నవ్వు- నవ్వించు
ఉదయాన్నే నిద్ర లేచి టైం చూస్తే 8 గంటలు చూపుతుంది. గుండెల్లో రాయి పడినట్టయ్యింది.
ఆఫీసుకు సమయానికి రాకపొతే ఛీఫ్ మేనేజర్ గారు తిట్టే తిట్లకు ఆత్మహత్య చేసుకోవడమే నయం అనిపిస్తుంది.. ఆ ఛండాలునికి చిన్న, పెద్దా, వయసు కూడా చూసి ఛావడు.. 10 గంటలకల్లా ఆఫీసులొ ఉండాలి.
సిటీ ట్రాఫిక్ లో ఆఫీసును చేరుకోడానికి ఎంతలేదన్నా గంట పావు అవుతుంది.. అందులో ఇన్స్పెక్షన్ రోజులు.. ఇంత మొద్దు నిద్ర పోయినందుకు తన మీద తనకే చెప్పలేనంత కోపం వచ్చింది.
గబ, గబా లేచి బాత్ రూమ్ కు వెళ్ళి బ్రష్ చేయడం, స్నానం చేయడం కానిచ్చేసి వంటిపై తడి ఆరకుండానే షర్ట్, ప్యాంట్ వేసుకుని ఏమేవ్! క్యారియర్ రెడీ చేసావా? అని కేకేసేను.. నా భార్య నుండి ఎటువంటి బదులు రాలేదు..
ఏంటా అని చూస్తే పూజగది లో పూజ చేస్తుంది. అర్ధమైంది. పూజగది లో ఉంటే పూజ అయిపోయే వరకు ఎవ్వరి మాట వినదు.. అదో సెంటిమెంట్ తనది.. తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈరోజుకి ఎలాగోలా కాంటీన్లో కానిచ్చెద్దాంలే అని బ్యాగ్ తీసుకుని హుటాహుటిన ఇంటినుండి స్కూటర్ లో బయలుదేరాను..
ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం లో అభిమన్యుడిని గుర్తుకు తెచ్చుకుంటూ స్కూటర్ నడుపుతూ ఉంటే ప్యాంట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ రింగవుతూనే ఉంది.
బండి సైడ్ ఆపి సెల్ ఫోన్ మాట్లాడే తీరిక, సమయం లేదు.. కళ్ళముందర బాస్, తిట్లు తిట్టుకొనే కస్టమర్సు కనపడుతున్నారు. అంతలొ స్కూటర్ ఇంజను ఆగిపోయిన సౌండ్. వెనక వచ్చే వాహనాలను చూసుకుంటూ బండిని రోడ్ సైడ్ ఆపి చెక్ చేస్తే పెట్రోల్ అయిపోయినట్టుంది..
తల కొట్టేసినట్టయ్యింది.. ఓవైపు టెన్షన్.. జేబులో సెల్ ఫోన్ రింగవుతూనే ఉంది. కోపం నషాళానికి అంటింది. నోటికొచ్చినట్లు తిడదామని సెల్ ఫోన్ తీసి చూస్తే ఇంటి నుండి 13 మిస్డ్ కాల్స్..
ఏం అంత కొంప మునిగిపొతుందని ఇన్నిసార్లు ఫోన్ చేయవలసి వచ్చిందని కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి నీకు బుద్ధుందా? ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఫోన్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా?
క్యారియర్ కోసమేగా ఫోన్ చేసావు.. ఈరోజుకు బయట ఎక్కడైనా తిని అఘోరిస్తాలే.. అసలే ఆఫీసుకు టైం అయి నా టెన్షన్ లో నేనుంటే నీదొక నస.. పెట్టెయ్ ఫోన్! అని కాల్ కట్ చేసాను..
మళ్ళీ వెంటనే ఇంటినుండి ఫోన్ కాల్.. ఈసారి నాకు కోపం తారాస్ధాయికి చేరింది.. ఫోన్ లిఫ్ట్ చేసి మళ్లీ ఏం కొంప మునిగిపొతుందని ఫోన్ చేసావు?
అదీ..
అదీ..
అదీ, అదీ..
ఏంటో త్వరగా చెప్పి ఛావు....
..
..
మీరు నిన్ననే *రిటైర్ అయ్యారండీ*