నేతన్న
చినిగిన బనీను తో చెమటలు
కారుతున్న దేహం తో, పైన చెయ్యి
కింద కాలు ఆడిస్తూ, నొప్పి తెలియకుండా
ఉండడానికి నోట్లో బీడీ నీ నములుతూ ,
రేపటి కోసం ఆశ పడుతూ పొద్దున్నే పనికెక్కే
నేతన్న , బతుకమ్మ చీరలు నేస్తే బతుకునిస్తుంది అని
నేస్తివి,కానీ చీరలు మాత్రం తీసుకుని సగం ధర కూడా
ఇయ్యక పాయే, మీ నిధులన్నీ మయాల మాంత్రికులు
మయం జేయవట్టే, అనుకొని రీతిలో వరదలచ్చే ,దారాలాన్ని
అగమాగమ్మాయే ,మునిగిన దారం సూసి ముక్కిరిషిరి మంత్రులు
మీ గోడు విననికి రాక మునుగోడు లో మునిగిపోయి మర్షిరి నిన్ను ,
నేతన్నను అవమాన భారంతో
బతుకమ్మ చీరలు నేయం అని ధర్నాలు చేస్తే ఒక్కడూ రాక పాయె,
పట్టించుకొకపోయే , ఇసిగి ఇసిగి ఏసారి పోయి ఇల్లు
పిల్లలు యాది కచ్చి , మధ్యవర్తుల మాట ఇని మానితివి ధర్నా ,
మంచి మంచి అంగిలు నేసే నీకు చుక్కల బనిను
ఖద్దరు అంగిలాయే, పట్టు దారాలతో పట్టు కుచ్చులా మెరిసే అలంకరణ
నేసే నీ చేతులు నీ బిడ్డకు మాత్రం ముతక చీర
ఇస్తివి , ఎన్నో వింతలు చేసే నీ చేతులు నీ అర్ధాంగి కి మాత్రం
అడ్డంగా చినిగిపోయిన చీర తో కట్టెల పొయ్యి ముందల గొట్టం తో ఉదవట్టే ,
నాకింకా మంచి రోజులు వస్తాయని
ఆశ తో , నేసిన సిర ను సుస్తూ మురుసుకుంట పంటవైతివి,
మల్లా తెల్లారే… నేతన్న మగ్గం మూగబోయే, అవతలింట్లో అగని మగ్గం నడుస్తూనే ఉండే….
-భవ్యచారు