మనిషికి మరో గ్రహంలో చోటు దొరికితే

మనిషికి మరో గ్రహంలో చోటు దొరికితే

అబ్బో ఇదేంటి ఇలా ఉంది. అమ్మ అక్కడ అరె ఎవరూ కనిపించడం లేదేంటి, హా నేనేంటి అక్కడ కనిపిస్తున్న అదేంటి అలా ఉంది. అరెరే నా మాటలు నాకే వినిపిస్తున్నాయి ఏంటి. వామ్మో ఇలా మాట్లాడితే నా లోపల ఉన్న భావాలన్నీ బయటకు తెలిస్తే అమ్మో అయ్యో రామ ఇవి కూడా వినిపిస్తున్నాయి ఏంటిది బీప్ అంటూ సౌండ్ వస్తుంది.

నీకు ఆకలి వేస్తుంది. ఇదిగో టాబ్లెట్లు తీసుకో అంటూ ఒక రోబో వచ్చి టాబ్లెట్లు ఇచ్చింది. ఇదేంటి నువ్వు ఎవరు అంటూ అడిగాను నేనా నేనేరా మీ అమ్మను గుర్తుపట్టడం లేదా అంటూ అంది ఆ రోబో, ఏంటి నువ్వు మా అమ్మవా నీకేమైనా పిచ్చి పట్టిందా మా అమ్మ నాలాగే ఉంటుంది అన్నాను. ఇదిగో కావాలంటే మీ నాన్నని అడుగు నేనే మీ అమ్మ ఏమండీ చెప్పండి వీడికి నేను వీడు అమ్మనని అనేసరికి ఇంకొక రోబో వచ్చి అవును అని చెప్పింది ఇంకొక రోబో.

వామ్మో ఇదేంటి అందరం రోబోలుగా మారాం. ఇంతకీ చెల్లి, తమ్ముడు ఎక్కడ అంటూ అడిగాను అదిగో అక్కడే ఉన్నారు ఆడుకుంటున్నారు నీకు కనిపించడం లేదా అంటూ తన చేయిని ఇలా ఊపింది. అక్కడ ఒక స్క్రీన్ లాంటిది వచ్చి అక్కడ నా చెల్లి తమ్ముడు రెండు రోబోల్లా కనిపించాయి. ఇదేంటమ్మా మనం ఇలా ఉన్నాం రోబోలుగా అన్నాను అయోమయానికి గురవుతూ….

మేమే కాదు నువ్వు కూడా ఇలాగే ఉన్నావ్ నువ్వు చూసుకో అంటూ ఇంకొకసారి చేయి ఇలా ఉపగానే ఒక అర్థం లాంటి పలక నా ముందు వచ్చింది నన్ను నేను చూసుకున్నాను నిజంగానే నేను కూడా ఒక రోబోలాగా ఉన్నాను. బాబోయ్ ఇలా అని ఏంటి నేను నేను నేనేనా అంటూ గిల్లుకుందామని చూసేసరికి నా చేయి నాకే గట్టిగా ఇనుప రాడ్డులా తగిలింది. అమ్మా ఏంటమ్మా ఇది? మనం ఎక్కడున్నాం అసలు అంటూ మా అమ్మను అడిగాను దీనంగా…

మనం భూలోకం నుంచి ఇంకొక గ్రహానికి వలస వచ్చాం. ఇక్కడే బ్రతుకుతున్నాం. కొన్నేళ్ళ క్రితం మనం భూమి మీదనే ఉండేవాళ్ళం అయితే అక్కడ కొందరు స్వార్ధపరులైన మనుషులు చెట్లు నరికి బిల్డింగ్లు కట్టి పర్యావరణాన్ని అంతా కలుషితం చేశారు దానివల్ల విషవాయువులు వెలువడ్డాయి. అవి పీల్చి చాలామంది చనిపోవడంతో, కొందరు శాస్త్రవేత్తలు డబ్బులు ఉన్న వారిని వేరే గ్రహానికి పంపుతాం అంటూ ఇలా మరొక గ్రహానికి మనల్ని తీసుకొచ్చి పడేశారు.

అప్పట్నుంచి మనం ఈ గ్రహం మీదే బ్రతుకుతున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అమ్మ అంటూ అడిగాను ఆత్రంగా.. మనం చేసేదేముంది ఈ గ్రహం వారికి ఊడిగం చేయడమే భూమి మీద ఉన్నప్పుడు రాజకీయ నాయకుల చేతి కింద ఊడిగాలు చేశాము ఇప్పుడు కూడా బానిస బ్రతుకులే… రాజకీయ నాయకులు కొందరు స్వార్ధపరుల వల్ల చెట్లు బావులు, చెరువులు ప్రకృతిని అంతా నాశనం చేసి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టారు.

అలాగే ప్రపంచ జనాభా పెరిగిపోయి నిలబడడానికి కూడా చోటు లేకుండా పోయింది. ఎప్పుడైతే భూమిమీద కాలుష్యం అనేది పెరిగిందో అప్పుడు డబ్బులు ఉన్నవాళ్లు వేరే గ్రహాలకి స్థలాలు కొని వెళ్లిపోయారు మిగిలిన మనలాంటి జనాలు కొందరు చచ్చిపోయారు. మనం ఒక రాజకీయ నాయకుడి కింద పనిచేసే వాళ్ళం కాబట్టి మనల్ని కూడా వాళ్ళకి ఉడిగం చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చారు.

భూమి మీద ఉన్నప్పుడు మనతో ఎంత గోడ్డు చాకిరీ చేయించుకున్నారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు కాకపోతే ఒకటే వెసులుబాటు భూమి మీద ఉన్నప్పుడు చేతులతో పని చేసే వాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ పెరిగి అన్ని గాల్లోనే చేస్తున్నాం. గాలి అంటే గుర్తుకొచ్చింది స్వచ్ఛమైన ప్రకృతి గాలి పీల్చి ఎన్నాళ్ళయిందో మనము వేసుకున్న ఈ వేషం తీసేస్తే నిమిషాల్లో చచ్చిపోవడం జరుగుతుంది.

అందుకే ఇలా రోబో లాంటి డ్రెస్సులు వేసుకొని ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఇక్కడ బానిసలుగా బ్రతకబోతున్నాం… భూమి మీద నుంచి మనం వచ్చి పదేళ్లు దాటింది నువ్వు ఇప్పుడు లేచావు అందుకే నీకు అంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ కొన్నాళ్ళు పోతే నీకు కూడా అలవాటైపోతుంది. మన చేజేతులారా మన భూమిని మనమే నాశనం చేసుకున్నాం అందుకు ఈ శిక్ష అనుభవించాల్సిందే అంటూ గట్టిగా నిట్టూర్చింది అమ్మ అనే రోబో…

అమ్మో భూమి మీద కాకుండా ఇలా ఎన్ని రోజులు బ్రతకాలి నేను ఉండగలనా అమ్మో నేను ఉండలేను నేను ఉండలేను నేను ఉండలేను అంటూ గట్టిగా అరుస్తున్న నన్ను ఏంట్రా ఏంటి అరుపులు లే పడుకోకురా అంటే వినలేదు చూడు ఇప్పుడు అన్ని పిచ్చిపిచ్చిగా కలవరిస్తున్నావ్ అంటూ అమ్మ మొహంపై నీళ్లు కొట్టేసరికి చటుకున్న లేచి కూర్చున్నాను.

అమ్మ బాబోయ్ ఇది కలనా ఈ కల నిజమైతే ఎన్ని సమస్యలు వస్తాయి అసలు గాలి లేకుండా మనం బ్రతకగలమా, గాలి పీల్చని బ్రతుకు బ్రతికేనా అందుకే కాబోలు చెట్లు నాటించడం నాటడం మంచిదయింది. నిజంగానే ఇప్పటినుంచి నేను కచ్చితంగా చెట్లు నాటుతాను రోజుకు ఒక మొక్క అయినా నాటుతాను అని అనుకున్నాను మనసులో గట్టిగా అసలు ఈ కల రావడానికి కారణం ఏమిటంటే….

హరితహారం కార్యక్రమంలో భాగంగా పిల్లలమందరం చెట్లు నాటి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాను అన్నం తిని పడుకోబోతుంటే అమ్మ ఇప్పుడేం పడుకోవడమే పగటిపూట నిద్ర పనికి చేటు అని అన్నా కూడా నిద్రలోకి జారిపోయాను. అందువల్లే ఈ కల వచ్చింది అనుకుంటా… అమ్మో మరో గ్రహంలో చోటు దొరికితే అక్కడి వాతావరణం అనేది ఊహించుకుంటే భయమేస్తుంది. ఇకనుండి నేనే కాదు నా ఫ్రెండ్స్ అందరితో కూడా చెట్లు నాటిస్తాను అనుకుంటూ లేచి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాను. ఏంటో ఈ పిల్లలు అనుకుంటూ అమ్మ నన్ను వదిలి తన పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *