మాతృ దినోత్సవము
1) చిన్న నాట అమ్మ చీదరించుకొనక
కడిగి.ముత్యము వలె కాటుకెట్టి
దిష్టి తగలకుండ దిష్టి చుక్కను బెట్టి
ఊయలందు వేసి ఊపుచుండు
2) అమ్మ చెంతనున్న ఆటాడుకుందును
అమ్మ ఒడిన నున్న అంత హాయి
అమ్మ పెట్టు బువ్వ కమ్మగా ఉండును
అమ్మ కన్న నాకు అధికులెవరు
3) అమ్మ గోరుముద్ద అమృత సమముండు
అమ్మ ముద్దులన్ని కమ్మగుండు
అమ్మ హత్తుకొనిన బొమ్మ లక్కరలేదు
అమ్మ దేవతగద అవనియందు
4) అలసటెరుగకుండ అన్ని పనులు చేయు
విశ్రమించనట్టి విమల మనసు
అమ్మ సేవలందు అణువంత చేయము
అమ్మ ఋణము దీర్చ నలవిగాదు
5) స్వార్థ మెరుగనట్టి సేవలు చేసెడి
తల్లి ఋణము నెపుడు దీర్చలేము
కన్నసంతు ఎదిగి కనుల ముందుండిన
అమ్మ మనసు తృప్తి అనుభవించు
6) ఎన్ని కష్టములైన ఎదిరించి తీరును
కన్న సంతు కొరకు కష్టపడును
కంటిరెప్పలాగ కాపాడు తల్లికి
అందజేతనంత వందనములు
– కోట