నవతరం

నవతరం

 

గబుక్కున మెలకువ వచ్చింది సుధకు , అమ్మో తెల్లారిపోయిందా అనుకుంటూ అరచేతులు చేసుకుని ,రామా పరంధామ , నువ్వే దిక్కయ్య అంటూ లేచి మంచం సర్దేసి , బయటకు వచ్చింది, పిల్లలు ఇంకా లేవనట్టు ఉన్నారు, కొడుకూ, కొడలూ ఇంకా లేచినట్టు లేదు. హమ్మయ్య సరే ముందు నా పనులు చేసుకుంటాను అనుకుంటూ తానూ కాలకృత్యాలు తీర్చుకుని, ఇల్లు సర్దేసి, తుడిచేసింది సుధ. ఒక కాఫీ పెట్టుకుని తాగుతున్నప్పుడు మెల్లిగా పిల్లలూ, కొడుకు, కోడలు లేచారు.

అందరూ తమ ఫోన్లు పట్టుకుని సోఫాల్లో కూర్చున్నారు. ఈ లోపు సుధ పూజగది సిద్దం చేసుకుంది. కాసేపు అలా చూస్తూ కూర్చుంది. పిల్లలు గాని, కొడుకు, కోడలు కాని ఏమైనా అంటారు ఏమో అని, కాని వాళ్ళు ఎంతకు కదలడం లేదు,అసలు మొహాలు, స్నానాలు ఏవి చేయడం లేదు.

ఇక ఓపిక పట్టలేని సుధ ఏరా పిల్లలు లెండి, లెండి లేచి తొందరగా మొహాలు కడుక్కుని, స్నానాలు అవి కానేచ్చేద్దాం, బాబు రామం వెళ్లి కాస్త మామిడాకులు అవి తీసుకుని రా అంటూ హడావుడి చేసింది. అబ్బా ఎంటమ్మ నీ గోల అన్నాడు రామం. అదేంట్రా అలా అంటావు మన తెలుగు వారి తోలి పండగ ఉగాది ఈ రోజు మర్చిపోయావా ఏమిటి అంది వింతగా సుధ.

నిజానికి రామం పెళ్ళి అయ్యాక ఒకటో రెండో సార్లు వచ్చింది సుధ. ఆ తర్వాత మళ్ళి రాలేదు ఎప్పుడూ , ఇదిగో ఇప్పుడు రావాల్సి వచ్చింది, భర్త హటాత్తుగా కన్నుమూయడం తో చిన్న కొడుకు ఆమెను అమెరికా కు తీసుకుని వెళ్ళాడు ఒక ఆరు నెలలు , అక్కడ ఉన్నప్పుడు సుధ దుఖం లో నుండి కొంత కోలుకుంది. ఆరు నెలలు అవ్వగానే రామం దగ్గరికి వచ్చేసింది. వచ్చిన నెల రోజులకు ఇదిగో ఈ రోజు పండగ పూట వారిని ఇలా చూసి బిత్తర పోయింది.

హ ఎంటమ్మ నీ చాదస్తం ఇప్పుడు మార్కెట్ కి వెళ్లి అవ్వన్నీ తెచ్చేసరికి చాలా సమయం అవుతుంది, కాని నాకు మీటింగ్ ఉంది, నాకు పని చెప్పమాకు అన్నాడు రామం, అదేంట్రా పండగ పూట కూడా ఉజ్జోగామేనా , అవన్నీ ఏమి కుదరదు , పండగ అంటే పండగ చేసుకోవాలి అంతే , వెళ్ళు, వెళ్లి నేను చెప్పినవన్నీ తీసుకు రా అంది తల్లి. ఏంటి అత్తయ్య ఆయనకు ఈ మీటింగ్ చాలా ముఖ్యం, ప్రమోషన్ వస్తే జీతం పెరుగుతుంది, అలాగే నాకు కూడా పనులు ఉన్నాయి, మీరు చేసుకుంటాను అంటే చేసుకోండి కానీ మమల్ని ఇబ్బంది పెట్టకండి అంది కోడలు నీరజ.

