నేటి బాలలం
చెత్త ఏరుకునే వాళ్ళం
ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకొని
అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళం
ఒక్కరోజు అన్నం కోసం పది కిలోమీటర్లు నడిచే వాళ్ళం
ఫంక్షన్ హాల్ లో మెతుకు కోసం వెంపర్లాడే వాళ్ళం
గంజి నీళ్లు అయినా దొరుకుతాయని ఆశతో సంచి భుజాన
తగిలించుకొని పొద్దున్నే బయలుదేరే వాళ్ళం
ఎక్కడెక్కడ చేత్తుందో చూస్తూ ఈ చెత్త నాదంటే నాదని
పోట్లాడుతూ కొట్టుకొని, తిట్టుకుంటూ చివరికి పందెంలో
గెలిచి ఆ చెత్తను సంచిలో వేసుకొని వచ్చి అమ్మడానికి పోతే
వాడు ఇచ్చే పది రూపాయలు బన్ను కూడా రాదని తెలిసినా
అడిగితే తిడతాడేమో అని మళ్లీ కొనడేమో అని భయపడుతూ బ్రతికే వాళ్ళం.
అయినా మేము ఎవరికీ భయపడం, ఇవన్నీ మాకు రోజు ఉండేవి.
చెత్త అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతో సంతోషంగా నవ్వుతూ ఆటలాడుకుంటూ
ఇసుకల్లో దొర్లుతూ స్వేచ్చగా, హయిగా ఇష్టం వచ్చిన రీతిలో బాల్యాన్ని ఆస్వాదిస్తాం.
పొద్దున లేచి మేము చెత్త ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు కిలోల, కిలోల బ్యాగులు వేసుకొని
స్కూలు బస్సుల్లో వెళ్లే బాధలను చూస్తే మా తోటి పిల్లలను చూస్తే మాకు ఆనందం కలుగుతుంది.
అయ్యో మేము ఆ బడికి వెళ్లలేమే అనే చింత మాకు లేదు ఎందుకంటే అన్నన్ని
కిలోల బ్యాగులు మేము మోయ్యలేము, ఆ చెత్తంతా మా బుర్రలోకి ఎక్కించుకోలేము.
ఇరవై నాలుగు గంటలూ, నాలుగు గదుల మధ్యలో మేము గడపలేము
ఒక ఖైదీలా, గంట కొట్టగానే వెళ్లి అన్నం తిని రాలేము
నచ్చింది తింటాం ,వచ్చింది చేస్తాం. అలాగని మేము అలాగా వాళ్ళం కాదు. జీవిత సారాన్ని నేర్చుకునే వాళ్ళం.
జీవితంలో ఏది చేయకూడదు ఏది చేయాలో తెలుసుకునే వాళ్ళం.
చెత్త ఏరుకుంటూ ఊరంతా తిరిగే వాళ్ళం ఏ గల్లీలో ఏముందో తెలిసిన వాళ్ళం
అదే బస్సులో తిరిగిన వారికి ఇవన్నీ ఏమీ తెలియదు.
చెడుగుడు, వంగుడు దూకుడు, ఈత, ఇవన్నీ వాళ్ళకి తెలియదు.
వాళ్ళు డబ్బులు ఇచ్చి నేర్చుకుంటే, మేము మా సొంతంగా నేర్చుకుంటాం అందుకే మేము నేటి బాలలం.
-భవ్యచారు