నేతన్న జీవితం
పొద్దుగాళ్ల నుంచి పొరగాండ్లు బుక్కెడు బువ్వ తినలే, గీయన సందేవేళ పోయే మగ్గానికి, గా అయ్యా ఈ ఏలా పైసలు ఇత్తాడు లచ్చి గవి ఇయ్యగానే నూకలు పట్టుకొస్తా అని పాయే ఇంకా రాకాపాయే, నడి జాము ఆయే నేనేమి సేత్తురా దేవుడా అని చిరుగుల సీర గప్పుకొని ఏడుస్తుంది లచ్చవ్వ,
జారిపోతున్న లాగు పైకి లాక్కుంటూ చీమిడిని భుజానికి రుద్దుకుంటూ అవ్వ నాకు దారేంట 10 రూపాయలు బిళ్ళ దొరికిందే ఇంకా 1రూపాయి బిళ్లలు దొరికినయె అవ్వ అని ఇగో అని గా పైసల్ లచ్చవ్వ చేతిలో పోసిండు 6 స. ల రవిగాడు, గాన్ని అందరు గట్లనే పిలుత్తరు మరి, వాడేమన్న బలిసినోని కొడుకు కాదు కదా! రవి అని పిలువడానికి,
చేతిలో పడ్డ గా పైసలు సూడగానే దిగ్గున లేసి సావుకారి సావిట్లో నూకలు పట్టుకొచ్చి గంజి కాసి రవిగాని కి ఇంతపోసి, వాడు దాన్ని తాగుతూ ఉంటె సిన్నగా నా కొడుకు ఎంత మంచోడు వీడి స్థానంలో వేరే పోరడు ఉంటే గవన్నీ బయటే కొనుక్కొని తినేటోడు, గియ్యాల రవిగాని వల్ల కడుపు నిండు తుందాయే అనుకుంటూ మురిపెంగా సుస్తుంది లచ్చవ్వ.
వాడెక్కడ దొంగ ముండ కొడుకు నా కడుపులో సెడబుట్టాడు, మగ్గం నేసిన కడా పైసలు ఇయ్యలేదు, అసలు గీ కరోనా కాలంలో పని ఇచ్చుడే ఎక్కువ, పైసలు ఇచ్చినప్పుడు తీసుకోవాలే అని అసామి చివాట్లు పెట్టె.
అసలే అసామి మీద కోపంతో, కాలుతున్న కడుపుతో ఇంటికివస్తుంటే గా కాశయ్య గలిసి మీ పోరడు, సావు బోతుంటే గావాళ్ళు వేసిన పైసలు ఏరుకుండు అనేపటికె, పానం విలవిల పాయే.
చీ దీని యవ్వ గిట్ల కన్నది గిది అని ఇంట్లోకి అడుగుపెట్టి, ఎరా దొంగముండ కొడకా, చేసిందంతా చేసి , ఏం ఎరగనట్లు తింటున్నవా అని కోపంతో రవిగాడి డొక్కలో తన్నాడు రవిగాని అయ్య రాజయ్య, చేతిలో పళ్ళెం దూరంగా పడగా, డొక్కలో దెబ్బ తగలడం అమ్మ అని అరుచుకుంటు, బయటికి ఉరికాడు, ఎన్నడు అయ్య చేతిలో దెబ్బలు తినని రవిగాడు, అన్న ను కొడుతుంటే పళ్ళెం పక్కనపెట్టి ఏడుస్తుంది రవిగాని సెల్లె సిన్నక్క.
ఎందయ్య గవాన్ని కొడతాన్నావ్, అని అడ్డు వచ్చిన లచ్చవ్వను నాలుగు తగిలిచ్చి, ఆకలితో గిన్నెలో ఉన్న గంజిని ఎత్తి నోటిలో పోసుకొని గడ గడ తాగాడు రాజయ్య, కోపం కొద్దిగా తగ్గడంతో, లచ్చి నీ కొడుకు ఏం చేసిండో తెలుసా, సచ్చిన సవం మీద వేసిన పైసలు ఎరుకుంటున్నడంటా గది నా దోస్త్ సెప్పగానే, నా పానం పోయినట్లయిందే, గందుకే గవాన్ని కోపంతో కొట్టిన అన్నాడు రాజయ్య.
గవానికి ఏమన్నా తెలుసా గవి తీసుకోవద్దని, అయిన గా పైసలే గిప్పుడు నీ కడుపు నింపినయ్ తెలుసా అంది లచ్చవ్వ,
అయ్యే, సిన్నోడు మంచోడే, గవాన్ని పిలువే నా కొడుక్కు ఎక్కడ దెబ్బ తాకిందో ఏమో అని కూలబడి రోదించసాగాడు రాజయ్య.
-పోరండ్ల సుధాకర్