ఎంటమ్మ నువ్వు కూడానా అంది సుధ ఆశ్చర్యంగా, తప్పదు అత్తయ్య గారు, రేపు పిల్లల్ని బాగా చదివించాలన్నా, మంచిగా బ్రతకాలి అన్నా ఇవ్వన్ని వదిలేసి పని చేస్తేనే మంచి జీతం వస్తుంది, దాంతో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కాబట్టి కొన్ని వదిలేయక తప్పడం లేదు, ఇప్పుడు పిల్లలకు ఏమి కావాలన్నా , ఏమి చేయలన్నా, రేపటి మా జీవితానికి ఎంతో కొంత మిగుల్చుకోవాలి అన్నా, ఇలాంటివి పక్కన పెట్టి, పని చేయాలి, పని చేస్తే జీతం పెరుగుతుంది, జీతం పెరిగితే ఇంకాస్త మంచి ఇల్లు, కారు లాంటివి, లేదా పిల్లలకు పిక్సేడ్ లాంటివి చేయొచ్చు అంటూ పచ్చి నిజాలు చెప్పింది నీరజ.

నీరజ చెప్పినవి అన్ని సజవుగానే, సబబు గానే అనిపించాయి సుధ కు , కానీ అలా అని మన సంప్రదాయాన్ని మనమే తోక్కేస్తే రేపు పిల్లలకు ఎలా తెలుస్తాయి అనేది సుధ ఆలోచన. ఇంతలో ఇవన్ని వింటున్న దీపక్, దీక్ష ఇద్దరూ వచ్చి ఏంటి నాని ఎదో పండగ అంటున్నావు ఏంటి అంటూ అడిగారు. పిల్లలు రావడం తో అత్తయ్య అర్ధం చేసుకోండి అంటూ కాఫీ కప్పు పట్టుకుని లోపలి కి వెళ్ళింది నీరజ, రామం అప్పటికే లోపలి కి వెళ్ళాడు.

వాళ్ళు అలా వెళ్ళడం చూసి దీర్ఘంగా నిట్టూర్చిన సుధ దగ్గర వచ్చిన పిల్లలను చూస్తూ, నవ్వుతు ఈ రోజు ఉగాది పండగ అమ్మ అంది. ఉగాది పండగా అంటే అన్నారు పిల్లలు, ఆ ఒక్క మాట తో రామం తన పిల్లలకు ఏమి నేర్పలేదని అర్ధమయిన సుధ, వారికీ అన్ని నేర్పించాలని, అవును పిల్లలు మీరు చిన్నగా ఉన్నప్పుడు కుండిలో మనం నాటిన వేప, మామిడి చెట్లు ఉన్నాయా పోయాయా అంటూ అడిగింది. లేదు నాని ఉన్నాయి, అవి కొంచం పెరిగినప్పుడు అమ్మ వాటిని కత్తిరించేస్తుంది, ఈ నెల ఎందుకో కట్ చేయలేదు ఇంకా అన్నాడు దీపక్. ఆ చెట్లు హైబ్రిడ్ చెట్లు కాబట్టి అవి అలా ఉంచింది నీరజ.

సరే పదండి పండగ అంటే ఏమిటో చెప్తాను అంటూ ఆగి మీకు ఏమైనా పనులు ఉన్నాయా అంటూ అడిగింది సుధ అనుమానంగా, లేదు నానమ్మ ప్రిపరేషన్ హాలిడే ఇచ్చారు అన్నారు ఇద్దరూ ఒకేసారి, సరే ముందు మీరు మొహాలు కడుక్కోండి అంది. సరే అంటూ ఇద్దరూ వెళ్లి మొహాలు కడుక్కుని వచ్చాక, ఇద్దరికీ పాలు ఇచ్చేసి, కుర్చేబెట్టి , బొట్టు పెట్టి, తలకు నూనే అంటింది. ఎందుకు నానమ్మ ఇవన్ని అన్నారు పెద్దలు , అంటే ఇలా చేయడం వల్ల దిష్టి ఏమైనా ఉంటె పోతుంది అన్నమాట, ఇవన్ని మీకు తర్వాత చెప్తాను కానీ, ముందు స్నానాలు చేసి రండి అంది సుధ.

