిగినవన్నీ గుర్తుతెచ్చుకుంటూ తాను ఎంత అమానుషంగా ప్రవర్తించాడు, అనేది తెలుసుకో సాగాడు. శేఖర్ కూడా ఎంతో ఎంతో చదువుకున్నవాడే.. మహిళల గురించి అన్ని తెలిసిన వాడే అవడంతో అర్థం చేసుకున్నాడు.
ఆటో ఇంటి ముందు ఆగింది. ఆటోలో వచ్చింది యేవ్వరా అని అనుకుంటూ అందరూ బయటకు వచ్చేసరికి, సుగుణను మెల్లిగా తీసుకొని వస్తున్నాడు. అబ్బో పెళ్లాన్ని ఆటోలో తీసుకొస్తున్నావా ? అంటూ అంటున్న చెల్లి వైపు కోపంగా చూసాడు శేఖర్. దాంతో చెల్లి నోరు చటుక్కున మూతపడింది.
సుగుణ మెల్లిగా తన గదిలోకి తీసుకొని వెళ్లి మంచం పై పడుకోపెట్టాడు. తల్లి ఏంటి ఏం జరిగింది అన్నట్టుగా చూస్తోంది తప్ప మాటలు రావడం లేదు. శేఖర్ బయటికి వచ్చి అందరిని చూస్తూ నా భార్యకు నిద్ర కావాలి. ఇకనుంచి ఇంట్లో పనులు అందరూ కలిసి చేసుకోవాలి .ఏ ఒక్కరైనా తోక జాడిస్తే వాళ్లకు దెబ్బలు తప్పవు అన్నాడు శేఖర్.
శేఖర్ గురించి అందరికీ తెలుసు కోపం వస్తే అసలు మనిషి కాడు. అని తెలిసిన అందరూ తలలు ఊపారు. శేఖర్ చెల్లిని చూస్తూ వెళ్లి వదిన కాళ్ళు పట్టు అంటూ ఆర్డర్ వేశాడు. అమ్మ నువ్వు వెళ్లి ఫ్యాన్ తీసుకొచ్చి మా గదిలో పెట్టు అంటూ చెప్పాడు.
మిగిలిన తమ్ముళ్లు ఇద్దరికీ మీరు వెళ్లి బజారుకు వెళ్లి పళ్ళు తీసుకొని రండి. అమ్మ ఇకనుంచి పొద్దునే లేచి వంట చేసే బాధ్యత నీదే, చెల్లి నువ్వు అందరు బట్టలు ఉతకాలి, తమ్ముళ్లు మీరిద్దరూ కూడా అందరం తలా ఒక పని చేస్తూ సుగుణకు రెస్ట్ ఇద్దాం. ఇక నుంచి నా భార్య కేవలం డ్యూటీకి వెళ్లి రావడం తప్ప ఇంట్లో పని చేసేది ఉండదు. అంటూ గట్టిగా చెప్పాడు.
నేను ఆఫీస్ నుంచి హఠాత్తుగా వచ్చాను. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఒక్కరూ నేను చెప్పింది ,మిరినా తెలుసుగా ఏం చేస్తానో, అంటూ అంటుండగా ఇంతలో సుగుణకు మేలుకువచ్చింది. ఏంటి తన ఇంట్లో ఉన్నానా అనుకుంటూ తెలియక ఏమండీ అంటూ పిలిచింది.
పడుకొనే ఉండు వస్తున్న ,అంటూ లోపలికి వెళ్ళాడు. అతనితోపాటు చెల్లి కూడా వెళ్లి కాళ్లు పట్టుసాగింది. అయ్యో ఇదేమిటి వద్దు నాకు ఏమీ చేయకు రజని నాకేం కాలేదు. అంది సుగుణ. నువ్వు నోరు మూసుకో, ఇన్ని రోజులు చేసింది చాలు. ఇకపై మేము నీకు చేస్తాం .
మా అమ్మ చెప్పుడు మాటలతో నిన్ను చాలా విసిగించాను, నన్ను క్షమించు సుగుణ. ఇకపై నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అంటూ తన రెండు చేతుల్లో చేతులు వేసి ప్రమాణం చేశాడు శేఖర్. ఆ మాత్రం మాటలకే ఉప్పొంగిపోయింది సుగుణ.
ఏమండీ ఇదంతా నిజమేనా అడిగింది, నిజమే సుగుణ ఎందుకు ఆశ్చర్యం , నీ భర్త మారిపోయాడు అన్ని తెలుసుకున్నాడు అని అంటూ డాక్టర్ ప్రశాంతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నావా , ఎన్ని రోజులు వాళ్ళకు సేవలు నువ్వు చేశావు ,ఇప్పుడు వాళ్లు నీకు చేస్తారు సేవలు అంది ప్రశాంతి.
అవును డాక్టర్ ఇన్ని రోజులు నా ఇంటి దీపాన్ని బాధ పెట్టాను. ఇకపై ఆ బాధలేవి ఉండవు, తనకి కూడా విశ్రాంతి అవసరం అన్నాడు శేఖర్. సంతోషించింది డాక్టర్ ప్రశాంతి.
-భవ్య చారు