నాన్నతో నా ప్రయాణం
నేను ఆరో తరగతిలో ఉండగా జరిగిన ఒక సంఘటన ఇది. మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆయన పని చేసే చోట ఒక లెక్కల మాస్టారు కొత్తగా స్కూటర్ కొన్నారు.
అయితే మా నాన్నగారికి ఎప్పటి నుండో స్కూటర్ నడపాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో ఆ మాస్టారు ను ఒక్కసారి స్కూటర్ ను ఇవ్వండి. కాసేపు నడిపి ఇస్తాను అని అడిగారు.
కానీ ఆయన ఛత్ వీల్లేదు, అసలు నీకు బండి నడపడం వస్తుందా, నీకు బండి గురించి ఏం తెలుసు అంటూ అవమానించేసరికి నాన్నారి లో ఆవేశం కట్టలు తెంచుకుంది.
దాంతో అవమాన భారంతో ఇంటికి వచ్చేసి, చాలా రోజులుగా దాచుకున్న డబ్బు కొంత, అక్కడా, ఇక్కడా అప్పులు చేసి మరికొంత డబ్బు పెట్టేసి, వారంరోజుల్లో ఒక కొత్త బండి కొనేసేసారు.
ఇక దాంతో తెల్లారు ఝామున లేచి గ్రౌండ్ కి వెళ్లి పట్టుబట్టి మరి వారం రోజుల్లో బండి నడపడం కూడా నేర్చేసుకున్నారు.. సెలవు పెట్టి మరి పంతంతో ఎలాగైనా ఆ మాస్టారు ముందు తానేంటో నిరూపించాలని ఇదంతా చేశారు.
బండి నేర్చుకోవడం పెర్ఫెక్ట్ గా వచ్చాక ఒక శుభ ముహూర్తాన ఆ కొత్త బండి పై దర్జాగా పాఠశాలకు వెళ్లారు. ఆ బండి నీ చూసి అక్కడున్న వాళ్ళు, నాన్నగారిని అవమానించిన మాస్టారు భలే గొప్పగా చూశారు. ఆ మాష్టారు గారి మొహం పాలిపోయింది.
నల్ల బొగ్గు లా మారింది. ఎందుకంటే అతను కొన్న బండి సెకండ్ హ్యాండ్ ది మరి మా నాన్నగారు కొన్నది కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన స్కూటర్ కాబట్టి అలా మారిందన్నమాట.
నాన్నగారు తన బండి పార్క్ చేసి తాళాలు తీసుకుని వెళ్లి అతని చేతిలో పేట్టి ఒక్క రౌండ్ వెళ్లి రండి మాష్టారు అంటూ అనేసరికి పాపం అతని తల భూమిలోకి కుంగి పోయింది.
అతని కుసంస్కారం ముందు మా నాన్నగారి గొప్పతనం మతాబులా వెలిగింది. ఆ విషయం పక్కన పెడితే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ప్రతీ యేడు లాగానే మా నాన్నమ్మ గారి ఉరెల్లాలని అనుకున్నాం.
అయితే నాన్న గారు ఒక ప్రపోజల్ తెచ్చారు. అదేంటంటే తాను స్కూటర్ పైన వచ్చేలా, అమ్మ తమ్ముళ్ళు బస్ లో వచ్చేలా. ఇక చేసేదేం ఉంది.
ఆయన కోరిక ఏంటంటే తను కొన్న స్కూటర్ నీ తన వారికి చూపించాలని ఉంటుంది కదా, సో ఇక మేము సరే అన్నాం. కానీ నాన్న స్కూటర్ పై నేను వెళ్తాను అని అనడం తో అమ్మ, తమ్ముళ్ళు బస్ లో స్టార్ట్ అయ్యారు.
మేము ఉన్న ఊరు నుండి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు చాలా దూరం, దాదాపు రెండు వందల కిలోమీటరు అనుకుంటా, ఇక ప్రయాణం మొదలు అయ్యింది. పొద్దున్నే ఎండ రాక ముందే స్టార్ట్ అయ్యాం, మధ్యలో ఒక చోట ఆగి టిఫిన్ చేశాం.
నాన్న ముందు నడుపుతూ ఉంటే వెనకాల కూర్చున్న నేను వీస్తున్న చల్లని గాలినీ ఆస్వాదిస్తూ, ప్రకృతిని చూస్తూ, తోవలో వచ్చిన చిన్న పల్లెలను వింతగా, కొత్తగా అన్నీ గమనిస్తూ అలా సాగిపోయాం.
అలా వెళ్తున్న మాకు అమ్మ వాళ్లు బస్ మారే స్టేజ్ రాగానే అక్కడ మేము కూడా ఆగిపోయాము. అక్కడ అందరం కలిసి అమ్మ చేసి తీసుకుని వచ్చిన పులిహోర తిన్నాం. కాసేపు కూర్చున్న తర్వాత ఎండ ఎక్కువ ఉందని అక్కడే సాయంత్రం అయ్యేవరకు ఉన్నాం.
నాలుగు గంటలకు కాస్త చల్లబడిన తర్వాత అమ్మవాళ్ళను బస్ ఎక్కించి, మేము బండి దగ్గరికి వచ్చేసరికి, అక్కడ నాన్నగారికి తెలిసిన పాత స్నేహితుడు ఒకరు కనిపించారు. ఇక వాళ్ళు కబుర్లలో పడ్డారు. నాన్న నేను వెళ్దాం అన్నా కూడా అతనితో మాట్లాడుతూ ఉండి పోయారు.
అతను చాలా రోజులకు కనిపించడంతో మా నాన్నగారిని తీసుకుని డ్రింక్ చేయడానికి వెళ్లాడు. డ్రింక్ అంటే తాటి కల్లు. వేరేది కాదు. అది తియ్యగా ఉంటుంది అంట, నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఇది చాలా ఫేమస్. అలాగే అక్కడ విరివిగా దొరికేది.
