నీ మాయలో బంధీలమే!
చిన్న కణమే ఆయువు నింపుకుని
నవమాసాల వ్యవధిలో బాహ్య ప్రపంచానికొచ్చి
అనేకానేక సందర్భాలకి తగినట్లుగా ఎదిగి
సుఖం దుఃఖం అనే ఛట్రంలో పడి తిరుగుతూ
బంధాలలో బంధీలయిపోతూనే
మరుక్షణం ఒంటరులయిపోతూనే
నీవాడే చదరంగంలో పావులమైపోతాము
ప్రేమానురాగాలను పెనవేసుకుని ఆనందించేలోపు
దూరంచేసే ప్రేమలకి అలవాటుపడలేక ఏడుస్తుంటాము
కష్టాల కడలిని ఈదలేక ఈదుతూ
దరికిచేరేలోగా సృష్టించే ఆటంకాలకకి జడిసి
మధ్యలో కథ ముగించుకుంటుంటాము
ఇంకొన్నిసార్లు కసిగా పోరాడి ఫలితంపొంది ఆనందిస్తాము
అంతలోనే ఏదోక నష్టాన్నిచ్చి నవ్వేస్తుంటావు
ఇలా నీవాడే చదరంగంలో పావులుగా…
కపట నాటక సూత్రధారివైన నీ మాయలో బంధీలమై
బంధిఖానా వంటి ఈ శరీరంలో చిక్కుకుని
అనేకానేక అవస్థలలో పుడుతూ చస్తూ ఉంటాము
జీవులుగా శాంతిలేక చస్తూనే పుడుతుంటాము
నీ మాయలు తెలియ తరమా లీలా మానసచోరా!
– ఉమామహేశ్వరి యాళ్ళ