నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయడం ఎలా?
కథలు రాయడం చాలా సులువు కానీ మోరల్ స్టోరీస్ అంటే నీతి కథలు రాయడం చాలా తేలిక అది ఎలా అంటారా నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయవచ్చు
నీతి కథలల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సిందే జీవితంలో కష్టపడుతూ పైకెదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతకడం. ముందుగా అందులో మనకు గుర్తుకు వచ్చేది మనం రోజూ చూసే మన కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బంధువులు, చుట్టాలు ఇలా ఎవరినైనా మనం చూడొచ్చు.
మన చుట్టుపక్కల చాలా మంది జీవితంలో కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళు కనిపిస్తారు. ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి అంటే ఇందుకోసం మనం మన సమాజాన్ని రెండు కళ్ళతో కాకుండా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం అలవాటు చేసుకోవాలి.
రవి గాంచని చోటును కవి గాంచును అన్నారు కాబట్టి మనం ముందుగా చూడాల్సింది మన చుట్టూ ఉన్న సమాజాన్ని. మన నీతి కథల కోసం గొప్ప గొప్ప వాళ్లనే తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జీవితంలో పైకి ఎదిగిన వారిని కూడా మనం పూర్తిగా తీసుకోవచ్చు
మరి మోరల్ స్టోరీ ఎలా రాయాలి?
అసలు మీరు మోరల్ స్టోరీ ఎవరికి చెప్పాలి అనుకుంటున్నారు? ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారు? ఎలా చెప్పాలి అనుకుంటున్నారు తెలుసుకోవాలి. అది చిన్న పిల్లలకు లేదా పెద్ద వారిక అనేది గమనించుకోవాలి. చిన్న పిల్లలకు సంబంధించి అయితే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. పెద్ద వారికి అందులో ఉన్న భావన అంతా చివర్లో ఒక్క మాటలో చెప్పే చాతుర్యం చూపించాలి.
మీకు అనిపించిన చూసిన కథను ఒక రెండు మూడు పాయింట్లతో రాసుకోవాలి. వాటిచుట్టూ పాత్రలను అమర్చుకోవాలి. ఆ పాత్రలతో మాట్లాడిస్తూ పరకాయ ప్రవేశం చేసి మనమే అక్కడ ఉన్నట్లు ఊహించుకుంటూ రాయాలి.
మోరల్ స్టోరీలను పేజీలకు పేజీలు కాకుండా ఒక సింగిల్ పేజీలో అయిపోయేలా చూసుకోవాలి మరీ ఎక్కువ అంటే ఒక 2 పేజీలలో అయిపోయేలా చూసుకోవాలి. అయితే చిన్న పిల్లల విషయంలో మాత్రం వారికి ఇష్టమైన పాత్రలతో చెప్పిస్తూ ఇంకా వివరంగా రాయాల్సి ఉంటుంది. అంటే సహజంగా పిల్లలకి ఏవంటే ఇష్టం (ఉదాహరణకు, జంతువులు, కుక్కలు, కామిక్ పాత్రలు).
అలాగే, మీ రచనల్లో మరి గొట్టు పదాలు కాకుండా చిన్న చిన్న పదాలతో అంటే మీ రచన వాడుకభాషలో ఉండేలా చూసుకోవాలి. కఠినమైన పదాలు రాస్తే పిల్లలకి అర్థం కావు. పెద్ద వారికి కూడా కాస్త కష్టమే….
అందువల్ల మీరు చాలా చిన్న పదాలు వాడుక భాష మీ ప్రాంత భాష ఉపయోగించడం మంచిది. ఇక పెద్ద వారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే చాలామందికి కఠినమైన పదాల అర్థాలు తెలియకపోవచ్చు అందువల్ల మీరు మీ ప్రాంతీయ భాషను వాడడం ఉపయోగించడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆ ప్రాంతం కాని వాళ్ళకి చదవడం కాస్త ఇబ్బంది అవ్వవచ్చు. కానీ ఇక్కడ భాష కన్నా భావం ముఖ్యం. రోజూ వారి పదాలు ఉపయోగిస్తూ ఉంటాము వాటిని మీరు మీ కథలలో రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ జీవనానికి సంబంధించినవి చాలా తొందరగా అర్థమవుతుంది. అందువల్ల మీరు మీ వాడుక భాషను గ్రామీణ ప్రాంతీయ భాషను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఇష్టపదే అవకాశం ఉంటుంది. చేరువ కూడా అవుతాయి.
మీరు మీ జీవితంలో నేర్చుకున్న అనుభవ పాఠాలను కథలుగా రాయవచ్చు కదిలించే విధంగా ఉండొచ్చు లేదా హాస్యంతో కూడినవి అయినా ఉండొచ్చు లేదా బాధ, వేదన వంటివి కూడా మిళితమై ఉండొచ్చు. అయితే మీ అనుభవ పాఠాలను మరీ బాధపడుతూ కాకుండా హాస్యం కూడా జోడించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సి ఉంటుంది.
ఎందుకంటే వారికి అర్థం అవ్వాలి కాబట్టి. పెద్దలకు కూడా అక్కడక్కడా హాస్యం ఉంటే చాలా నచ్చుతుంది అందువల్ల మీరు మీ అనుభవ పాఠాలలో ఎక్కడైనా చిన్నగా హాస్యం అనేది జోడించాల్సి ఉంటుంది.
“నేటి బాలలే రేపటి పౌరులు”
మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ వారికి మనం చెప్పినప్పుడు అవి వారికి అర్థం కాకపోవచ్చు లేదా మనం చెప్పే విషయం వారికి శిక్షగా అనిపించవచ్చు.
అందువల్ల మనం క్లాసులు పీకకుండా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా కథల ద్వారా చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాళ్లకి అర్థం అవుతుంది. అంటే మోరల్ స్టోరీస్ రాయడం అనేది సాగదీయకుండా డైలీ సీరియల్ లా కాకుండా కాస్త చిన్నగా రాయగలగాలి.
అనుకూల చిట్కా:- మోరల్ స్టోరీస్ లో మొదట మీరు పడిన కష్టాలు, అనుభవ పాఠాలు కథలుగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాయడం మీకు కొత్త కాబట్టి మీ అనుభవాలనే కథలుగా మార్చితే అందులో ఉన్న లోతు స్పష్టంగా చెప్పగలుగుతారు.
మీరు పడిన బాధ, వేదన ఆ సమయంలో మీ భావోద్వేగాలు అనేవి అందరికీ మీ పదాల ద్వారా తేలికగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇలా చేయడం ద్వారా మీ రచనలు చాలా మంది చదివే అవకాశం ఉంటుంది.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ కొత్తగా రాసేవారు మోరల్ స్టోరీస్ తో మొదలు పెట్టండి.
– అక్షరలిపి టీం