మే డే
ఏమిటలా మౌనంగా ఉన్నావూ.. లే..
అచేతనా నిశ్శబ్దంతో నువ్వు చేసే సంభాషణ
మన సహవాసుల
గుండె చప్పుళ్లను ప్రతిధ్వనింపచేయాలి కదా
పదాలు నిలదీసే నినాదాలై
పరుచుకుంటున్న చీకట్లను
జాలువారుతున్న కన్నీళ్లను తుడిచే
వెలుగు చేతులవ్వాలి కదా
ఈ భిన్న వర్ణాల వర్గాల మోముల్లో ఏముందో చూసావా
వీక్షించిన ఒక్కో మారు ఒక్కో భావం కదూ
విరిగిపడ్డ బ్రతుకులపై పడ్డ సమ్మెట పోట్ల పగుళ్ళే అన్నీ…
ఈ దారిన
రహదారుల్ని ఎరుపెక్కించి ప్రతిధ్వనింపచేసిన
ఆ బిగించిన పిడికిళ్లు ఎన్నెన్నో…
ఎగురుతున్న మువ్వన్నెల పతాకపు
రెపరెపల మాటున
తెగి పారిన నెత్తుటి జ్ఞాపకాలు మరెన్నో…
ఇలా ఎంత వ్రాసినా ఇవి బతికే కవితలు కావేమో!!
కడుపు మండి అరిచే అరుపుల్ని తెగ్గొడతారు
మనసు మండి వ్రాసే వాక్యాల్ని తెగనరుకుతారు
అయినా…
అంత:సంఘర్షణల
వాక్యాలతో ప్రయాణించాలి శ్వాసించాలి కదా మరి…లే
నిరంతర పోరాట స్ఫూర్తి మేడే శుభాకాంక్షలతో 🙏
-గురువర్ధన్ రెడ్డి