మిరపకాయ బుడ్డోడు

మిరపకాయ బుడ్డోడు

పేదరాశి పెద్దమ్మకు అందమైన ఒక కూతురు ఉండేది.
ఆమె ఓరోజు పూల కోసం అడవికి వెళ్లింది. ఆమెను ఒక పాము చూసి పెళ్లాడాలనుకుని పట్టుకెళ్లి పుట్టలో దాచేసింది.

‘ఏందబ్బా! పిల్ల ఇంకా రాలేదు?’ అనుకున్న పెద్దమ్మ అడవంతా వెదికింది. పిల్ల కనబడక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆకాశంలో ఎటో వెళ్తున్న పార్వతీ పరమేశ్వరులు ఆ ఏడుపు విని జాలి పడి ప్రత్యక్షమయ్యారు. పెద్దమ్మ గోడంతా విని, ‘దిగులుపడకు పెద్దమ్మా! నీకో బుడ్డ మిరపకాయ ఇస్తాం. దీన్ని తిను. బుడ్డ మిరపకాయలాంటి బుడ్డోడు పుడతాడు. వాడి అక్కను వాడే తీసుకొస్తాడు’ అని మిరపకాయను ఇచ్చి మాయమైపోయారు.

పెద్దమ్మ ఇంటికి వచ్చి మిరపకాయ తినగానే వెంటనే బుడ్డమిరపకాయ లాంటి బుడ్డోడు పుట్టి, చూస్తుండగానే పెద్దోడై ‘అమ్మా! విషయం ఏంటో చెప్పు?’ అన్నాడు. పెద్దమ్మ చెప్పింది. వెంటనే వాడు అడవిలోకి వెళ్లి కనిపించిన జంతువునల్లా అడిగాడు.

‘బుడ్డోడా! బుడ్డోడా! నీ అక్క ఆ పుట్టలో ఉంది’ అని చెప్పింది ఒక చీమ. బుడ్డోడు పుట్టపక్కనే దాక్కున్నాడు. పాము బయటకు వచ్చి అట్టా పోగానే, ఇట్టా లోపలికి దూరాడు. అక్కను తీసుకుని ఇంటికి వచ్చేశాడు.

పాము వచ్చి పుట్టలో పిల్ల కనబడక బుస్సుమంది. పెద్దమ్మ ఇంటికి పోయి చీకటి పడేదాక చావట్లో దాక్కుంది. అందరూ నిద్రపోయాక పిల్లను ఎత్తుకు పోయి పాతాళ లోకంలో దాచింది. తెల్లారి పెద్దమ్మ గొల్లుమంది. బుడ్డోడు వెంటనే బయల్దేరాడు. భూలోకమంతా వెదికి పాతాళానికి పోయాడు. పాము కళ్లలో కారం కొట్టి అక్కను తెచ్చేశాడు.

కొన్నాళ్లకు పాము మళ్లీ వచ్చి పిల్లను తీసుకుపోయి ఈసారి ఆకాశంలో దాచింది. ఆకాశంలో చంద్రుడు ఆమె అందం చూసి ముచ్చటపడ్డాడు. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. పాముకి చంద్రుడిపై కోపం వచ్చింది. బుసలు కొడుతూ వచ్చి చంద్రుడిని మింగేసింది. అప్పుడే అక్క కోసం వచ్చిన బుడ్డోడు అది చూశాడు. దాని తోకను పట్టుకుని జాడించేసరికి చంద్రుడు ఊడి పడ్డాడు. వెంటనే పాముని బలం కొద్దీ విసిరేశాడు. అప్పట్నుంచి పాము పాక్కుంటూ రావడం, చంద్రుడిని మింగడం, బుడ్డోడు దాని తోక విదిలించి విసిరేయడం. పాము చంద్రుడిని మింగినప్పుడే మనకి చంద్రగ్రహణం వస్తుంది. వెంటనే బుడ్డోడు తన బావను కాపాడుకుంటాడు.

-భరద్వాజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *