మా బాల్యం

మా బాల్యం

మా బాల్యం, కౌమార్యాలు అయోమయంగా గడిచిపోయాయి. తుంటరి ఇంటరు వయసు దాటి మొత్తానికి కాస్తంత నిబద్ధతకు ఆలవాలమైన మెడికల్ కాలేజీలో అడుగుపెట్టాం. కొత్తగా రెక్కలొచ్చిన ఉత్సాహంలో ఉన్నాం మేమంతా…!

యవ్వనం నవ్వుతోంది అందరిలోనూ. గోరువెచ్చని ఊసులు చెప్పుకుంటూ, ఆకుపచ్చని ఆశలు చిగుర్చుకుంటూ అందరం నునులేత మావిళ్లలా మిసమిసలాడుతున్నాం.

అంతవరకూ ప్రౌఢల్లా, మా బయోకెమిస్ట్రీ మేడమ్‌లా మరీ మనోహరంగా కనబడిన వేటూరి పాటల్లో పదాలన్నీ మాకు వాటిపై గౌరవాన్నే కలిగించాయి. అందుకని చర్చలకందని పదాల్ని పక్కనబడేసి, మిర్చీల్లాంటి పాదాలనే రుచి చూసేవాళ్లం.

అప్పుడు జరిగిందది…

మాకు సైతం చేతనైన పదాలతో, సినిమా పాటకి సీమంతం చెయ్యడానికి ఒకాయనొచ్చాడని తెలిసింది. గుడిగోపురాల మీద నర్తకీమణుల మూర్తుల్ని ‘రాళ్లే జవరాళ్లై నాట్యాలాడతాయిక్కడ’ అంటూ వింతగా వర్ణించాడు.

అంతవరకూ చిక్కటి మేఘం అలుముకున్న ప్రతిసారీ ఏ పిడుగు పడుతుందోనని భయపడే మాకు ‘కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడం’టూ దేవుణ్ణి నిందాస్తుతి చేసే ఓ విచిత్రమైన భావనను రేకెత్తించాడు.

అదుగో, ఆ క్షణంనుంచీ ప్రకృతిలో ప్రతీ ఆకృతినీ ప్రత్యేకదృష్టితో చూడటం అలవాటయింది. పాషాణాలన్నీ చిరాయువులనీ, తేనెలొలికే సుమబాలలకు మాత్రం మూన్నాళ్ల ఆయువేననీ వాపోయే ఆ సున్నితహృదయం సుమనోహరంగా పరిచయమైంది.

అనకాపల్లిలో ఆయన తమ్ముడు మాకు పరిచయం. శంకరాభరణం విజయోత్సవ సభలో విశ్వనాథ్ గారి సమక్షంలో మన సీతారాముడి కవితలు వినిపించారని, కేవలం అయిదే నిముషాలంటూ అవకాశమిచ్చి, తీరా చదవడం మొదలెట్టాక, ఆపొద్దని, మరిన్ని చదవమంటూ విన్నవించుకున్నారని ఆనోటా ఈనోటా చెప్పుకునేవారు. అదివిన్న నాకు అక్షరాలకున్న శక్తి ఎటువంటిదో అర్ధమైంది. అందులో నిజానిజాల్ని రూఢీ చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు, చెయ్యబోలేదు కూడా!

సిరివెన్నెల…

కథావస్తువు బెంగాలీ బాబుల నవలల్లా ఉంటుంది. పాల్గొన్నవాళ్లూ వాళ్లే! ఎక్కడో రాజస్థాన్‌లో వడియాలు, అప్పడాల తెలుగుదనం, మూన్‌మూన్ సేన్ సిగరెట్లు కాల్చడం, సుహాసిని మూగరోదనా జనానికి నచ్చలేదు. మరేం నచ్చింది?

వెన్నెల్లో బృందావనాన్ని చూపించమంటూ అల్లరిచేసే చిన్నారికే కాదు. మనందరికీ ఒక్కపాటతో రాధామాధవగాథల రంజిలు బృందావనాన్ని చూపించడం నచ్చింది.

ఎన్నోయేళ్ల తరవాత సొంతవూరి గాలి తాకిన మనసుపడే తాదాత్మ్యం, ఎన్నాళ్లో గడిచాక ఇన్నాళ్లకు కలిసినందుకు ఉప్పొంగిన గుండెలతో నింగికెగసే చిన్నారి గొరవంక చేసిన విన్యాసం నచ్చింది.

వసంతమాసపు కులగోత్రాల పట్టింపులేని ఎలకోయిల నచ్చింది
తొలకరిమేఘపు గుణగణాల్ని ఎన్నని నెమలి కూడా నచ్చింది

ఇంతటి భావుకతనీ ఒకే చిత్రంలో కూరేసి, పందార ఎక్కువైపోయిన బొంగ్లా రసగుల్లాలా తయారు చేసి పడేశారు శాస్త్రిగారు. మధురం. మధురాతిమధురం. అంత తీపి మాకొద్దు. పాటలో ఏవో నాలుగు పటిక పందారముక్కలున్నా చాలనుకునే తెలుగువాడికి చక్కెర బీమార్ తెప్పించేశారు.

అది అనాదిరాగంగా మారి, అనంత జీవనవాహినిగా మన ముంగిళ్లలో ప్రవహించబోతోందన్న నిజం ఆరోజే బోధపడింది.

ఇక మిగిలిందేమిటని దిగులుపడిపోయిన హృదయాల్ని నవనీత లేపనాలతో తిరిగి లేపగల శక్తివంతమైన పాటలు వీరి కలానికున్న ప్రత్యేక లక్షణం.

‘మొన్ననే నేను కళ్లు తెరిచాను
ఇంతలో నన్ను బూచాడికిచ్చెయ్యకు’

అంటూ ఎదిగిన కుర్రాడు మాస్టారిణిని వేడుకుంటోంటే ఎంత రొమాంటిగ్గా అనిపించిందో?

అంతవరకూ ‘దాసుడితప్పులు దండముతోసరి’ లాంటి పడికట్టుపదాల అల్లికల మధ్య ఈ పాట చెవులకు సరికొత్తగా, బుగ్గకు అద్దుకున్న నేతచీర మడతలా సుతిమెత్తగా తగిలింది. నల్లపిల్ల అర్చనను కూడా ప్రేమించేలా చేసింది. అదంతా ఆ కలాన నింపిన మత్తుమందు.

పంచేందుకు ఒకరులేని బ్రతుకు బరువైనదంటూ ఓ వింతైన ఉదాత్తభావం, ఏ తోడుకీ నోచుకోని నడక చాలా అలుపంటూ ఓ వినూత్నమైన మోహం కలిగించారు. ఆ క్షణం ఎన్నో యువహృదయాలు సరిజోడెవరంటూ కలవరపడడం మొదలెట్టాయి. అదంతా స్ఫూర్తితో పూర్తిగా నిండిన మధుకలశం.

వాదులాడాలంటే తర్కం తప్పనిసరి. మీరన్నది బాగున్నది, నేనన్నది బహుబాగున్నదన్న రీతిలో జరిగే తర్కం తాపేశ్వరం కాజాలా ప్రతి పొరా రుచిగా ఉంటుంది. అటువంటి సందర్భం స్వర్ణకమలంలో శాస్త్రిగారి కలానికి వచ్చిపడింది.

స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః అని నమ్మే కుర్రాడు చంద్రం.

పడమర పడగలపై
మెరిసే తారలకోసం రాత్రిని వరించే సుందరి మీనాక్షి.

కథాంశాన్ని కంఠతా పట్టిన కవీశ్వరుడు తానూ ఆ తానులో ఒక ముక్కగా మారినప్పుడే పాటవేరు, సినిమా వేరన్న భావన రాకుండా చెయ్యగలడు. అదే జరిగింది.

