నాన్నా…!

నాన్నా…!

అమ్మలేమో అందరిలా ఉంటారు
నాన్నలందరూ అలా అద్దం వెనక
గోడకేలాడుతుంటారు..
అనుకునేదాన్ని..
అప్పుడు నాకు ఆరేళ్ళే కదా మరి!

ఆరుబయట ఆరమోడ్పు కన్నులతో
అరచేతుల్లో ముఖం పట్టుకుని
ఆకాశం చూస్తూ ఉండేదాన్ని
అమ్మమ్మ చెప్పింది మరి
నువ్వుండేది అక్కడే అని..!

జానకీ రాఘవ.. సీతారాముల్లా
పేర్లు భలే కలిశాయే అంటే..
నవమి ముందు సప్తమి నాడే
సంస్కారాలు చేయించుకుని
సంసార కానలకు నన్నొదిలిన
రాముడేనమ్మా మీ నాన్న..
అమ్మ చెప్తుంటే అబ్బురంగా విన్నా
అదేంటో అర్థం తెలిస్తేగా మరి!

నాన్నా..!
నీకో విషయం తెలుసా!
నాన్నల్లేని ఇంట్లో మనుషులకు
వెన్నెముకలుండవ్..
అదంతే..
కొంచెం పెద్దయ్యాగా..
తెలిసిపోయిందంతే..

అమ్మే నాన్నై
అన్నీ తానైనా..
అమ్మ.. ఆమే కదా!
అరిసెల చెక్కల మధ్య వత్తేసింది..
విశ్వాసపు పాళ్ళు ఒంపేసింది..
లోకం పోకడ అమ్మకు..
బాగా తెలిసింది మరి!

నాన్నా..!
ఆ నింగి నా స్నేహితుడైంది
నేనే స్నేహం పెంచుకున్నా..
అక్కడ నువ్వున్నావు కదా!
తను కురిపించే ప్రతి చినుకులో
నీ స్పర్శ.. నా తల నిమురుతూ..
పైగా..
నా కనులు రాల్చే ముత్యాలన్నీ
తనలో కలిపేసుకుని గుట్టుగా ఉంచింది మరి!

నాన్నా..!
కన్యాదానం కోసం..
కడిగే చేతుల కోసం..
అమ్మ పట్టని పాదాలు లేవు.
అప్పుడు..
అప్పుడు వచ్చింది నాన్నా
నీ మీద కోపం..
నువ్వే చేయాల్సినవంటూ కొన్నుంటాయని..
నువు లేని అమ్మ బొమ్మే అని..

నాలా అప్పుడప్పుడూ కాకుండా
అమ్మ ఎప్పుడూ ఎదురు చూస్తుంది
నా స్నేహితుడి కోసం..
తనను గుట్టుగా ఉంచుతుందని.
ఇంకొంచెం పెద్దయ్యాగా..
తెలిసిపోయిందంతే..

నాన్నా..!

నిట్రాడి లా
నీవుడుంటే…!!!!

– గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *