మెట్రో కథలు ఒకటో భాగం – మెట్రో మేజిక్

మెట్రో మేజిక్

సీతారాముడికి మెట్రోప్రయాణం అంటే ఇష్టం. వీలయినన్నిసార్లు మెట్రోలో వెళుతుంటాడు. మెట్రోలో మనుషులు అతన్ని ఆకట్టుకుంటారు. అతనికి మెట్రోరైలు మినీఇండియాలా ఉంటుంది. అన్నివయసులవారు,అన్నివర్గాల వారి మాటలతో మెట్రో సంగీత సభలా ఉంటుందని అతని ఫీలింగ్.

చాలామందికి మెట్రోలో గట్టిగా మాట్లాడే వాళ్ళంటే విసుగు.సీతారాముడికది స్వరసంగమంలా ఉంటుంది.వాళ్ళను మాట్లాడనివ్వండి.వారి మాటల్లో ఎన్ని అనుభూతులు దొర్లుతాయో అంటాడు. అదో రణగొణధ్వనంటాడు తనతో అప్పుడప్పుడు ట్రావెల్ చేసే తాతారావు.వేరే దేశాల మెట్రోరైలులో ఎంత నిశ్శబ్దం..మనదగ్గరే ఈ గొడవ,గందరగోళమని విసుక్కుంటాడు.

మనిషంటేనే సందడి, ముక్కుమూసుకునుండటానికి ఇదేమయినా మునుల కాలమా అంటాడు సీతారాముడు. అందుకే ప్రతిప్రయాణంలోను మనుషులు పురివిప్పిన నెమలిలా స్వేచ్ఛగా ఒక్క మెట్రోలో మాత్రమే ఉంటారని అతనికి మెట్రో రైలంటే ఇష్టం. ‌ ఈ ప్రయాణంలో నాదస్వరంలాంటి. గోదావరి జిల్లాల యాసలు,సిద్ధిపేట జీవద్భాషా సౌందర్యం, అమాయకత్వం వెల్లివిరిసే అనంతపూర్ భాష ఇలా ఎన్ని చూస్తాడో అతను.

“మా హైటెక్ సిటీ రూట్లో చూడు.ఎంత స్టైల్ ఉంటుందో,మీ మియాపూర్ అంతా పూర్ మనుషులు.అంతా మాస్” అని ఆటపట్టిస్తుంటాడు తాతారావు.

ఆరోజెందుకో తాతారావు కూడా మియాపూర్ వచ్చి సీతారాముడితో మియాపూర్లో మెట్రో ఎక్కాడు. ట్రైన్ కదిలింది.ఓ అరవైఏళ్ల పెద్దమనిషి వీళ్ళతోపాటే సీనియర్ సిటిజన్ సీట్లో కూచున్నాడు. ట్రైన్ కదిలిందో లేదో ఫోన్ కాన్సెర్ట్ మొదలెట్టాడు.

“నేను ఇంకో అరగంటలో సికింద్రాబాద్ కొచ్చేత్తా.ఆడనుంచి వెంకట్రావు కాడికి పోదాం.ఆడికాడ మంచి స్థలం ఉండాది. చూసి నచ్చితే బయానా ఇచ్చేద్దాం. ఏంది”
అవతల ఏం సమాధానమొచ్చిందో పెద్దగా నవ్వాడు.అంత గందరగోళంలోను అందరూ ఉలిక్కిపడి అతని వంకే చూశారు. ఈలోగా మెట్రో మధ్య మధ్యలో అనేక స్టేషన్లలో ఆగుతోంది.మళ్ళీ కదులుతోంది.

ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. కానీ దిగేవాళ్ళే కనబడటం లేదు. తాతారావు మాత్రం సీతారాముడి చెవిలో గొణిగాడు. ఏమిటీ న్యూసెన్స్,అందుకే ఈ రూటంటే చికాకు అంటూ చిటపటలాడాడు. “ఎంత కాసేపు.ఇదిగో ఎస్.ఆర్.నగర్ వచ్చేస్తోంది.అదిదాటితే అమీర్ పేట్.ఆయనక్కడ బ్లూలైన్ కు మారతాడు.” సీతారాముడు సముదాయిస్తున్నాడు.

మధ్యాహ్న మార్తాండుడిలా పేరు తెలియని ఆ వ్యక్తి పెద్ద పేరున్నవాడిలా మెట్రో కంపార్ట్మెంట్ లో అందరినీ అడ్రస్ చేస్తున్నట్లు ఫోజు కొట్టి మాట్లాడ్డం ఆపలేదు.ఈలోగా అమీర్ స్టేషన్ వచ్చేసింది.”Doors will be open on the left Please mind the gap”.రినీఖన్నా గొంతు మధువొలుకుతూ పలికింది.

అమీర్ పేట జంక్షన్ కాబట్టి చాలా మంది దిగటానికి సిద్ధమయ్యారు.తాతారావు , మళ్ళీ సీతారాముడి చెవిలో చెబుతున్నాడు. ఈ పెద్దమనిషి చూడు,గొంతు ఇంకా పెంచుతున్నాడంటూ. సడెన్ గా సీతారాముడికి వెలిగింది,ఆ పెద్దమనిషి ఇక్కడే దిగాలని. ఫోన్ లో మాట్లాడుతున్న మనిషి భుజం తట్టాడు మాస్టారు అంటూ..

ఫోన్ మీద చెయ్యేసి, “ఏంటి మీ ప్రాబ్లం” అనడిగాడా పెద్దమనిషి.

“ప్రాబ్లం నాది కాదు, మీది..అమీర్ పేటొచ్చింది” అన్నాడు సీతారాముడు.

“ఆ..వస్తే..” ఇంకాగద్దింపు స్వరంలో అన్నాడా పెద్దమనిషి.

“మీరెవరికో ఫోన్ లో చెప్పారుగా, సికింద్రాబాద్ స్టేషన్ లో కలుస్తానని.అలా కలవాలంటే ఇక్కడ మారాలి.” అప్పుడు కానీ,ఆ పెద్దమనిషికి వెలగలేదు. మైండ్ బ్లాక్ అవుతుండగా ఫోన్ నొక్కేసి, దాన్ని జేబులో కుక్కేసి డోర్ దగ్గరకు పరిగెత్తినంత పనిచేశాడు.

తలుపులు మూసుకోబోతుండగా చావుతప్పి కన్నులొట్టపోయినట్టు బయటపడ్డాడు.అంతవరకు ఫోన్ లో అరుస్తూ మాట్లాడిన పెద్దమనిషి పిల్లిలా జారుకోవటం చూసిన చాలామంది నవ్వాపుకోలేకపోయారు.ఇది చూసిన తాతారావు కూడా నవ్వాపుకోలేకపోయాడు.

“ఇది మాస్ జాతర.నీకేం పని ఊరుకోవాల్సింది .బుద్ధొచ్చేది ఆ పెద్దమనిషికి” అన్నాడు.

“జాతరకాదు ఇది మెట్రోమ్యాజిక్” అన్నాడు సీతారాముడు.

“విసుగనిపించినప్పుడో, మనసు బాలేనప్పుడో ఈరూట్లో ట్రావెల్ చెయ్. వెంటనే రీఛార్జ్ అవుతావు”.

ఏ విషయాన్ని వెంటనే ఒప్పుకోని తాతారావు మొదటిసారి సీతారాముడి లాజిక్ ను, రీజనింగ్ ను ప్రశ్నించలేకపోయాడు‌. మనుషుల సందడి ఉన్నప్పుడే చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని గమనించి సీతారాముడి చేయి నొక్కాడు.

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *