మనోయజ్ఞం నవలా సమీక్ష
పరిచయం
పూర్వజన్మల గురించి నవలలు ఎన్నో వచ్చాయి. కానీ అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన నవల శ్రీ సూర్యదేవర రామ్మోహనరావు గారు రాసిన మనోయజ్ఞం నవల.
ఈ నవల రాయడానికి వారు ఎంతో శ్రమించారు అనేది మనం నవల చదువుతున్నప్పుడు అర్దం అవుతుంది. వారు ఈ నవల రాయడానికి ఎంతో పరిశోధించి మనకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఈ నవల చదువుతున్నంత సేపు మనం అందులో లీనం అవుతాము. మనమే అక్కడ ఉన్నట్టు, మన ముందే జరుగుతున్నట్టు అనుభూతిని పొందుతాం.
కథ ఏంటి
పూర్వ జన్మలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలంటే మనం మన పురాణాలలో గమనిస్తే ఉందనే స్పష్టం అవుతుంది. అవేంటి అనేది కూడా మనకు ఈ నవలలో చెప్పారు రచయిత. ఇక కథ లోకి వచ్చేద్దాం.
ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన మహానంద విశ్వకర్మ అనే అతను అమెరికాలో చాలా డబ్బు సంపాదించి ఇండియాలో ఒక ప్రాజెక్టును నిర్మించాలనే ఉద్దేశంతో ఇండియా కి వస్తారు.
అప్పుడు అతను అనుకోకుండా తన పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యఫలితంగా ఈ జన్మలో మనిషి అవతారం ఎత్తాను అని వచ్చే జన్మలో కూడా మానవ జన్మ ఎత్తి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాలని తెలుసుకుంటాడు.
ఇక్కడితో ఈ కథ అయిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ అనేది మనకు తెలుస్తుంది.
నిజానికి విశ్వకర్మ వచ్చే జన్మలో తాను మనిషిగా పుడతానని తెలుసుకొని, తన వల్ల జరిగే ఒక మహత్తర కార్యానికి తాను సంకల్పం చేయాలని అనుకున్నాడు.
తాను ఎలా పూట్టాలి, ఎవరికి పూట్టాలి తన తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు వెళుతూ ఉంటాడు.
అయితే విశ్వకర్మ తన తల్లిదండ్రులను తానే ఎంచుకోవాలి అని ఒక షరతు ఉంటుంది వాళ్ళిద్దరికీ తన సమక్షంలో పెళ్లి చేసిన తర్వాత సరిగ్గా పన్నెండు నెలలకు తాను చనిపోయి తాను ఎంచుకున్న తల్లి గర్భం లోనే తాను జన్మించాలి.
అందుకోసం మహానంద విశ్వకర్మ తన తల్లిదండ్రులని ఎలా తెలుసుకున్నాడు? ఆ సమయంలో ఇప్పుడు ఈ జన్మలో ఉన్న తన కొడుకు, కోడలు తన కుటుంబ సభ్యులు అతనికి సహకరించారా, లేదా ?తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది మనం ఈ నవలలో చదవాల్సిందే.
అయితే ఇందులో విశ్వకర్మ తన తల్లి కోసం ఖర్చు చేస్తున్న డబ్బు విషయంలో చాలా సమస్యలు వస్తాయి.
తల్లి పాత్ర కు ఒక్కసారే వంద కోట్ల రూపాయలు వస్తే అదొక పెద్ద వార్త కాబట్టి ఆ సమస్యల్లో నుండి మరుజన్మలో తన తల్లి అయ్యే పాత్రను ఎలా బయట పడేసారో, ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయం చేశారో, తన మరియు జన్మకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న అతన్ని అంతా పిచ్చోడు అని అంటున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం ఆయనకు పూర్వ జన్మ పై ఉన్న నమ్మకమే.
ఇక ఇందులోని పాత్రలు అయినా సీతామహాలక్ష్మి, ప్రకాష్ రావు, పరమేశ్వరి, ఏకాక్షుడు, అపురూప విశ్వనాథ అనే పాత్రల ద్వారా మనకు కలిగే ఎన్నో అనుమానాలను రచయిత తీర్చారు అని చెప్పుకోవచ్చు. నవల చదువుతున్నంత సేపు ఎంతో ఉత్కంఠగా అనిపిస్తుంది.
ముగింపు
ఫలానా ఊర్లో ఒకమ్మాయి తన భర్త తనను చంపాడని చూపించడం, ఒక చిన్న పిల్లాడు తన తల్లిదండ్రులు వేరే చోట ఉన్నారని చెప్పడం, అక్కడికి వెళ్లి పూర్వజన్మలో తన తల్లదండ్రుల్ని కలుసుకోవడం, ఈ మధ్యనే పేపర్ లో చదివాం. నాలుగేళ్ల పాప తన గత జన్మలో ఉన్న తల్లిదండ్రులను కలుసుకుందనీ.
ఇలాంటి వార్తలు మనం చదువుతూ ఉంటాం. కానీ ఇది నిజం అని నమ్మలేం కానీ మన హిందూ సాంప్రదాయల గురించి తెలిస్తే నమ్మక తప్పదు. ఈ నవలలో మన పురాణాల గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
నేను ఈ నవలను చదువుతున్నంతసేపు ఎంతో ఉత్కంఠ అనుభవించాను. ఇలాంటి పూర్వజన్మ జోనర్లో ఎన్నో కథలు వచ్చాయి. అయినా ఇది చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.
సినిమాలు కూడా వచ్చాయి ఈ సినిమాలో ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ అనేది కూడా వచ్చింది అయితే ఆ సినిమా మరీ అంత లోతుకు వెళ్ళలేదు.
250 పేజీల కన్నా ఎక్కువ ఉన్న ఈ నవల మొదలు పెట్టడం మన చేతుల్లోనే ఉంది కానీ దాన్ని ఆపడం ఆ రచయిత చేతుల్లోనే ఉంది అంత ఉత్కంఠభరితంగా సాగింది ఈ నవల.
ఇలాంటి నవలలు ఇక ముందు వస్తాయో రావో తెలియదు కానీ ఈ నవల మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నవల పై నా అభిప్రాయం ఇది ఎవరినీ కించపరిచదానికో, అమ్వామనించడానికో కాదు. నా అభిప్రాయం మాత్రమే .
– భవ్య చారు