నమ్మకం – కథ
అర్జంట్ పనిమీద అమీర్ పేట వెళదామని మియాపూర్ మెట్రో స్టేషను కు వచ్చాను. మెట్రో రైలు ప్లాట్ఫామ్ లోకి వస్తోంది ట్రైనప్పుడే. స్టార్టింగ్ పాయింట్ కావటంతో సీటు ఈజీగానే దొరికింది. ఒక నలభైఏళ్ల నడి వయస్కుడు నావంక తేరిపార చూస్తున్నాడు.
కొంచెం ఇబ్బంది గా కదిలాను.
నా ఇబ్బంది గమనించినట్టున్నాడు. తాత్సారం చేయకుండా విషయంలో కి వచ్చేశాడు.
“మీరు ప్రసాద్ అంకుల్ కదా!” అంటూ నా రెస్పాన్స్ కోసం చూశాడు. “నన్ను గుర్తుపట్టలేదా! మోహన్ ని. మా బాబాయ్ వెంకట్రావు మీరు కొలీగ్స్ బి. హెచ్.ఇ.ఎల్ లో గుర్తుకొచ్చారా మీకు ఆయన!”
“ఆ..ఆ..గుర్తుకొచ్చారు” ఆలోచిస్తూనే అన్నాను.
వెంకట్రావు ఎందుకు గుర్తులేడు. రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇతను ఎవరు! తెలీకుండానే మనసు లెక్కలేస్తోంది..
“అంకుల్ ఒకసారి మిమ్మల్ని నేను, అక్కడ కీర్తి మహల్ హోటల్ దగ్గర కలిశాను గుర్తుందా!”
కీర్తి మహల్ అనగానే నా బుర్ర కోటికాంతులు వెలుగుతాయి. కొలీగ్స్ అందరం ఇంటికెళ్ళేముందు కాసేపు కూర్చుని కాఫీయో, టీయో తాగి వెళుతుండేవాళ్ళం. ఇతగాడిని చూసినట్టు గుర్తు లేదు.
“ఇప్పుడేం చేస్తున్నావు” “నేనో సాఫ్ట్ వేర్ కంపెనీ రన్ చేస్తున్నాను. కానీ అంకుల్ ఆ రోజు మీరెంత సహాయం చేశారో తెలీదు.” ఏం చేశానో నాకు గుర్తు లేదు కానీ ఇతను గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్య మనిపించింది.
“ఇంతకీ ఏమయింది ఆ రోజున” అప్రయత్నంగా అడిగాను. తలదించుకుంటూ మొదలెట్టాడతను.
“నేను అప్పట్లో మా బాబాయ్ వాళ్ళింట్లో ఉండేవాడిని. మా బాబాయ్ కి నన్ను తనింట్లో ఉంచుకోవటం అంత ఇష్టం లేదు. అది మా నాన్నకు నేను చెప్పలేను. పల్లెటూళ్ళో కొద్దిపాటి భూమితో వ్యవసాయం చేసేవాడి దగ్గర డబ్బు లేముంటాయి. అందుకే డిగ్రీ అవగానే నన్ను హైదరాబాద్ పంపించాడు, తమ్ముడు సాయం చేయకపోతాడా అని!
కానీ మా బాబాయ్ కి అంత ఇంట్రెస్ట్ లేదు. నన్నెక్కువగా ఇంటి పనులకు వాడుకునేవాడు. మా పిన్నే కాస్త మంచిది. బ్యాంకు ఎగ్జామ్స్ రాయటానికి సాయం చేసేది.
అలా ఒకరోజు అప్లికేషన్ లకి, ఫీజులకి అడిగితే మా పిన్ని ఐదొందలిచ్చింది. మిగిలింది ఇచ్చేస్తానని చెప్పాను.
ఎక్కడ జారిపోయిందో ఆ ఐదొందల నోటు జారిపోయింది. ఏం చేయాలో తెలీదు. అప్లై చేయటానికి ఆ రోజే లాస్ట్. ఏం చేయాలో పాలుపోక అలా రోడ్డు మీద తిరుగుతుంటే, మీరు కనిపించారు. నేనెవరో పరిచయం చేసుకుని మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగ్గానే వెంటనే ఐదొందలిచ్చేశారు. ఆ ఐదొందలు నా జీవితాన్ని మార్చేశాయంటే నమ్ముతారా?!
ఆ రోజు అప్లై చేసిన బ్యాంక్ ఎగ్జామ్ లో పాసయి జాబ్ సాధించాను. మా బాబాయ్ ఇంట్లోంచి బయటకొచ్చేశాను. నా కాళ్ల మీద నేను నిలబడటం అలవాటు చేసుకున్నాను.
అక్కడితో ఆగిపోకుండా సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ నేర్చుకుని బ్యాంకు జాబ్ మానేసి సాఫ్ట్వేర్ బూమ్ లో మంచి కంపెనీలో చేరాను. అక్కడినుంచి కంపెనీలు మారుతూ సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ మీరు నా జీవితాన్ని మలుపు తిప్పారని అప్పుడు తెలుసుకోలేకపోయాను. అది తెలుసుకోవటానికి పాతికేళ్లు పట్టింది.
మీ గురించి మా బాబాయ్ ని అడగటానికి అహమడ్డొచ్చింది. కానీ నాలో గిల్టీ ఫీలింగ్ పెరగసాగింది. ఇక మా బాబాయ్ నే అడగాలని అనుకుంటుంటే ఇదిగో మీరిలా కనిపించారు. బహుశా నా స్ట్రాంగ్ డిజైర్ మిమ్మల్ని చూపించిందేమో.
ఇదీ నా కథ అంకుల్. పాతికేళ్లు కదా చాలా దూరం వచ్చేశాను” అలా సినిమా రీలులా గతాన్ని చూపించాడు.
ఈలోగా మెట్రో అనౌన్సర్ అమీర్ పేట వచ్చామని ప్రకటిస్తోంది.
Doors will open on the left Please Mind the gap అని చెబుతోంది.
“నీకు, నీ జర్నీకి అభినందనలయా ఆలస్యంగా” అంటూ వెర్రి నవ్వు నవ్వి దిగుతుంటే వెంటే దిగాడతను.
“రండి సార్, కాస్త కాఫీ తాగుదాం, అయితే బిల్లు నాది ఈసారి”
స్టేషన్లో ఉన్న కాఫీ షాప్ కు తీసుకెళ్ళాడు. ఇద్దరికీ కాఫీ ఆర్డరిచ్చాడు. చెప్పినట్లుగా బిల్లు అతనే కట్టాడు.
“అంకుల్ మీకు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఉందా”
“ఉంది.. దేనికి..”
“చెబుతాను.. మీ నంబర్ ఇవ్వండి”
ఇలా నంబర్ ఫీడ్ చేసుకున్నాడో లేదో అలా వెంటనే నాకో మెసేజ్ వచ్చింది. చూస్తే పదివేలు నాకు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్.
“ఏమిటిది మోహన్. నీకేమయినా పిచ్చి పట్టిందా” కొంచెం కోపం, ఆశ్చర్యం కలిపి అడిగాను.
“అంకుల్ ఆరోజు మీరు చేసిన సాయం నా జీవితాన్ని మార్చేసింది.
మన గమ్యం చేరాక ఎక్కడినుంచి మొదలయ్యామో వెనక్కి తిరిగి చూసుకోకపోతే ఆ జర్నీకర్థం లేదని ఎక్కడో చదివాను”
“అది సరేబాబూ ఎప్పుడో ఇచ్చిన ఐదొందలకి పదవేలివ్వటమేమిటి!” సిగ్గుగా అనిపించి అడిగాను.
“నేనిచ్చింది తక్కువే అంకుల్. అది వడ్డీ అనుకోండి. ఇది నా ఆఫీస్ కార్డు.” పర్స్ లోంచి విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టాడు.
“మీకెలాంటి అవసరమున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఐ విల్ టేక్ కేర్ వస్తానంకుల్” ముందుకి సాగిపోయాడు మోహన్ అనే పేరున్న ఆ అపరిచితుడు.
పాతికేళ్ల కితం ఐదొందలిచ్చానని నాకు పదివేలు ట్రాన్స్ఫర్ చేశాడు.
‘నువ్వు, ఎవడు ఏ కథ చెప్పినా డబ్బులిచ్చేస్తావు. అది నీ వీక్నెస్’ అని మిత్రులు ఏడిపించేవారు.
ఈ సంఘటన చెబితే ఏమంటారో అనుకున్నాను. మనుషుల్లో కృతజ్ఞత ఇంకా బతికే ఉందనుకున్నాను.
కార్డు లో అడ్రస్ చూశాను. ఉలిక్కిపడ్డాను.
మా అబ్బాయి ఉద్యోగం కోసం నేనే కంపెనీ కి వెళదామనుకుంటున్నానో ఆ కంపెనీ ఎమ్.డి.గా ఉన్నాడీ మోహన్. ఆశ్చర్యం.
మోహన్ బాబాయ్ ఆ కంపెనీ ఎమ్. డి. రామ్మోహన్ కి, తన పేరు రిఫరెన్స్ గా చెప్పమన్నాడే కానీ తన అన్న కొడుకే ఎమ్.డి. అని చెప్పలేదు. మోహన్, రామ్మోహన్ ఒకరేనా.. నమ్మలేకపోయాను. కానీ నమ్మాల్సి వచ్చింది. టైం బావుంది అంటే ఇదేనా.
కరోనాతో ఎన్నో జీవితాలు నలిగిపోయాయి. ఎక్కడో కానీ వెలుగు కనిపించటం లేదు. ఇవాళ ఆ వెలుగు కిరణం నాపై పడింది అనుకుంటూ ఉత్సాహంతో నేనూ ముందుకు కదిలాను. మోహన్ మళ్ళీ ఆదుకుంటాడన్న నమ్మకం కలిగింది
– సి. యస్ .రాంబాబు