మౌనపు అంగీకారాలతో
నిత్య మందిరపు నీడలో నీవన్నది
తలచిన మౌఖికాలతో నిరంతరం
సంచరిస్తూ…ద్వేషం పూర్ణీభావం కాలేదని
స్థూపమై నిలిచి పిలిచే వసంతాన్ని నిండు హృదయాలకు దరిజేరుస్తు…ఆంతరంగికాన
మౌనపు అంగీకారాలతో ఏకాంతాల వేదికలపై
మనస్సు చేసే ఒంటరి ప్రయానం మానసిక
వికాసానికి ఒక గ్రహింపే…
అలసిన బతుకులో తడిసిన మెతుకుల
కోసం సలిపిన వేటలో….చీకటి వెలుగులు
వచ్చిపోయే సత్యాలని సూర్యోదయంతో
నువ్వు తేలిన నిత్యమై…భౌగోలిక
ప్రామాణికాలచే సమయమై కదులుతు
క్షణం బతికిన సృజనచే లోకంగా
సనాతన ధర్మాలకు అనుసంధానాల నిడివిగా
నిర్ణీతమవుతున్న వేదాలు కూడా గ్రహింపే…
ఆశలతో ఆవరించిన వెలుగునకు
ఆకర్షితుడవై…ప్రత్యక్షతల పాయసాలను
పంచుకోలేక విషతుల్యమై తేలిన ఆరాటాన్ని
కొనసాగిస్తు జీవితానికి అర్థం తెలవారుటతో
దిగుతు…సంధ్యలతో ముగుస్తుందని…
వగచే వాలుతనంతో సాగని బతుకుల
సారథ్యాన్ని కోల్పోయిన మధికి
తెరచాటవుతు…కాలేని కారణం కూడా
ఒక గ్రహింపే…
జారిన మాటల ఉనికితో ఉషస్సు కాలేక…
ఊపిరిలేని ఉద్యమంలో మునిగిన
సొంతాలను గుర్తించలేని మనస్సుతో…
కాంతులు కాసే నందనాలకు నీ అడుగు
ప్రమాదకరమవుతు…దినం వాటిల్లని శుక్లమై
ఆప్తులను విసరిన ప్రేమల చైతన్యానికి
దూరమవుతు నువు పాడే విరహ గీతాలలో
ఆలాపన కూడా గ్రహింపే…
ప్రారంభం కాలేని ఆరంభాలతో బతుకెంత
దూరమోనని సతమతమవుతు…తారలలో
తానొక వెలుగని అతిశయోక్తిగా చెప్పుకోలేని
బాధ్యతలుగా తెగిపోతు…ముక్తి లేక
ఆవరించిన కందకంలో తిరగాడుతు…
అందం బంధం కాదని కరిగిపోయే గంధంగా
పరిమళమైనా…శాశ్వత సహకారం లేదనే
ఆమోదం తలచిన భావన కూడా గ్రహింపే…
-దేరంగుల భైరవ