వాళ్ళకి ఇవన్ని చాలా వింతగా అనిపించాయి. తాము పుట్టినప్పటి నుండి వాళ్ళ అమ్మ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. ఫేస్టివేల్ అంటే బయటకు వెళ్ళడం, ఎంజాయ్ చేసి, బయటే తిని రావడం అంతే. ఇవే తెలుసు పిల్లలకు , అందుకే నాని చేస్తున్నవి వింతగా, ఇంటరెస్ట్ గానూ అనిపించాయి.అందుకే వాళ్ళు కూడా సంతోషంగా స్నానం చేసి వచ్చారు.
వాళ్ళు రాగానే వారికీ తానూ అంతకు ముందే కొని పెట్టిన కొత్త బట్టలు ఇచ్చింది సుధ. దీపక్ కి చిన్న పంచె, దీక్ష కు పట్టు లంగా జాకెట్ ఇచ్చేసరికి వింతగా అనిపించి , ఎలా కట్టుకోవాలో తెలియక చూస్తుంటే వారికీ కట్టేసింది.

దీక్షకు జుట్టు నున్నగా దువ్వి చక్కగా జడ వేసి మల్లెలు,కనకంబరాలు దండ జడలో పెట్టి, అందంగా ముస్తాబు చేసింది, వారి తోనే కుండి లో ఉన్న మామిడాకులు తెప్పించి, గుమ్మానికి కట్టింది. అలాగే చిన్న వేప చెట్టుకు పూసిన పువ్వు తెంపి తెచ్చింది, ఇంతలో బయట ఆకు కూరల వాళ్ళు రావడం తో మామిడి కాయలు తెచ్చింది తానే వెళ్లి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, ఉప్పు,కారం,మామిడి ముక్కలు,కాస్త కొబ్బరి ముక్కలు వేసి ఉగాది పచ్చడి చేసింది.

నానమ్మ చేస్తున్నవి చూస్తున్న పిల్లలు అదేంటి నాని అన్ని ఒకే చోట కలిపావు అన్నాడు దీపక్, దీపక్ ఇవన్ని ఎందుకు వేసాను అంటే…

బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

మీకు ఇవన్ని ముందు ముందు జీవితం లో అర్ధం అవుతాయి. అంటే కష్టనష్టాలను ఈ పచ్చడిలో కలిపి తింటే మీకు మనోధైర్యం వస్తుంది. జీవితం లో ఏది ఎదురైనా ఎదుర్కోగలం అనే నమ్మకం కూడా వస్తుంది. అలాగే ఈ కాలం వసంత కాలం కాబట్టి ఆరోగ్య పరంగా కూడా ఈ పచ్చడి తినడం చాలా మoచింది, కాబట్టే ఈ పచ్చడి చేసుకోవడం ఆనవాయితి గా వచ్చింది, అంటూ తనకు తెలిసింది చెప్పింది సుధ.

పిల్లలకి కాస్త, అర్ధం అయ్యి కానట్టు గానే ఉన్నా, నాని చెప్పింది మనసులో నాటుకుపోయింది. పూజ అయ్యాక, పచ్చడి ఇద్దరికీ పెట్టింది ముందు యాక్త అన్నా నాని చెప్పింది గుర్తుకు వచ్చి, ఇద్దరూ మళ్ళి అడిగి మరి తిన్నారు. తర్వాత సుధ వంట లోకి దిగింది.పిల్లలు కూడా ఏదో చిన్న సాయం చేస్తూ, నాని చేసేవి అన్ని వింతగా,విచిత్రంగా చూసారు. సుధ, పులిహోర, దద్దోజన, గారెలు, గుత్తి వంకాయ,మజ్జిగ పులుసు, మామిడికాయ పప్పు, చారు తో పాటూ బొబ్బట్లు (బక్షాలు), రవ్వ కేసరి కూడా చేసింది.

ఆ వాసనలకు లోపల బెడ్ రూమ్ లో ఉన్న రామం, నీరజ ఇద్దరూ బయటకు వచ్చారు. వారిని చూసిన సుధ, రండర్రా అంటూ పిలిచి, వాళ్ళిద్దరికీ కొత్త బట్టలకు పసుపు, కుంకుమ పెట్టి ఇచ్చి, స్నానం చేసి రండి, భోజనం చేద్దాం అంది. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని వచ్చారు. ఇద్దరికీ తమ ఇల్లు తమకే కొత్తగా అనిపించింది. వాకిట్లో ముగ్గు, గుమ్మాలకు మామిడి ఆకులూ, వేప కొమ్మలు, ఇంటి నిండా ధూపం వాసనా తో ఒక దేవాలయం లా అనిపించింది.

