నాకు నచ్చిన ప్రదేశం
ఏదైనా సరే ఎక్కడైనా సరే ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఏ అలికిడి లేకుండా గలగల పారే జలపాతాలు నడుమ పచ్చటి ప్రకృతి మధ్యలో ఒంటరిగా నేను ఒక్కదాన్ని నా భావాలకు అక్షర రూపం ఇస్తూ, నాలో నేను ఆలోచిస్తూ, అంతటి ప్రకృతిని ఆస్వాదిస్తూ నాలో నేను మమేకమవుతూ నాతో నేను మాట్లాడుతూ
నాలో నేనే సంఘర్షణ పడుతూ .అక్షరమాలలు కూర్చుతూ , ఆనందిస్తూ నా మనసులో ఉన్న సంఘర్షణ అంతా పక్కనపెట్టి ప్రకృతి తో మాట్లాడుతూ తన సమాధానం చెప్తుంటే ఆ సమాధానాన్ని నాలో దాచుకుని ఆ సుగంధ పరిమళాలను వెదజల్లే పువ్వులను ఆఘ్రాణిస్తూ,
వాటిని చూసి మైమరచిపోతూ, సమాజానికి దూరంగా ఏ కల్మషాలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఇలాంటి బాధల బంధువులు లేని ఆ చక్కటి ఉంటది నిశ్శబ్ద ప్రదేశంలో విహరిస్తూ, నర్తిస్తూ నాకు నచ్చిన పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ
ప్రకృతిలో ప్రకృతి నయి, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై ,జలంలో జలం నై , ఆ విశాల ప్రపంచంలో నేనొక్కదాన్నే మన విహారానికి వచ్చిన వనకన్యలా , ఎలాంటి బాధలు కోపాలు ఆవేశాలు లేని నాకంటూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుని, నాలో నేనే నవ్వుకుంటూ, నాతో నేనే కలిసిపోతూ , దుర్మార్గపు మనుషులకు దూరంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటాను.
ప్రతిరోజు నిద్రపోయే ముందు నిద్రపోయాక నా కలలో ఇలాంటి ప్రదేశంలో నేను ఉన్నట్టుగా నా మనసులోని భావాలను కలంలో కదిలిస్తున్నట్టుగా ఊహించుకుంటూ నిదురించడం నా అలవాటు.
నిజంగా అలాంటి ప్రదేశం అనేది ఒకటి ఉంటే నేను అక్కడే ఉండాలని కోరుకుంటాను. వన్య మృగాల సంగతి అంటారా వాటి పని అవే చేసుకుంటాయి. అవి నా చుట్టు తిరుగుతున్నట్టుగా నాకు రక్షణ కవచంలా ఉన్నట్టుగా నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.
ఊహలకు రెక్కలు వస్తే ఎంతైనా ఊహించుకోవచ్చు, నచ్చిన ప్రదేశం అంటూ ఉంటే అది అడవి తల్లి తప్ప ఇంకేమీ కాదు. అలాంటి అడవి తల్లి ఒడిలో సేద తీరాలని, మమేకమై పోవాలని నా ప్రగాఢ ఆశ.
అడవి తల్లి అందర్నీ ఒకేలా చూస్తుంది. మనం దాన్ని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుంది. దాన్ని నమ్మకుంటే ఉగ్రరూపంతో కబళించి వేస్తుంది.
అందుకే నేను అడవి తల్లిని అంటే ప్రకృతిని ఇష్టపడతాను ఆ ప్రకృతిలో భాగం అనుకుంటాను. నాకు నచ్చిన ప్రదేశం అడవి తల్లి.
-భవ్య చారు