మనిషి స్వార్ధపరుడు
మనిషి స్వార్ధ పరుడు అనేది అక్షర సత్యం. మొక్కలు తమ ఆహారాన్ని కాయలలో, ఆకులలో, వేర్లలో దాచుకుంటే వాటన్నింటినీ తన పరం చేసుకుంటూ పోతున్నాడు మనిషి. అలాగే పశువులు తమ బిడ్డల కోసం పాలు ఉంచుకుంటే ఆ పాలను పిండేసుకుని, వాడుకుంటూ ఉన్నాడు మనిషి.
తమ ఇంటి కోసం పచ్చని చెట్లను కొట్టేస్తూ ఉన్నాడు. తేనెటీగలు తమకోసం దాచుకున్న తేనెను కూడా తీసి వాడుకుంటూ ఉన్నాడు. సమస్త జీవరాశులు ఉపయోగించే నదుల నీటిని తన అవసరాల కోసం కలుషితం చేస్తున్నాడు మనిషి. సర్వ జీవులకు జన్మ స్ధలమైన భూమిని కూడా కలుషితం చేస్తున్నాడు మనిషి. గాలిని కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం కలుషితం చేస్తున్నాడు మనిషి.
భూమిని తవ్వేసి ఖనిజాలను కొల్లగొట్టే పనిలోనే ఉన్నాడు మనిషి.ఇతర జీవరాశుల వల్ల ప్రకృతికి ఏ సమస్యా లేదు. కేవలం మనిషి వల్లనే ప్రకృతి సమస్యలపాలు అవుతుంది. బ్రహ్మాండమైన ప్రకృతిలో మనిషి ఒక చిన్న అంశం మాత్రమే. ఆ విషయం మనిషి గ్రహించాలి. ప్రకృతిని కనుక మనం కాపాడితే,ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది.
– వెంకట భానుప్రసాద్ చలసాని