మౌనం
రాత్రి రాలిపడిన పువ్వు గురించి
ఉదయమూ అరా తీయదు
కొమ్మల నిశ్శబ్దాన్ని
పిట్టలూ అడగవు
ఆకుల చింతను
కీటకాలూ గుర్తించవు
చెట్టు మౌనం వెనుక
దుఃఖాన్ని గాలి పట్టించుకోదు
నేలనంటిన పువ్వు
అలాగే చెట్టు వైపు చూస్తూ
వాడిపోతుంది
పరిమళం ఎండి
మరక కూడా మిగలకుండా
మాయమవుతుంది
కాలం ఎత్తుకెళ్ళిన అదే పువ్వు
ఎన్నటికీ రాదు
ఈ రాకపోకలు తాత్విక భ్రమలు
శబ్దాలన్నీ చివరకు నిశ్శబ్దాలు
-గురువర్ధన్ రెడ్డి