నాతిచరామి

నాతిచరామి

గతంలో రాసిన ఇంటింటి రామాయణం లో భాగంగా ఇదొక భాగం, ఇది నాతిచరామి అనే శీర్షిక కు సరిపోతుంది అని భావిస్తూ, మీ అభిప్రాయం తెలుపండి.

దాని గురించి, దాని భర్త నరయ్య గురించి ఆలోచిస్తూ కూర్చున్న నేను మాలచ్చి తండ్రి భద్రయ్య మా అమ్మగారి ఊర్లో పెద్ద పాలేరు అప్పుడన్ని గోవులు, బర్రెలు, వ్యవసాయనికి చెదోడు వాదోడుగా ఉండేవాడు, మా చిన్నప్పుడు మాకేం కావాలన్నా నిమిషంలో తెచ్చి పెట్టె వాడు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే భద్రయ్య రాత్రి కాగానే మాత్రం బాగా తాగేసి, తన పాక లో ఉన్న తన భార్య పంకజంని బండ బూతులు తిడుతూ ఊగిపోయేవాడు భద్రయ్య …

అంత తిడుతున్నా కూడా పంకజం ఒక్క మాట కూడా బయటకు రాకుండా, వాడి వాగుడు అంతా అయ్యాక నులక మంచం లో పడుకుంటే వాడికి అన్నం కలిపి పెట్టేది ఎంతో ప్రేమగా. మా పెళ్లిళ్లు అయ్యి, మాకు కొంచెం జ్ఞానం వచ్చాక పంకజాన్ని ఆడిగేవాళ్ళం ఎందుకు భద్రయ్య తిడుతున్నా అలా పడతావు ఏంటి, తిరిగి సమాధానం చెప్పొచ్చు కదా అని అంటే దానికి పంకజం చెప్పిన సమాధానం విని మేము నివ్వెరబోయాము.. పంకజం చెప్పిన సమాధానం ఏమిటి, భద్రయ్య భార్యని అలా ఎందుకు తిట్టేవాడు,??

అమ్మా ఆడికి నాను రెండో పెళ్ళాన్ని, మేనత్త కూతుర్ని, అయితే మా మావ అంటే నాకు పానం కానీ ఆళ్ళు నన్ను కాదని మా మావ కాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ కాంతానికి పట్నంలో పని చేసే వాడిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. తల్లిదండ్రులు మాత్రం మా మావకు ఇచ్చి బలవంతంగా పెళ్లి సేయలని అనుకుంటూ ఉండగా.. ఆ రాత్రి

అప్పటికే ఊరికి పాలు పోయించుకోవడానికి వచ్చే పాండుతో అది పెళ్లి రోజు రాత్రి లేచిపోవడం, అందరిలో పరువు పోగొట్టుకోలేక, తిరిగి ఆరేళ్ళ లేక నన్ను ఇచ్చి పెళ్లి చేశారు మా వాళ్ళు, ఆడిని ఎంతో ప్రేమించిన నేను, అదే నా అదృష్టం అని అనుకుని అందివచ్చిన దాన్ని అందుకున్న, కానీ ఆడికేమో నానే ఎదో సెప్పి దాన్ని పోయేలా సేసాను అని ఒక అనుమానంతో అలా తిడతాడు తాగినప్పుడు మాత్రమే అలా తిడతాడు అది గుర్తొచ్చి, కానీ నాకు అవి దీవెనలు అనుకుంటా…

మిగతా సమయంలో అడు నన్ను ప్రేమగానే సూసుకుంటాడు అని మాతో చెప్పిన పంకజం ఒక వారం రోజుల్లోనే పాము కరిచి చనిపోయిoది. పంకజం చనిపోయే నాటికి మాలచ్చి కి రెండేళ్లు, పాపం భద్రయ్య పిచ్చివాడు అయ్యాడు పంకజం పోవడంతో, ఎన్నాళ్ళు తాను తిట్టినా, ఎం చేసినా పడి ఉన్న పంకజం, తన మాటకు ఎదురు చెప్పకుండా ఉండేది. అకస్మాత్తుగా పోవడం తట్టుకోలేక పిల్లని కూడా సరిగ్గా చూడలేక పోయేవాడు. మాలచ్చి మా అమ్మ చేతిలోనే పెరిగిందని చెప్పవచ్చు, తనకు తోచిన పనేదో చేసేవాడు భద్రయ్య..

మా తాతగారు, నాన్నగారు ఏమి అనలేక పోయేవారు, పెళ్ళాం చనిపోతే సగం రెక్కలు విరిగినట్టే అని అనేవారు మా తాతగారు, అతని బాధని అర్థం చేసుకుని, తోచిన పని చేసి, పెట్టినది ఏదో తిన్నాను అనిపించి, అక్కడిక్కడే పడుకుండీ పోయేవాడు. భద్రయ్య తన భార్యని అంతగా ప్రేమించాడు అని, ప్రేమ ఎవరికి అయినా ఒక్కటే అని, దానికి పేద, గొప్ప, ఆస్థి, అంతస్థుల తారతమ్యం తెలియదు అని నాతిచారమి అనే దానికి అర్ధం తెలియకున్నా పంకజం తన పని తాను నిర్వర్తించి వెళ్లిపోయింది. భార్యా భర్తల బంధం అంటే ఏమిటో అప్పుడు మాకు అర్థం కాకున్నా, తర్వాత తర్వాత అర్దం అయింది.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *