మజిలీ
గతుకులతో ఉన్న మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వెళుతోంది బస్సు. అసలే వేసవి కాలం, అందులో మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండ అదిరిపోతోంది.
బస్సులో క్రిక్కిరిసి ఉన్న జనం వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బస్సు ఆగిన ప్రతిసారీ గాలి ఆడక తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్ పై విసుక్కుంటున్నారు. తొందరగా తమ గమ్యం చేరుకోవడం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు.
బస్సులో కిటికీ పక్కన దూరంగా చూపులు సారించి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు కూర్చునివున్న తులసి “టికెట్ ఎక్కడి వరకు ఇవ్వాలి? ” అంటూ కండక్టర్ రెట్టించి అడిగితేగానీ వర్తమానంలోకి రాలేదు.
“ఈ బస్సు ఎక్కడ వరకు వెళ్తుందండి?” అడిగింది.
“దేవపురం వరకు” అసహనంగా చూస్తూ చెప్పాడు.
“అక్కడికే ఒక టికెట్ ఇవ్వండి”.
టికెట్ తో పాటు చిల్లర ఇచ్చిన కండక్టర్ “టికెట్.. టికెట్” అంటూ ముందుకు సాగిపోయాడు.
బస్సు వేగం పుంజుకుంది. దగ్గరగా వచ్చినట్లే వచ్చి స్థిరంగా ఉండకుండా వేగంగా వెనక్కి పరిగెడుతున్న చెట్లు, పశువులు, వాహనాలను తదేకంగా చూస్తూ ఉంది తులసి. తన జీవితంలో కూడా ఇలాగే శాశ్వతం అనుకున్న ఏ ఆనందం కూడా తన దగ్గర స్థిరంగా ఉండలేదు. అందివచ్చిన ప్రతి ఆనందాన్ని భగవంతుడు వెనక్కి తీసుకుంటూనే ఉన్నాడు. తన జీవిత ప్రయాణంలోని ప్రతి మజిలీ తనకు అంతులేని వేదననే మిగిల్చింది.
పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోవడంతో తన జీవితంలో కష్టాల పరంపర మొదలైంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథగా మారిన తనని మేనమామ చేరదీసి పదిహేను ఏళ్ళ ప్రాయంలో ఒక అయ్య చేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. అన్ని వ్యసనాలకు బానిస అయిన భర్తను ఓపికగా భరించుతూ అతడిని మార్చుకోవడానికి ఎన్నో విఫల ప్రయత్నాలు చేసింది.
సంవత్సరం తిరక్కముందే తన ఒడిలోకి వచ్చిన పండంటి బిడ్డను చూసుకొని సంతోషంతో మురిసిపోయింది. బిడ్డను చూసుకుని అప్పటివరకు పడిన కష్టాలు అన్నింటినీ మరిచిపోయింది. బిడ్డ తోడిదే జీవితంగా బతకాలనుకుంది. బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంది. కానీ తులసిని మరోసారి బిడ్డ అనారోగ్యం రూపంలో విధి వెక్కిరించింది. గుండెలో రంధ్రంతో పుట్టిన బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తులసికి గుండెకోతను మిగిల్చి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఈ అఘాతం నుంచి తేరుకొని తనను తాను కూడ దీసుకోవడానికి తులసికి చాలా సమయమే పట్టింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జీవితమనే రథాన్ని కడదాకా నడిపించాలనే నిర్ణయించుకుంది. ఆ భగవంతుడు ప్రసాదించిన జీవితం అతడు తిరిగి వెనక్కి తీసుకునే దాకా కొనసాగించాల్సిందే. అతని పిలుపు రాకముందే దానిని అంతం చేసుకునే హక్కు తనకెక్కడిది? రేపు అనేది మన కోసం ఏమి దాచిపెట్టి ఉంచిదో ఎవరికి తెలుసు? మళ్లీ తన జీవితంలోకి మరో బిడ్డ రూపంలో వసంతం రాకపోతుందా?
బిడ్డ మరణంతో భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించే లోగానే మరో అనుకోని సుడిగుండం తులసి జీవితాన్ని అతలాకుతలం చేసింది. అంతుచిక్కని వ్యాధి సోకి భర్త హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన తులసిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. జీవితం ఆగమ్యగోచరంగా తోచింది. ఉన్న చిన్నపాటి ఇల్లును అప్పులవాళ్ళు హస్తగతం చేసుకోగా సర్వస్వం కోల్పోయిన స్థితిలో కట్టుబట్టలతో బయల్దేరి కనిపించిన బస్సు ఎక్కేసింది.
“దేవపురం… దేవపురం..” దిగాలమ్మా….
కండక్టర్ హెచ్చరికతో ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడి నెమ్మదిగా బస్సు దిగి నడక ప్రారంభించింది. తన పాతికేళ్ల జీవితంలో నూరేళ్లకి సరిపడా ఒడిదుడుకులను చవిచూసింది. అయినా ఏనాడూ జీవితేచ్ఛను కోల్పోలేదు. కానీ ఇప్పుడు నా అన్నవాళ్ళు ఒక్కరూ లేని ఈ లోకంలో తను ఎందుకోసం బ్రతకాలి? బతికి ఏం సాధించాలి? అందుకే ఎవ్వరికీ ఉపయోగపడని ఈ జీవితానికి ముగింపు పలకడమే సరైన నిర్ణయం..
“అన్నా…. చాలా దాహంగా ఉంది. ఇక్కడ బావి ఎక్కడ ఉంది? “
దారిన పోతున్న ఒక నడి వయస్కున్ని అడిగింది తులసి. ఊరిలో కొత్తగా కనిపిస్తున్న స్త్రీని కొంచెం ఎగాదిగా చూసి
“ఇక్కడి నుండి తిన్నగా అరకిలోమీటరు దూరం వెళ్తే “అమ్మోరు తల్లి” గుడి వస్తుంది. గుడికి కుడివైపు సరిగ్గా ఫర్లాంగు దూరంలో బావి ఉంది. “
అటువైపుగా నడక మొదలు పెట్టింది. నూరేళ్ల జీవితానికి డెబ్భై ఐదు ఏళ్లకు ముందే ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుని ఆ దిశగా వేసే చివరి అడుగులు అవి. దాహంతో నాలుక పిడచ కట్టుకు పోతోంది. గత కొంత కాలంగా సరైన ఆహారం లేని శరీరం తూలిపోతోంది. నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లు భ్రమింపచేస్తూ భానుడు చండ ప్రచండంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయినా ఆమె దేనినీ లెక్కచేయడం లేదు. తన చివరి ప్రయాణాన్ని కూడా సవ్యంగా సాగనీయని తన విధిరాతను తలచుకొని చిన్నగా నవ్వుకుంది.
అనుకోకుండా ఆమె పాదాలు హఠాత్తుగా నిలిచిపోయాయి. ఎదురుగా అమ్మోరు తల్లి విగ్రహం. కళ్ళనుండి అగ్నిజ్వాలలు ప్రసరిస్తున్నాయా అన్నట్లు చూపరులను కట్టివేసే తేజోవంతమైన విశాల నయనాలు. అప్రయత్నంగా తన రెండు చేతులూ జోడించి నమస్కరించింది తులసి.
“జీవితం పట్ల ఆపేక్ష నాలో పూర్తిగా నశించిపోయింది. అందుకే నువ్విచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నాను. నన్ను క్షమించు తల్లీ…”
వడివడిగా బావి వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. నీటి జాడలు కనిపించడంతో ఆమెలోని దాహార్తి పైకి లేచింది. అంతలోనే ఆమె పెదవులు శుష్క హాసాన్ని చేశాయి. ఇంకా సేపు ఆగితే బావిలో నీళ్ళన్నీ అన్ని తనవే.. రెండడుగులు ముందుకు వేసింది
“అమ్మాయీ..ఓ అమ్మాయీ….”
పిలుపు వినిపించిన వైపు దిగ్గున చూసింది. దాదాపు ఎనభై ఏళ్ల కు దగ్గరగా ఉన్న నడుము వంగిపోయిన వృద్ధురాలు కనిపించిందక్కడ.
“ఎవరు నువ్వూ.. ఏం చేస్తున్నావ్ అక్కడ?”
“నేనూ..నేనూ…”
“నువ్వు ఎవరో తెలియదు కానీ… ఇవాళ నా టీ కొట్టులో పనిచేసే పిల్ల రాలేదు. టీ చేయడంలో నాకు కొంచెం సహాయం చేస్తావా? బస్సు వచ్చే సమయానికల్లా టీ తయారు కాకపోతే కస్టమర్లు వేరే కొట్టుకు వెళ్ళిపోతారు. నీ కష్టం ఉంచుకొనులే… ఏమంటావు?”
“నేనా…”
“అవును తల్లీ.. ప్రాణం పోతే.. ఈ కట్టెను కాల్చేయడానికి కూడా ఎవరూ లేని అభాగ్యురాలిని. కాస్త సాయానికి రామ్మా…”
“అవ్వా…. నీకు ఎవరూ లేరా?”
“లేరు తల్లీ.. అందరూ నన్ను విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఈ చిన్న టీ కొట్టుతో ఎలాగో కాలం వెళ్లదీస్తున్నా”
“అవ్వా..ఈ వయసులో నువ్వు…”
“మరేం..చేయమంటావమ్మా.. పోయిన వాళ్ళతో మనమూ పోలేముగా.. మన కాలం వచ్చేవరకు మనము ఆగాలి. కష్టమో, సుఖమో పై వాని పిలుపు వచ్చేవరకూ బతుకీడ్చాల్సిందే.. మరి.. కష్టాలకు భయపడి పారిపోతే ఏముందమ్మా.. జిందగీతో పోరు చెయ్యాలే.. మన చేతనైనంతగా మనం దాన్ని దిద్దుకోవాలే.. అప్పుడే మనం మనుషులుగా పుట్టినందుకు లెక్క కుదురుద్ధి”
ఒక్కసారిగా తులసిలోని ఆణువణువూ సంచలనానికి గురైంది. అప్పటివరకు అంతు దొరకకుండా వేధించిన ప్రశ్నలకు సమాధానం స్పురిస్తున్నట్లుగా గోచరించింది. జీవితంలో సర్వస్వం కోల్పోయినా… భవిష్యత్తు అనేది మిగిలే ఉంటుంది అనే అంతిమ సత్యం అవ్వ మాటలతో అర్థమైంది.
ఎనభై ఏళ్ల వృద్ధురాలు.. జీవితం విసిరిన సవాళ్లను అంత ధీటుగా ఎదుర్కొంటుంటే తనేమిటి ఇలా పారిపోవాలనుకుంటోంది? జీవిత సాఫల్యం పోరాడడంలో ఉంది పారిపోవడంలో కాదు… అని తనకు తెలిసేలా చేసిన అవ్వ వైపు ఆరాధనగా చూసింది తులసి.. ఏదో తెలియని నూతనోత్సాహం ఆమె నరనరాల్లో ప్రసరించింది. పెదవులు చిరు మందహాసంతో విచ్చుకున్నాయి. తన జీవిత పయనంలో మరో మజిలీ ప్రారంభం అవుతోందనడానికి చిహ్నంగా…
సమాప్తం.
– మామిడాల శైలజ