మనసుకు ఆహ్లాదాన్నిచ్చే రేడియో
అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు.2012లో తొలిసారి యునెస్కో ఫిబ్రవరి 13న ఈ ఉత్సవాలకు తెరతీసింది.రేడియో ఆవిర్భవించి వందేళ్ళు దాటినా సరిగ్గా 1920-45 మధ్య కాలంలో బాలారిష్టాలను దాటి రేడియో పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ మీడియం గా రూపొందింది.
మనిషి గళం ఏకకాలంలో అనేకమందిని చేరటం అనే ప్రక్రియ మొదలైంది.జనబాహుళ్యానికి వినోదాన్ని, సమాచారాన్ని అప్పటికప్పుడు ఇచ్చే గొప్ప సాధనంగా అవతరించింది..
అలా మార్కోని కనుగొన్న మాధ్యమం ప్రజలకు చేరువయింది. ఒక ఆశ్చర్యం, సంభ్రమాన్ని కలిగించిన రేడియో విస్తరణ మొదటి ప్రపంచ యుద్ధానంతరం మొదలయ్యింది. ఔత్సాహికుల నిరంతర ఆసక్తితో
ప్రసారాలు అప్పటి ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉండేవి.
ఆ స్టేషన్లన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రసారాలు చేస్తుండేవి. దీనికి భిన్నంగా రోటర్ డాం (నెదర్లాండ్స్) లో 1919నవంబర్ 6న ప్రసారాల సమయ, చిరునామాలను వెల్లడి చేస్తూ మొదలయ్యాయి. ఇక 1920-21లో అమెరికన్ నగరాల్లో ముప్ఫైకి పైగా స్టేషన్లు పురుడుపోసుకున్నాయి.
1922నాటికి ఆ సంఖ్య 550కి చేరుకుంది. అయితే ఇవన్నీ ప్రైవేట్ సంస్థలకు చెందినవే. ఇదే సమయంలో రష్యా, జపాన్, ఇటలీ, జర్మనీ, మెక్సి కో, నార్వే, పోలాండ్ దేశాలలోని రేడియో స్టేషన్లు ప్రభుత్వాధీనంలో లేదా ఆంక్షలకు లోబడి ఉండేవి.
తొలిరోజుల్లో కార్యక్రమాలు అన్న కాన్సెప్ట్ తక్కువగా ఉండేది.ఒక గొంతు (ఎక్కువగా మగవారే) ఏదైనా చదివితే అనంతరం కొంత నేపథ్య సంగీతం ప్లే అవుతూ ఉండేది. అదే సమయంలో భారతదేశంలో బ్రిటిషు అధికారం ఉన్న సమయంలో పరిస్థితి ఎలా ఉండేది.
1923లో బాంబే ప్రెసిడెన్సీ క్లబ్ 1923లో ప్రసారాలు ప్రారంభించింది.అదికొంచెం పెరిగి 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కి బ్రిటిషు ప్రభుత్వం రెండు స్టేషన్లు నడుపుకోవటానికి అనుమతి ఇచ్చింది.
అలా వ్యవస్థీకృతంగా ప్రసారాలు 1923 జూలై 23న బోంబోలే ప్రారంభమయితే కలకత్తాలో ఆగస్టు 26న ప్రారంభమయ్యాయి. 1930మార్చినాటి కి ఆ కంపెనీ దివాళా తీసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరుతో ఆ రేడియో స్టేషన్లను తను నిర్వహించడం మొదలుపెట్టింది.
1936 జూన్ 8న ఆ పేరు ఆల్ ఇండియా రెడియో (All India Radio) గా స్థిరపడింది. అదే సమయంలో 1932లో నిజాం ప్రభుత్వం డెక్కన్ రేడియో పేరుతో ప్రసారాలు ప్రారంభించింది. దానిని 1950లో భారత ప్రభుత్వం ఆలిండియా రేడియోగా మార్చింది. 1938లో మద్రాసు రేడియో కేంద్రం ఏర్పడింది.
జూన్ 16న ప్రారంభమైతే 18న గిడుగు రామమూర్తి పంతులు తొలి ప్రసంగం చేశారు. స్వాతంత్రం సిద్ధించిన రోజున బాలాంత్రపు రజనీకాంతరావు గారు టంగుటూరి సూర్యకుమారి గారిచేత ‘మాదీ స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్రదేశం గీతాన్ని పాడించారు.
అనంతరకాలంలో 1948 డిసెంబర్ 1వతేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రాలలో ఎంతోమంది ప్రముఖులు పనిచేశారు.
ఆచంట జానకీరాం, పింగళి లక్ష్మీకాంతం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, నండూ రి సుబ్బారావు, బాలమురళి, నండూరి సుబ్బారావు, త్రిపురనేని గోపీచంద్, స్థానం నరసింహారావు, లత, తురగా జానకీరాణి వంటి సాహితీవేత్తలు ప్రయోక్తలుగా పనిచేశారు.సంగీత, సాహిత్యాలకు అపారసేవ చేసిన ఆకాశవాణి భాష పట్ల అందరికీ అభిరుచిని ప్రవేశపెట్టింది.
రేడియో మనిషికి ఒక సన్నిహిత మిత్రుడులాంటిది.వెంటే ఉండి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది..వార్తలనందించే విశ్వవాణి. ఈ ప్రపంచ రేడియో దినోత్సవం రోజున కొన్ని జ్ఞాపకాలను తలుచుకుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
– సి.యస్.రాంబాబు