అప్పుడే చెట్ల నుండి తీసిన కల్లు చాలా బాగుండేది. నాకెలా తెలుసు అంటే నేను చాలా సార్లు తాగాను కదా, ఇక నన్ను కూడా రమ్మన్నారు నాన్నగారు. వెళ్ళాక అక్కడ ఒక లోట్టి తీసుకుని, ఆకులు పట్టుకుంటే ఆకుల్లో అతను పోస్తున్నాడు. ఇది నాకు కొత్త, అంతకు ముందు నాన్నమ్మ గ్లాస్ తో ఇచ్చేది.
ఆడపిల్లలకు ఆరోగ్యపరంగా మంచిది అని నాన్నమ్మ మా అత్తలకి, అమ్మకు చిన్నమ్మకు ఊరెళ్ళిన ప్రతిసారీ పొద్దున్నే తెప్పించి ఇచ్చేది. పాసి కల్లు అంటారు దాన్ని తాగించేది. అది తియ్య తియ్యగా, చిరు చేదు గా ఉండేది. ఇప్పుడు దొరికేది అది కాదు. అంతా కల్తీనే.
ఇక నేను కూడా ఆకు పట్టుకున్నా, కానీ నాకు తాగడానికి రాలేదు. అది చూసిన ఆ గౌడన్న ఆకును చుట్టి ఇచ్చాడు. దాంతో కొంచం తాగాను కానీ అది ఎలాగో అనిపించింది. అయినా బాగుంది తాగేసాను.
తాగిన తర్వాత నాన్నగారి స్నేహితుడు వెళ్ళిపోయాడు. నాన్న ఎప్పుడూ తాగరు ఎప్పుడో ఒకసారి ఒక రెండు గ్లాస్ లు అంతే, అది కూడా వేసవిలో వేడి భరించలేక తాగుతారు. అలాంటిది ఇప్పుడు ఆ స్నేహితుడు కబుర్లతో కాస్త ఎక్కువే అయ్యింది.
ఊగుతున్నారు. నాకు భయం వేసింది. నాన్న బస్ లో వెళ్దాం అన్నాను. కానీ వద్దు నేను బాగానే ఉన్నాను అంటూ బండి స్టార్ట్ చేశారు. వెనక కూర్చున్న నాకు కూడా కళ్ళు మూసుకు పోతున్నాయి.
ఆకులో తాగడం వల్ల ఎంత తాగామో తెలియలేదు. ఎక్కువే తాగినట్లు ఉన్నాం. బండి అలా ఊర్లోకి ఎంటర్ అయ్యింది. అప్పుడు సమయం రాత్రి ఏమిమిది గంటలు అవ్వొచ్చు.
ఆ బండి చప్పుడుకు పడుకున్న వాళ్ళు లేచి విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ పల్లెలో బండి ఎవరికీ లేదు. ఎవరా అని, ఊరు ఎంట్రెన్స్ లోనే మా బాబాయి, అత్తలు, తాత ఎదురు చూస్తున్నారు. అమ్మవాళ్ళు ఆరుగంటలకే చేరారు.
మేము బండి మిద వస్తున్నాం అని తెలిసి, ఇంకా రాలేదు ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అందుకే ఆలస్యం అయ్యిందనే భయం, ఆత్రం వల్ల మా కోసం చూస్తున్నారు.
వాళ్ళను అలా చూడగానే నేను మామూలుగా ఉన్ననేమో అనుకుని, స్కూటర్ పై నుండి దూకాను. దాంతో బండి అటూ, ఇటూ ఊగాగానే మా బాబాయి వచ్చి స్కూటర్ ని గట్టిగా పట్టుకున్నారు. దాంతో నాన్నగారు కింద పడకుండా ఉన్నారు.
నాకు మాత్రం కిందకి దూకడం వల్ల మోకాలు చిట్లి రక్తం కారడం మొదలయ్యింది. దాంతో నేను ఏడుపు మొదలు పెట్టాను. అది చూసి మా నానమ్మ నన్ను ఎత్తుకుని. ఇంటికి తీసుకువెళ్లి సున్నం రాసింది. కాసేపు మండినా తర్వాత నొప్పి తగ్గింది.
ఇక బండిపై అంత దూరం ఆడపిల్లను పెట్టుకుని వస్తావా అంటూ నాన్నమ్మ నాన్నను పాపం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. కానీ నాన్నగారు నన్ను చూసి నవ్వారు. ఏమైతేనేం ఆ రాత్రి ఇక అన్నము తిని బజ్జున్నాం.
ఇప్పుడు నాన్నమ్మ, నాన్న, అత్తలు ఎవరు లేరు. ఉన్నవాళ్లు కూడా దూరం పెట్టారు. ప్రేమలు, ఆప్యాయతలు లేవు, మేము కాదు నేను ఒంటరిని అయ్యాను. నాన్న ఉన్నప్పుడే ఎంతో బాగుండేది.
నన్నెందుకు వదిలి వెళ్లవు నాన్న, నిన్ను తలచుకొని క్షణం ఉండదు, నీతో గడిపిన రోజులు, ఆ బాల్యం మళ్లీ కావాలి నాన్న, నీ దగ్గరికి రావాలని ఉంది నాన్న, కానీ బాధ్యతల నడుమ బంధీని అయ్యాను.
నాన్న నీ ప్రేమ వెలకట్టలేనిది. ఇంతకీ నాన్నగారు ఎందుకు నవ్వారు అంటే మేము తాగాము అని ఎవరు కనిపెట్టలేదు. అందుకే నవ్వారు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు, ఎవరితో చెప్పకండి…..
– అర్చన