మారని బ్రతుకులు
అందుకోరా గుత్పందుకో ఈ దొంగల తరిమే తందుకు
స్వతంత్రం వచ్చి…
గడిచిన ఈ 75 సంవత్సరాలలో ఇంకా మారని బ్రతుకులు..
సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు
ఇంకా సంపదను సృష్టించే
పనిలోనే నిమగ్నమై ఉన్నాయి…
అంటరాని వారు అని వెలేసిన వారు
ఆ పారిశుద్ధ పనులకి పరిమితమై జీవిస్తున్నారు…
అగ్రవర్ణాలు మాత్రం అధికార పీఠానికై
ఒకరి తర్వాత ఒకరు వరుసలో నిలబడి
పోటీపడి గెలుపు ఓటములు
అనే ఆటలాడుతున్నారు
ఇంకా ఏం మారలే….
కులాల పేర మరింత విడగొట్టబడి
మతం మత్తులో…
తూగుతూ, తాగుతూ, ఊగీపోతున్నారు…
మత రాజకీయాల్లో ప్రజలంతా
దోపిడి వర్గాల చేత
దోపిడిచేయబడుతూ మోసపోతున్నారు….
ప్రపంచ నలుమూలల అనేక దేశాలు
అత్యాధునిక సదుపాయాలతో
విద్యా, వైద్యం, వ్యవసాయం,
పారిశుద్ధ ఇంకా అనేక రంగాలలో
ఒకరికొకరు అందరితో
భాగస్వామ్యమై ఎలాంటి
భేదాభిప్రాయాలు లేకుండా
ముందుస్థానంలో ప్రత్యేక ప్రతిభను
చాటుతూ ముందుకు వెళ్తుంటే…
ఈ దేశంలో మాత్రం
ఇంకా కులమతాల కుట్రల వైరుధ్యాలతో
పేద, దనిక తేడాలతో,
హత్యలు, అత్యాచారాలు, ఈర్ష, ద్వేషం, పగ ప్రతికారాలతో జీవిస్తున్నారు ప్రజలంతా ఇక్కడ…
అందుకే… అందుకే
అందుకోరా గుత్పందుకో ఈ దొంగల తరిమే తందుకు
ప్రతిభ ఎవ్వడి సొత్తు కాదు
అగ్రవర్ణ అహంకారంతో అణచివేసే
తీరును దిక్కరించాలి
సబ్బండ శ్రామిక వర్గాలంతా
ఒక్కటిగ పిడికిలెత్తి
హక్కులకై పోరాడాలి
మనల్ని అణచివేసే వ్యక్తుల యొక్క మూలాన్ని పసిగట్టి….
ఇగా…
అందుకోరా గుత్పందుకో ఈ దొంగల తరిమేతందుకు
మారోజు వీరన్న కు కన్నీటి జోహార్లు
-బొమ్మెన రాజ్ కుమార్