నేస్తమా ఎవరు నువ్వు?
నా స్నేహ బంధానివా?
చిన్ననాటి జ్ఞాపకానివా?
పూర్వజన్మ సుకృతానివా?
ఆత్మీయత ఆలంబనవా?
నేస్తమా ఎవరు నువ్వు?
ఆలోచనల్లో ఎంతో అంతరం
మనసుకు లేదుగ ఈ దూరం
నీ ఊహలే నిరంతరం
పెంచావు నా తలపుల భారం
నేస్తమా ఎవరు నువ్వు?
ఈ ఒడిదుడుకుల జీవనసమరం
సుడిగుండాల గాలి దుమారం
నీ స్నేహ వాసంత సమీరం
నా మనసుకు చందన హారం
నేస్తమా ఎవరు నువ్వు?
నీ మాటలు వింటే తెలియదు కాలం
నీ తలపే మదిలో కలగించును మోదం
అందించావు ఆత్మీయపు స్నేహం
నన్ను నాకు పరిచయం చేసావు చిత్రం
అందుకేనేమో
నువ్వే నా ప్రయనేస్తం!!
నా మదికి నీ ఆగమనం
వెయ్యి ఏనుగుల బలం
నా కన్నయ్య మురళీ గానం
ఈ రాధకు వేయి జన్మల ఫలం
నీ కను పాపను చేరిన క్షణం
ఎత్తినాను మరొక జన్మం
నీ పాదాల దూళి పరాగం
నా నుదుటన కుంకుమ తిలకం
నువు నా చెంతన లేకున్నా,
నీ జ్ఞాపకాలు రగిలించును ఖేదం
మీ పేరు వింటే చాలు విచ్చుకొనును నా పెదవి పుష్పం
ఈ జన్మకు మరువగలనా నీ స్నేహ సుగంధం
నా జతనీవైతే అదే
ఈ జన్మకు వసంతోత్సవ సోయగం
నీ స్నేహ పరిమళం
ఆ దేవుడి ఇచ్చిన దివ్యవరం
– సలాది భాగ్యలక్ష్మి