నీరజ అవన్నీ చూసి అత్తగారి వైపు ఆరాధనగా చూసింది. సుధ చిరునవ్వు నవ్వి, చూడమ్మా అన్ని జీవితం లో భాగమే కాదు అనడం లేదు కానీ మన సంప్రదాయాన్ని కూడా మనం గౌరవించుకోవాలి, రేపు నీకు కోడలు వస్తే ఇవన్ని నువ్వు కూడా చెప్పాలి కదా, అలా అని నేనేమి నిన్ను దెప్పి పొడవడం లేదు, ఎందుకంటే మీ పిల్లల గురించి మీరు ఆలోచించారు తప్పు లేదు, కానీ మీ పిల్లలతో గడపాల్సిన సమయాన్ని తగ్గించి, వారికీ తెలియల్సినవి తెలియకుండా పెంచడం కూడా మంచిది కాదు.

అందుకే నా పిల్లల గురించి నేనూ ఆలోచించాను. మనసులో దిగులు, ద్వేషం పెట్టుకోకు, నువ్వు నాకు కూతురు లాంటి దానివే, సరేనా పదండి ఇప్పటికే ఆలస్యం అయ్యింది, భోజనం చేద్దాం అంది సుధ. రామం, నీరజ ఇద్దరూ సుధ కాళ్ళకు నమస్కరించారు. సుధ వారిని ఆశిర్వధించింది మనస్పూర్తిగా.

ఆ పై భోజనాలకు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే అలా కాదు, అంటూ అందరికి ఆసనాలు వేసి, కూర్చోండి అంటూ , పచ్చని అరిటాకులో అన్ని వడ్డించింది.పిల్లలు అన్ని వింతగా చూస్తూ తింటే ,రామం , నీరజ ఎన్నాళ్ళకు మంచి భోజనం తింటున్నట్టు గా కడుపు నిండా తిన్నారు, వాళ్ళు అలా కడుపు నిండా తింటుంటే సుధ మనసు తృప్తిగా నిండిపోయింది.

తర్వాత నీరజ అత్తగారికి వడ్డించింది. అందరూ భోజనాలు అయ్యాక . అమెరికాలో ఉన్న తమ్ముడు రాజేష్ వీడియా కాల్ చేసాడు, తల్లి తో పాటూ అందరూ మాట్లాడారు, అక్కడ అమెరికాలో తమ్ముడు కూడా ఇదే పద్దతిలో పండగ జరుపుకున్నాడు అని తెలిసి రామం , నీరజ అత్తగారి వైపు అభిమానంగా చూసారు. ఆవిడే అన్ని నేర్పించి ఉంటుందని అర్ధం చేసుకున్నారు, ఇక పై తాము కూడా ఇలాగే చేసుకోవాలని మనసులో అనుకున్నారు.

ఇక సాయంత్రం సుధ ఆజ్ఞ ప్రకారం అందరూ దగ్గరలోని రామాలయానికి పంచాంగ శ్రవణం వినడానికి వెళ్లారు. నాని పంచాంగ శ్రవణం ఏంటి అంటూ అడిగింది దీక్ష. అమ్మా పంచాంగ శ్రవణం అంటే ఈ సంవత్సరం మనకు, ఎలా ఉండబోతుంది, పంటలు బాగా పండుతయా , లేదా, ఎందరు తిడతారు, ఎందరు మెచ్చుకుంటారు అనేది ముందు గానే చెప్తారు, అంటూ వివరించింది. అవన్నీ ముందుగానే ఎలా తెలుస్తాయి నాని అంటే అదంతా మన పూర్వికులు అలోచించి రాశారు తల్లి. ముందు తరాల కోసం, వారికి తెలియాలనే ఉద్దేశ్యం తో రాసి పెట్టారు, వారు తపస్సులు చేసి, ఈ జ్ఞానాన్ని సంపాదించారు అంటూ చెప్పింది.

