మాటే మంత్రము

మాటే మంత్రము

ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల యుద్ధాలు సంభవించవచ్చు. మాట తీరు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది.

కాబట్టి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకొని వారి ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడితే పెద్ద సమస్యలకు కూడా గొప్ప పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు.

ఉదాహరణకు ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ చెబుతాను.

ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఊరి చివర ఉన్న బావి వైపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమించడానికి దారిన వెళ్లే వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు.. “అమ్మాయి జీవితం ఎంతో విలువైనది అది కోటానుకోట్ల అధమాధమ జన్మల అనంతరం ఒక్కసారే లభించే వరం. అలాంటి జన్మను కష్టాలు వచ్చాయని వెరచి అంతం చేసుకోవాలనుకోవడం సమంజసం కాదు. ఈ కష్టాలు కన్నీళ్లు తాత్కాలికమైనవి మాత్రమే.. అవన్నీ దైవాదీనమైనవి” అంటూ హితబోధ చేశాడు. కానీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

దారిలో మరొక వ్యక్తి ఎదురయ్యి..”జీవితం మధ్యలో అంతం చేసుకోవడం పాపం దానివల్ల అసంపూర్ణమైన జీవిత ఫలితంగా మరుజన్మలో ప్రేతాత్మ రూపంలో సంచరించాల్సి వస్తుంది” అన్నాడు. అయినా ఆమె వినలేదు బావి వైపు వెళుతూనే ఉంది.

మరొక స్త్రీ ఆమెను సముదాయిస్తూ “అమ్మాయి ఇప్పుడు కనుక నువ్వు చనిపోతే నీ పిల్లలు అనాధలవుతారు. నీ భర్త మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చిన మారుతల్లి నీ పిల్లలను చిత్రహింసలు పెడుతుంది. కనీసం నీ పిల్లల కోసమైనా నేను నిర్ణయాన్ని మార్చుకో” అంటూ నచ్చ చెప్పింది. అయినా ఆ స్త్రీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు బావి దగ్గరకు వెళ్లి అందులో దూకబోతుండగా..

అక్కడే పని చేసుకుంటున్నా ఒక స్త్రీ.. “ఏమిటి ఆ బావిలో పడి చావాలనుకుంటున్నావా..? అంతకంటే అసహ్యం లేదు అందులో జంతువుల కళేబరాలు, చెడిపోయిన పదార్థాలు చెత్తాచెదారం వేయబడి కంపు వాసన వేస్తున్నాయి.. అందుకే అటువైపుగా ఎవరూ వెళ్ళరు” అంది. అంతే ఒక్కసారిగా ఏవగింపు కలిగింది ఆ స్త్రీకి. చావు ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటి దారి పట్టింది.

అంటే మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మాటలను స్వీకరించే విధానం మారుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఏ విషయంలోనైనా సఫలీకృతం కావచ్చు అనడానికి ఇదే ఉదాహరణ..

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *