మనసు మాట
“ఎందుకలా అందర్నీ మోసం చేస్తావు. అందర్నీ ఇబ్బంది పెడతావు” అంది ప్రసాదు మనసు ప్రసాదుతో. “నేను నా కోసం, నా కుటుంబం కోసం డబ్బులు సంపాదించాలి. అందుకోసం నేను అందర్నీ మోసం చేసేస్తాను. ఇతరుల్ని మోసం చేసైనా డబ్బులు సంపాదిస్తాను” అన్నాడు ప్రసాదు తన మనసుతో.
అప్పుడు ఆ మనసు “చూడు ప్రసాద్. జీవితం చాలా చిన్నది. నువ్వు చేసే మంచి-చెడు చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బుల వల్ల నీకు, నీ కుటుంబానికి కీడు జరుగుతుంది. ఆ మోసపోయిన వారి ఉసురు నీకు తగులుతుంది. అందుకే నా మాట విను. మనసు మాట వినేవాడే నిజమైన మానవత్వం ఉన్న మనిషి” అంది ప్రసాదుతో.
మనసు మాట విని ప్రసాదు ఆలోచనలో పడ్డాడు. మనసు చెప్పింది నిజమే అని అతనికి అర్థం అయ్యింది. అంతే ఆ రోజు నుండి మనసు మాటలు విని మానవత్వం ఉన్న మనిషిలా ప్రవర్తించి మనశ్శాంతిగా జీవించాడు.
– వెంకట భానుప్రసాద్ చలసాని