మధుర జ్ఞాపకం
చిన్నతనం లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి, ఆడుకున్న స్థలాలు, చేసిన చిలిపి పనులు, అమ్మ వంట చేస్తుంటే వెళ్లి మనమూ ఓ చెయ్యి వేయడం, నాన్న తింటుంటే వెళ్లి దగ్గర కుర్చుని అన్నం పెట్టమని అడగడం లాంటివి, అమ్మ ఎండాకాలం లో ఆరుబయట వెన్నెల్లో ఆవకాయ అన్నం పెడుతుంటే ఆ ముద్దలను కింద పడకుండా తినడం లాంటివి.
స్నేహితులతో ఆడుకున్న ఆటలు, కోపం వస్తే అలిగి మాట్లాడకుండా ఉండడం , ఆ తర్వాత మళ్ళి మిగతా మిత్రులు ఏ మాట్లాడే పాపం అంటూ సర్ది చెప్తే పలికే తోలి పలుకులు, ఐస్ బండి వాడు రాగానే అమ్మను బ్రతిమాలి కొనిపించుకోవడం, కాస్త పెద్దయ్యాక బాధ్యతలు తెలుసుకుని సరుకులు తేవడం, ఇంటి విషయాలు పట్టించుకోవడం , ఇది మన పరిస్థితి అని తెలిసి అన్ని పొదుపుగా వాడుకోవడం, అమ్మానాన్నలను విసిగించకుండా చెప్పినట్టు వినడం ఉన్నంతలో జాగ్రత్తగా ఉండడం, చదువు విలువ తెలుసుకుని బాగా చదువుకోవడం.
ఆ పై కాలేజికి బిడియంగా వెళ్ళడం, మొదటి రోజు ర్యాగింగ్ చేస్తారట అంటూ అంతకు ముందు స్నేహితుల మాటలు చెవుల్లో మోగుతుంటే చుట్టూ భయంగా చూస్తూ అడుగు పెట్టడం, మా కన్నా పెద్దవారు కేవలం ,ఊరు ,పేరు అడిగి వదిలేయడం, ఇంతేనా అనుకుంటూ సంతోషoగా మొదటి రోజు అందర్నీ పరిచయం చేసుకోవడం, మాస్టారు అందర్నీ అన్ని విషయాలు అడుగుతూ ఉంటె అమ్మాయిల పేర్లు తెలుసుకుని ముచ్చట పడడం, అబ్బాయిలం కొందర్ని నాది అనుకుంటూ అరేయి ఆమె నన్నే చూస్తుంది అంటూ స్నేహితులు ఆమెను చూడకుండా హింట్ ఇవ్వడం.
మెల్లిగా చదువులో పడి మిగిలిన విషయాల్లో శ్రద్ద చూపక పోయినా ఇష్టపడిన అమ్మాయి వచ్చిందా లేదా అంటూ ఓర చూపులు, గమనింపులు, చూస్తే చిరునవ్వు , మాట్లాడితే గాల్లో తేలిపోతూ స్నేహితులకు థంసప్ పార్టీ ఇవ్వడాలు, ఒకరి పుస్తకాలు ఒకరు తీసుకుని రాసుకోవడాలు, తోలి గా కొన్న పుస్తకం , కాపి లో శ్రీ రామ్ అని రాసుకోవడం.
పరిక్షలు దగ్గరకు వస్తున్నాయి అంటే చిలిపి పనులన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా చదవడం, మబ్బున మూడు గంటలకే లేచి బట్టి పట్టడాలు. పరిక్షలు అయ్యాక నువ్వెలా రాసావు అంటే నువ్వెలా రాశావు అంటూ అడగడం, మార్కులు ఎన్ని వస్తాయో అంటూ లెక్కలు వేసుకోవడం, అయ్యో ఇది విడిచి పెట్టాను, ఇది నాకు వచ్చిన జవాబే అంటూ నెత్తి కొట్టు కోవడం.
తర్వాత ఫలితాల్లో సాధించిన మార్కులు చూసి ఇంకొన్ని వస్తే బాగుండు అంటూ నిరాశ పడినా స్నేహితులకు తక్కువ వచ్చాయని తెలిసి సంబర పడడం, తర్వాత అందరితో పాటూ వెళ్లి వాణ్ణి ఓదార్చినట్టు మాట్లాడడం లాంటివి. ఇలా యెన్నో జ్ఞాపకాలు మదిలో, చెప్పుకుంటూ పోతే రొజూ సరిపోదు. అందుకే ఇక్కడితో ఆపేస్తూ …
– భవ్య చారు