పాశ్చాత్య ధోరణులనే పడమటింటి పోకడల్ని పాము పడగలుగా వర్ణించాడు. వాటిపై మెరిసే మణుల్ని తారలతో పోల్చాడు. వాటిని చూస్తూ రాత్రిని వరించి, బ్రతుకు చీకటి చేసుకోకంటూ హెచ్చరిక చేశాడు.

తూరుపువేదిక మీద ఉషోదయాన మనదైన రీతిలో నర్తిస్తూ ఈ ధాత్రినే మురిపించమంటూ ఆశాజ్యోతిని వెలిగింపజేశాడు.

మన సంస్కృతిని పరిచయం చేసే అరుదైన పాటలన్నింటిలోనూ అగ్రస్థానంలో అమరగల అజరామరమైన పాట ఇది.

అయితే ఆ పిల్ల చెప్పిందీ సబబనే అనిపిస్తుంది. ఈకాలపు మహిళ ఎదుగూబొదుగూ లేకుండా ఇంటిపట్టునే పట్టుకర్రలా ఓమూల పడివుండాల్సిన అవసరం లేదుకదా?

తనవేళ్ళే సంకెళ్లై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా… అంటూ స్వేచ్ఛాపతాకను ఎగరేసే మీనాక్షి మాటల్లో వాస్తవికత మనల్ని అబ్బురపరిచేలా చేసిందంటే దానికి కారణం శాస్త్రిగారి కలానికున్న పదునే!

ఇటువంటి ద్వైదీభావాన్ని ఇంతందంగా అభివర్ణించిన ఈయన శివుడి మీద పాటంటే శివాలెత్తిపోతాడు.

సాక్షాత్తూ కైలాసానికి మనందరినీ ప్రయాణం చేయించి

వంకజాబిలిని జడను ముడుచుకున్నవాడిని
విషపునాగులను చంకనెత్తుకున్నవాడిని
నిలకడలేని గంగమ్మను ఏలుకున్నవాడిని
తన అక్షరాలలో చూపిస్తాడు.

పాటంతా అయిపోయాక అనంతరామశర్మే కాదు, మనం కూడా నిరుత్తరులమై, ఆ శాస్త్రిగారి మానససరోవర ప్రవాహంలో కొట్టుకుపోతాం. తేరుకుని చూస్తే తడిసిన కన్నులు, తడబడే మాటలూ మిగులుతాయి. పాటకు బొట్టెట్టి, పట్టుబట్టకట్టి, పట్టమహిషిని చేసి, పరమాత్మకు అంకితమివ్వడమంటే ఇదే!

కవి కవీశ్వరుడుగా మారిన క్షణమది. తన్మయత్వంలో ఆ కలం శివుడిలా నర్తించింది. మంచుకొండలవంటి మన హృదయాలన్నీ ఆ రాపిడికి కరిగినీరైపోయాయి. కనుకొలకుల్లో ఆ లాస్యం కదలాడగా మరొక జన్మ వద్దనిపిస్తుంది. అంతలా కదిలించే పాట మరొకటి ఉందంటారా?

ప్రతిమనిషీ ఏదో ఒక కులంలో పుడతాడు. అమ్మానాన్నల మతానికి, అభిమతానికీ అనుగుణంగా నడుచుకుంటాడు.

తనవాడంటూ అనిపించిన ప్రతి మనిషినీ అక్కునజేర్చుకోవడం మానవలక్షణం. అయితే అది శాస్త్రిగారిలో కొంచెం ఎక్కువగా చూశాను.

మూడేళ్లక్రితం విశాఖపట్నంలో ఒక సభకు వస్తున్నానని, నన్ను అక్కడ కలవమని చెప్పారు. సభాస్థలికి అరగంట ముందుగా చేరుకున్న నాకు అనకాపల్లిలో నాతోపాటు కళాశాలలో చదువుకున్న వాళ్లు ముగ్గురు కనిపించారు. వారందరితోనూ శాస్త్రిగారు ఇంకా నెయ్యం నెరపుతున్నారని మాటల సందర్భంలో తెలిసింది.

శాస్త్రిగారు వచ్చారు. నమస్కారం చేసి ‘కొచ్చెర్లకోట జగదీశుని!’ అంటూ మెల్లగా పలికాను. ఆయన ఒక్కడుగు వెనక్కువేసి గాఢాలింగనం చేసుకుని ‘ఎంత అద్భుతంగా రాస్తారండీ జగదీశ్ గారూ! మీ రచనలన్నీ చదవాలి నేను. ఒకసారి హైదరాబాద్ రండి! సభ అయ్యాక మీతో చాలాసేపు మాట్లాడాలి. ఉండండి!’ అంటూ నేను ఆశ్చర్యం నుండి తేరుకునేలోపే తన స్థానానికి వెళిపోయారు. నాతో వచ్చిన మిత్రుడికి నోటమాటలేదు.

నిజానికి ఆయన అంతలా స్పందించవలసిన అవసరమూ, ఆవశ్యకతా లేదు. శివుడిముందు వెలిగే ధూపంలాంటివాణ్ణి. అది ఆయన జన్మసంస్కారం.

అయితే అది మరింత సొగసుగా మళ్లీ కనబడబోతోందని నాకప్పుడు తెలియదు. సభ పూర్తయిన పిమ్మట మళ్లీ మేమందరం బయటికొచ్చి శాస్త్రిగారిని కలిశాం.

‘రంగబాబూ, కృష్ణకుమార్, జగదీశ్ గారూ…’ అంటూ పేరుపేరునా పిలిచి నోరారా నవ్వుతూ, మనసారా మాటాడారు. అదంతా ఇప్పటికీ కలలానే ఉంటుంది నాకు. సాక్ష్యానికి ఒక్క ఫొటో కూడా లేదు. హనుమంతుడిలా గుండెను చీల్చి చూపమంటే చూపిస్తాను.

సీతారామశాస్త్రి గారి బొమ్మ పదిలం.

తెలుగుపాట తల్లడిల్లుతోంది. ఈమధ్య ఒకానొక పాట విని, ‘ఇదేదో కాస్త సాహిత్యం బావుందే? ఎవరబ్బా రాశారూ?’ అని చూస్తే ఇంకెవరూ, ఈయనే!

నిద్రలేని రాత్రులు మీకు. అనంతమైన పదాలు మాకు. సిగరెట్ల పొగరెట్లతో
ఊపిరిని సైతం ఊహల కోసం త్యాగంచేసిన మీ ఉచ్ఛ్వాసం కవనం. నిశ్వాసం కూడా కవనమే!

ఎందుకంత తపన? మాకు కాస్తంత తీపి చాలని చెప్పలా?

అంత తీపి మాకొద్దు. పాటలో ఏవో నాలుగు పటిక పందారముక్కలున్నా చాలనుకునే తెలుగువాడికి చక్కెర బీమార్ తెప్పించేశారు.

మీ కలం విదిల్చిన సిరాచుక్కలన్నీ తెలుగు సినీసాహిత్యపు వినువీధుల్లో చుక్కలై ప్రకాశిస్తున్నాయి!

వాటిమధ్యన ధ్రువతారలా మీరు, మీ వ్యక్తిత్వం మరింత వైభవంగా ప్రకాశిస్తున్నాయి.

మీ చేయితాకిన గర్వంతో రాశానిది. మీ మనసు పంచిన సిరివెన్నెల వెలుగులో కన్నీరుమున్నీరవుతూ కలాన్ని కదిలించగలిగాను.

నివాళులు!

– కొచ్చెర్లకోట జగదీశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *