నేల వసంతుడు!!!
నేల వసంతుడు
జూన్ 12 గౌరవనీయులైన సింగిరెడ్డి
నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
కవితల పోటీ కొరకు…
నేల వసంతుడు
తెలుగు భాషా సాహిత్యం ఆనంద సాగరమని
చిలికిన ప్రయత్నం అధోలోకాన సంచారమని
రుచి తెలిసిన పద పాండిత్యంతో ఏకలవ్యుడి
సాధనగా పద గమ్యంగా తెలుగు భాషను నిలుపాలని…దాటని హద్దు దార్శనికంతో
రచనాత్మకమై నిలిచిన నేల తెలుగుమయం
కావాలని ప్రయాణమయ్యెను…
ప్రాపంచీకరణాలతో అడుగంటి పోతున్న
భాషా ప్రావిణ్యాన్ని కాపాడుటకు…
అక్షర భగీరథుడై మధి తలచిన ప్రాయాన్ని
పద పలుకుల పర్వంగా భాషా ప్రయుక్తం
కావాలని ప్రమేయాన్ని కదిలించెను చంద్రుని
వెన్నెల్లో చలువ కాంతుల నీడలో తెలుగు
పాటకు నెలరేడై…ప్రతి మనస్సును
వసంత మాడించిన నేల వసంతుడు…
కదిలిన కలము కవిత్వమై జాలు వారిన
పదాలను పుష్కరిణిలో స్నానమాడించి
వేయి లతల మేణులతో అలంకరణ చేసి
పదారణాల తెలుగు ధనానికి పచ్చల హారమై
హాయిని గొలిపే యుగళ గీతాలతో నెమలి
అడుగులకు నాట్యమై కదలి అనుదినపు
ఆనందాన్ని పురివిప్పి ఆడించిన
మయూఖుడు…..
ఆ….అడుగుల మెత్తధనాన్ని కాపాడుతు
జీవితాన్ని పదాల చదరంగంతో ప్రతి పంక్తిని
అనేక హృదయాలలో పలికిస్తు…వడబోసిన
పద మాధుర్యం కోయిల గొంతున కమ్మని
రాగం కావాలని… ప్రయోగమై సరిగమలకు
రాగమై కరగని మధిలో కావ్యంగా కదులుతు
తేట తెల్లని తెలుగు భాషా ఇతిహాసాన్ని
భావగీతంగా పలికించెను….
పువ్వలను తాకిన స్పర్శతో పదాలను
విప్పుతు…ఆదేశాలతో బంధించని ప్రవాహమై
ఎత్తు పల్లాలను కలుపుకొంటు ఏకమైనా తన్మయత్వంతో పచ్చబడిన తెలుగు నేలలో
ఆనందాన్ని గుళేభకావలి కథగా చెబుతు….
ఎన్నో మైలురాళ్ళను నడిచిన
తన ప్రయానంలో తెలుగు పాటగా అక్షర
సాహిత్యాన్ని కళాఖండమై నిలిపెను…
తన మనస్సులో దాగిన సాహిత్యపు
స్వానుభవాలను కలమై కదుపుతు…
సరస్వతి కటాక్షానికి పాత్రుడై కవియై…
కలానికి స్నేహమై తెలిపిన కాలానికి కథకుడై
విమర్శకుడై…దొరలిన అమృత తుల్యపు
తెలుగు భాషను తన పాటల రూపాన
విస్తరింప చేసిన ఘనుడు మరువలేని
రూపంగా అందరి ఆంతరంగికాన
పద బంధాలతో బతుకుతు ప్రకృతి చిత్రాలతో కనుమరుగవుతున్న పాటల మాంత్రికుడు…
సినారె…..
-దేరంగుల భైరవ