నాని నిజంగా మన పండగలు, సంప్రదాయాలు చాలా గొప్పవి కదా, అందుకే ఫారినర్స్ మన దేశానికి వస్తారు మా స్కూల్ దగ్గర గుడి ఉంది , అక్కడికి ఫారినర్స్ వస్తూ ఉంటారు అన్నాడు దీపక్ ఆ రాత్రి సుధ బెడ్ రూమ్ లో పడుకున్నప్పుడు, అవును నాన్న మన సంప్రదాయాల్లో నీతి, నియమాలతో పాటూ ఆరోగ్యం, సామాజికంగా అందరూ ఒక్కటిగా ఉండాలని , అన్ని కుల మతాలు కలిసి జరుపుకునే పండగలు కూడా పెట్టారు అంది సుధ కళ్ళు మూసుకుంటూ, పిల్లలు కూడా సంతోషంగా, నీరజ, రామం లు తృప్తిగా నిద్ర పోయారు.

ఎప్పటిలా తెల్లారింది. అందరూ లేచారు నాని నాని అంటూ పిల్లలు సుధ గది లోకి వెళ్ళారు, అక్కడ సుధ బ్యాగ్ సర్దుతూ కనిపించడం తో, ఏంటి నాని ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు పిల్లలు ఇద్దరు. ఆ మాటలు విన్న రామం,నీరజ కూడా అక్కడికి వచ్చారు.,ఎంటమ్మ ఎక్కడికి ప్రయాణం అంటూ ఆదుర్దాగా అడిగాడు రామం. ఏంట్రా ఇంకెన్ని రోజులు ఉండాలి నేను నీ ఇంట్లో అందుకే నేను ఊరెళ్ళిపోతున్నాఅంది సుధ నింపాదిగా.

నిన్నంతా ఇల్లంటే ఇలా ఉండాలి అని స్వర్గం చూపించి,ఇప్పుడు వెళ్తానంటావు ఎంటమ్మ అని అడిగాడు రామం, దానికి సుధ వెనక్కి తిరిగి నేనూ ఎన్నాళ్ళు ఉంటాను రా , ఇది నీ ఇల్లు, నీ సంసారం దీన్ని స్వర్గం లా మీరే మార్చుకోవాలి, కానీ నా పై ఆధారపడి ఎన్నాళ్ళు ఉంటాను, కాబట్టి నేనూ ఊరెళ్ళి ఉంటాను. పండగలప్పుడు మీరు అక్కడికి రండి. సరేనా అంటూ చిరునవ్వుతో బ్యాగ్ పట్టుకుని ముందుకు నడిచింది.

నిజమే తల్లి చెప్పింది నా ఇంటిని నేనే స్వర్గం లా మార్చుకోవాలి. ఎప్పుడూ డబ్బు కోసం పరుగెత్తితే పిల్లలకు ఏవి తెలియకుండా పోతుంది. నా పిల్లలకు అన్ని నేర్పాలి అని దంపతులు ఇద్దరూ అనుకున్నారు.

ఇక వారికి నేను చెప్పాల్సింది ఏమి లేదనుకున్న సుధ పిల్లలను దగ్గరికి తీసుకుని , నాన్న, తల్లి, అమ్మనాన్నలను కష్టపెట్టకుండా బుద్ధిగా ఉండండి అంటూ వీడ్కోలు పలికింది.

ఆటో రాగానే ఎక్కి కూర్చుంటే నానమ్మ నేనూ పండక్కి నీ దగ్గరికే వస్తాను అన్నాడు దీపక్. అలాగే నాన్న అంటూ చేయి ఉపింది సుధ. అందరి మనసులు బరువెక్కాయి, ఆటో ముందుకు కదిలింది.

నవతరం పిల్లలకు మన సంప్రదాయాన్ని ,ఆచారాలను మనమే నేర్పాలి, ఎవరో వచ్చి నేర్పరు, అలాగే డబ్బు సంపాదించాలి కానీ అదే సమయం లో పిల్లలతో కూడా గడపాలి. ఆనందంగా ఉండాలి అనేదే నా కథ సారాంశం.

.

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *