మారని మనం
ఒక కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు సంధర్బంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఉపన్యాసం మొదలు పెడతారు, తన ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత ఆ కళాశాల లో చదువుతున్న ఒక అమ్మాయి ఉపన్యాసం ఇవ్వడానికి వేదిక మీదకు వెళ్తుంది, ఆ అమ్మాయి ఇందాకే ఉపన్యాసం ఇచ్చిన ప్రిన్సిపాల్ ను “సర్ నేను ఉపన్యాసం మొదలు పెట్టే ముందు మీరు ఒక విషయం నాకు చెప్పండి” అని ఆ అమ్మాయి ప్రిన్సిపాల్ ను అడగ్గా ఆయన “సరే ఏంటో అడగమ్మ” అని అంటాడు.
అప్పుడు ఆ అమ్మాయి “సర్ మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది” అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ ” అదేంటి అలా అడుగుతోంది అని ఆశ్చర్య పోతారు..
అప్పుడు ఆ ప్రిన్సిపాల్ 1947 ఆగస్టు 15 అని చెప్పగా అప్పుడు ఆ అమ్మాయి “మరి గాంధీ గారు ఎందుకు సర్ అలా చెప్పారు” అప్పుడు సర్ “ఏమని చెప్పారు” అప్పుడు అమ్మాయి “అర్దరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరిగినపుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా, అర్దరాత్రి వరకు ఎందుకు పగలు కూడా స్వేచ్చగా తిరిగే అదృష్టం అమ్మాయికి లేకుండా పోయింది. మరి ఇంకెక్కడ స్వాతంత్రం వచ్చినట్టు సర్” అని ఆ అమ్మాయి అడగ్గానే, ఏమి చెప్పాలో అర్థం కాని ప్రిన్సిపాల్, అంటే అప్పుడు ఆంగ్లేయుల బానిసత్వం నుంచి మనం బయట పడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాము అంటాడు.
అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ స్వాతంత్రం సర్ అమ్మాయిల మీద ఒక మగాడు చేస్తున్న అన్యాయాలు, ఘోరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కదా ఎవరు ఆపుతున్నారు, ఇప్పటికీ ఒక మగాడి చేతిలో బానిసలుగానే వున్నాం కదా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగి దారుణంగా హత్య చేస్తే, అప్పటికప్పుడే ప్రజల్లో చైతన్యం కలిగి కొవ్వొత్తులు పట్టుకుని వస్తారు కాని మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది మళ్ళీ కొవ్వొత్తులు పట్టుకుని వస్తారు మళ్ళీ పునరావృతం అవుతుంది ప్రతిసారి ఇదే జరుగుతుంది కొవ్వొత్తులు అమ్ముకునే వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కాని న్యాయం జరగదు మరీ స్వాతంత్రం ఎక్కడ సర్”
ప్రిన్సిపాల్ గారు “అందరూ అలాగే ఉండరు కదామ్మా” అమ్మాయి “అందరూ అలా వుండరు కొందరే ఉంటారు, కాని ఆ కొందరు రెచ్చిపోతుంటే అందరిలో మిగతా కొందరు ఏం చేస్తున్నారు సర్ చోద్యం తప్ప” అప్పుడు ప్రిన్సిపాల్ “మరి అలాంటప్పడు మనమే జాగ్రత్తగా వుండాలమ్మ, ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఆ ప్రమాదంలోకి వెళ్ళాలి, ఎందుకు ఒంటరిగా వెళ్ళాలి”
అప్పుడు అమ్మాయి “మరి ఇక్కడ స్వాతంత్రం ఎక్కడ సర్, గాంధీ గారు చెప్పింది అదే కదా, అంతెందుకు ఒక అబ్బాయి పెళ్ళి విషయంలో అతని నిర్ణయమే చివరిది కాని అమ్మాయి విషయంలో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి, అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మాట కాదనలేక తలొంచి తాళి కట్టించుకుంటుంది ఇక్కడ కూడా ఒక మగాడు అమ్మాయి నచ్చగానే పెళ్ళికి సిద్దం అవుతున్నాడు కాని అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా తన జీవితం ఇది అని ఒక నిర్ణయానికి వస్తున్నాడు, కాని ఇక్కడ అమ్మాయి జీవితం కు విలువ ఎక్కడ..?
ఇక స్వాతంత్రం ఎక్కడ, విదేశీ సాంప్రదాయలను విమర్శించే మనం చాలా విషయాలలో వారినే ఎందుకు అనుసరిస్తున్నాం, పుట్టిన రోజులకు కేక్ కటింగ్ లు, ఎప్పుడు లేని కొత్త కొత్త దినోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం, ఇది మన దేశ సాంప్రదాయం కాదు, మన దేశ వ్యవహారాలు కాదు అని మన తరువాత తరం వారికి ఎందుకు చెప్పలేకపోతున్నాం, ఆహారం నుంచి వైద్యం దాక అన్ని విదేశీయులునే అనుసరిస్తున్నాం, మన దేశ విశిష్టత, వైద్య, ఆహార వనురుల గురించి మన కన్నా విదేశీయులు కే బాగా తెలుసు, చివరగా ఆంగ్లేయులు మనల్ని వదిలి వెళ్ళే ముందు వాళ్ళ రోగాలను మనకు అంటించి పోయారు…. “మనం ఇప్పటికి మారని మనం గానే వున్నాం” అని ఆ అమ్మాయి తన ఉపన్యాసాన్ని సభలో వున్న సహచరుల చప్పట్ల మధ్య ముగిస్తుంది.
– అశోక్