మోసం
గమనిక:- ఇది నా జీవితంలో జరిగింది,
సినిమా అంటే ఇష్టం ఉండి,
సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలి అనుకునే ఎవరికీ(ముఖ్యంగా రచయితలు)ఇలా జరగొద్దు అని చెబుతున్నాను.
నా పేరు చైతన్య కుమార్,నాకు సినిమా అంటే చాలా ఇష్టం,చాలా అంటే చాలా ఇష్టం.నేను చాలా మంచి విద్యార్థి కూడా.బిటెక్ 73% తో పూర్తి చేశాను.నేను నమ్మేది ఒక్కటే.నిన్ను ఒకరు వేలెత్తి చుపించెలా నువ్వు ఎప్పటికీ ఉండొద్దు.
అందుకే ముందు నేను ఏంటో నా చుట్టూ ఉన్న సమాజానికి చూపించాలి అనుకున్నాను.తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్లి రెండు వారాల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు సాధించాను.ఆ నాలుగు ఆఫర్ లెటర్లు పట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళాను.దానితో పాటు నేను రాసిన కథలు కూడా పట్టుకొని వెళ్ళాను.
ఇది నేను సాధించాను,ఇది నేను రాశాను.
మీరు అన్ని చూసి మీకు నచ్చింది చెప్పండి.నేను అదే చేస్తాను అని చెప్పి వెళ్లి తినేసి పడుకున్నా.
మాది చాలా మధ్య తరగతి కుటుంబం.మామూలు మధ్యతరగతి తండ్రిలా మా నాన్న ఆలోచించలేదు.
పొద్దునే నిద్రలేపి “ఉద్యోగం సాధించి చూపించావ్,సినిమా కూడా తీసి చూపించు” అన్నారు.
చాలా సంతోషంగా అనిపించింది.
అది 2018,22 ఏళ్ల వయసు,మనసులో ఎదో సాధించాలి అనే తపన,సాధిస్తాడు అని నమ్మే కుటుంబం.
సినిమా అంటే ఇష్టం,కానీ ఏం చెయ్యాలో తెలీదు.ఎలా మొదలు పెట్టాలో కూడా తెలీదు.
కథలు విని అవకాశం ఇచ్చే వారు ఉంటారు అని తెలుసు.
అప్పుడే నా స్నేహితుడితో కలిసి కథ చెబుదాం అని ఒక ప్రొడ్యూసర్ (ఆయన పేరు నేను ఏదైనా సాధించి చెబుతాను)దగ్గరికి వెళ్ళాను.భయం భయంగా ఉంది,బయట ఒక 20 మంది ఉన్నారు.
అందరూ నా వయస్సు వారే, వాళ్ళ అందరిది నా లాంటి కలే.సినిమా చెయ్యాలి అని.
అలా నా అవకాశం వచ్చే వరకు బయట ఉండి,నన్ను పిలిస్తే లోపలికి వెళ్ళాను.
ప్రొడ్యూసర్ :- నీ కథ నేను ఐదు నిమిషాలు మాత్రమే వింటాను,నచ్చకపోతే బయటికి వెళ్ళమని చెబుతాను అన్నారు.
నేను:- అలాగే అండి అని మొదలు పెట్టాను.ఐదు నిమిషాలు అయింది.
ప్రొడ్యూసర్:- బాగుంది,ఇప్పుడు మీ కథను ఒక 30 నిమిషాలు వింటాను,నచ్చకపోతే బయటికి వెళ్ళమని చెబుతాను.
నేను:- అలాగే అని మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాను.అతను చాలా బాగా లేనమైపోయి వింటున్నారు.
45 నిమిషాల తరువాతప్రొడ్యూసర్ :- ఒక్క నిమిషం చైతన్య గారు అని నన్ను అని.
ఒక ఫోన్ కాల్ చేశారు.అతని అసిస్టెంట్ ని లోపలికి రమ్మని చెప్పారు.
ప్రొడ్యూసర్ :- రవి,నేను ఇంకో 2 గంటల వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చెయ్యకండి.
నేను చాలా గొప్ప కథ వింటున్నాను.
బయట ఎదురు చూస్తున్న అందరినీ ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పు,
రేపు రమ్మని చెప్పు.ఎవరూ ఫోన్ చేసినా నేను ఒక రెండు గంటల తరువాత మాట్లాడుతూ అని చెప్పండి అన్నారు.
నాకు మనసుల్లో చాలా సంతోషంగా ఉంది,నాకు చాలా మంచి అవకాశం దొరికింది అని అనుకున్నాను.చాలా సంతోషంగా ఉన్నాను.ప్రొడ్యూసర్:- ఇంక మొదలు పెడదామా సార్ అన్నారు.నన్నే అంటున్నారా అనే సందేహంలో ఉన్నాను.
ప్రొడ్యూసర్:- మిమ్మల్నే చైతన్య గారు,మొదలు పెడతారా అన్నారు.మళ్ళీ కథ చెప్పడం మొదలు పెట్టాను.2 గంటలు పూర్తి అయ్యింది.
క్లైమాక్స్ చెబుతున్న సమయంలో అతని కనుల్లో నీరు.అతనికి అంతలా నచ్చేసింది.నాకు చాలా సంతోషంగా ఉంది,
నా కథ ఇంతలా నచ్చడం.మళ్ళీ తన అసిస్టెంట్ ను పిలిచారు.రవి:- సార్ రమ్మని చెప్పారు?
ప్రొడ్యూసర్:- నా చెక్ బుక్ తీసుకొని రా పోరవి:- ఈరోజు మనం తీసుకొని రాలేదు సార్,ఇంట్లో మరిచిపోయారు.
ప్రొడ్యూసర్:- అయ్యి,ఇంతకీ క్యాష్ ఎంత ఉంది రవి.రవి:- ఒక లక్ష ఉంది సార్.
ప్రొడ్యూసర్ :- త్వరగా పట్టుకొని వచ్చేయ్.
రవి:- అలాగే సార్.
ఆ డబ్బు పట్టుకొని వచ్చారు రవి.
ప్రొడ్యూసర్:- అలాగే మన అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని రా రవి అన్నారు.
రవి:- నిమిషంలో తెస్తాను సార్.
అగ్రిమెంట్ పేపర్తో వచ్చారు రవి గారు.అది నాకు ఇచ్చారు ప్రొడ్యూసర్.
ప్రొడ్యూసర్:- ఇదిగిండి చైతన్య గారు,మొత్తం చదివి సంతకం చెయ్యండి.
మనం ఈ సినిమా చేస్తున్నాం.
నాలో పట్టలేని సంతోషం.మొత్తం 28 పేపర్ల అగ్రిమెంట్.అందులో అన్నీ ఉన్నాయి.ఆయన సంతకం చేశారు,నా పేరు రాశారు.100 రూపాయల బాండ్ పేపర్ కూడా ఉంది.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:- ఈగ చైతన్య కుమార్అన్ని ఉన్నాయి దాని మీద.నేను అడిగిన ఇద్దరు హీరోల డేట్స్ కూడా తీసుకుంటాను అని చెప్పారు.
అంతా చదివి సంతకం చేశాను.సంతకం చేసి బయటికి వచ్చి,నా స్నేహితుడికి చెప్పి,మళ్ళీ లోపలికి వెళ్ళి,ఆ ప్రొడ్యూసర్ గారికి ధన్యాదములు చెప్పి బయటికి వెళ్ళాలి అనుకున్నాను.
అప్పుడే ప్రొడ్యూసర్ గారు.
ప్రొడ్యూసర్ : – చైతన్య గారు,కథ కాపీ ఒకటి ఇస్తారా నాకు,హీరో గారికి చూపించాలి కదా నేను అన్నారు.నిజమే అనిపించింది నా మనస్సుకి.
నమ్మి నేను దైర్యంగా ఇచ్చేశాను.కానీ అక్కడ నేను రెండు తప్పులు చేశాను.
1.సంతకం చేసిన డాక్యుమెంట్ కాఫీ నేను ఒకటి అడగకపోవడం.
2.నా కథకు నేను కాపీరైట్ తీసుకోకముందే ఆ ప్రొడ్యూసర్ కి ఇవ్వడం.
ప్రొడ్యూసర్:- ఈలోపు మీరు ఈ కథను ఇంకాస్త సవరణలు చెయ్యండి.
ఒక వారంలో కలుద్దాం అన్నారు.
వారం తర్వాత వెళ్ళాను,ఆయన లేరు అని చెప్పారు.మళ్ళీ 5 రోజుల తర్వాత రమ్మని చెప్పారు.
వెళ్ళాను.
ప్రొడ్యూసర్:- రండి చైతన్య గారు.
నేను:- చెప్పండి సార్.
ప్రొడ్యూసర్ :- మన కథ ఇద్దరు హీరోలకి నచ్చింది అండి,కానీ నేను ఈలోపు ఇంకో సినిమా చెయ్యాల్సి ఉంది.అలాగే మన హీరోలకు కూడా పూర్తి చెయ్యాల్సిన సినిమాలు ఉన్నాయి.
అందుకే కొంచం ఆలస్యం అవుతుంది అన్నారు.
నేను:- అలాగే సార్,అలాగే చేద్దాం.ఆలోపు నేను వేరే కథలు రాస్తూ,ఈ కథలో ఇంకొన్ని మార్పులు చేస్తాను అని చెప్పాను.
వాళ్ళతో తరుచుగా మాట్లాడుతూనే ఉన్నాను.వాళ్ళు కూడా నాతో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు.
ఈలోపు నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది.ఖాళీగా ఉండడం ఎందుకు అని ఉద్యోగంలో చేరాను.
దాదాపు 1½ సంవత్సరం గడిచిపోయింది.సినిమాలు అంటే ఇష్టం కదా,వచ్చిన ప్రతి సినిమా చూడడం నాకు అలవాటు.
అలా ఒక పెద్ద సినిమా విడుదల అయింది,దియటర్ వెళ్లి కూర్చున్నాను.
సినిమా మొదలైంది.చూస్తే నా కథ లాగే అనిపించింది.భయం భయంగా సినిమా చూస్తున్నాను.
కామెడీ మొదలైంది.హమ్మయ్య ఇది నా కథ కాదులే అని అనిపించింది.
కానీ లోపల భయం అలాగే ఉంది.ఇంటర్వెల్ అయిపోయి వచ్చి కూర్చున్నాక సినిమా మొదలైంది.
నా పక్కన ఉన్న నా స్నేహితుడు నా వైపే చూస్తున్నాడు.నాకు ఏం అర్ధం కావడం లేదు.మొత్తం నా కథే.
కనీసం పేర్లు కూడా మార్చలేదు.కంగారుగా బయటికి వచ్చాను.వచ్చి ఆ ప్రొడ్యూసర్ కి కాల్ చేశాను,
ఫోన్ రింగ్ అవ్వడం లేదు.వెంటనే అతని ఆఫీస్ కి వెళ్ళాను.అక్కడే ఉన్నారు,రవి గారు కూడా అక్కడే
నా వైపు చూశారు.
చూసి ” ఎవరు బాబు నువ్వు? ఎవరిని కలవాలి అన్నారు”నేను:- అదేంటి రవి అన్న,
నన్ను ఎవరూ అంటారు ఏంటి అన్నాను.
ప్రొడ్యూసర్ :- ఎవరు రవి ఇతను అన్నారు.
రవి:- ఏమో తెలీదు సార్.
నేను:- ఏంటి సార్,నేను ఎవరో తెలీదా?
ప్రొడ్యూసర్ :- నువ్వు పెద్ద హీరో మరి,చూడగానే గుర్తు పట్టేస్తారు నిన్ను. ఎవరు నువ్వు,నాకు ఏమైనా కథ చెప్పడానికి వచ్చావా?
నేను:- నేను చైతన్య సార్,మీతో 2 సంవత్సరాల నుండి మాట్లాడుతూనే ఉన్నాను.రెండు వారాల ముందు కూడా సినిమా గురించి మాట్లాడం కదండి.
ప్రొడ్యూసర్:- ఏంటి రవి ఇంకా చూస్తున్నావ్,ఎవడో డబ్బుల కోసం నాటకాలు ఆడుతున్నాడు.బయటికి తోసెయ్.
రవి నా దగ్గరికి వచ్చి బయటికి నెట్టేయాలి అని చూసాడు.
నేను:- అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశారు,నా కథ ఈరోజు సినిమాగా వచ్చింది,నన్ను మోసం చెయ్యకండి సార్.
ప్రొడ్యూసర్:- నువ్వు ఆగు రవి,ఎది ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించు,అయినా నిన్ను చూడడమే మొదటిసారి.పో రా పో,వెళ్లి ఎర్రగడ్డ లో జాయిన్ అయ్యి మంచిగా వైద్యం చేయించుకో అన్నారు.
నాకు అర్థమైంది నేను మోసపోయాను అని.నా దగ్గర ఒక చిన్న సాక్ష్యం కూడా లేదు.చాలా పక్కగా ప్లాన్ చేసి నా కథ దొంగతనం చేశారు అని అర్థమైంది.ఏడుస్తూ నా రూం చేరుకున్నాను.
చాలా బాధ,ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను.రాత్రి నిద్రపోయాను,నిద్రలో ఫిట్స్ వచ్చింది.లేచి చూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను.
కథ చెప్పింది 2018,
అది జరిగింది 2020,
ఇది 2023,
ఇంకా సినిమాలకు దూరంగానే ఉంటూ,నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉన్నాను.మళ్ళీ ఖచ్ఛితంగా సినిమా చేసి,దాని కంటే పెద్ద హిట్ కొడతాను.చాలా పెద్ద స్థాయి చేరి,ఆ ప్రొడ్యూసర్ కి చేసిన తప్పు అర్ధం అయ్యేలా చేస్తాను.
-ఈగ చైతన్య కుమార్