లౌక్యమూ లేక -కథానిక

లౌక్యమూ లేక -కథానిక

“శంకరంగారూ గారు ఒకసారి వస్తారా”

ఫోన్ లో అపార్ట్మెంట్స్ సెక్రటరీ రామకృష్ణ అభ్యర్థనకు నేనూ, వెంకట్, సాల్మన్ స్పందించి కదిలాం.

జంటనగరాలలోని అనేక మధ్యతరగతి అపార్ట్మెంట్లలో మాదీ ఒకటి. దానికి తోడు మేముండేది మాస్ ఏరియా. ప్రతీదీ పండగలా జరుపుకోవటం అనే సంప్రదాయం ఎప్పటినుంచో వస్తోంది ఇక్కడ.

బోనాలయినా, బక్రీదయినా, క్రిస్మస్ అయినా సందడికి లోటులేదు. ఇప్పుడు రామకృష్ణ ఎందుకు పిలిచాడో ఊహించలేనిదేమీ కాదు. ఏ అపార్ట్మెంట్ కయినా వాచ్మెన్ కీలకం. మంచి వాచ్మెన్ ఉంటే ఆ అపార్ట్మెంట్ శాంతితో నిండుంటుంది.

కొంచెం వాదులాడే వాచ్మెన్ జంటుంటే వేరే మంట అక్కర్లేదు. ఈ ఉపోద్ఘాతంతో మేమేదో కాపలాదారు(వాచ్మెన్) సమస్యలో ఉన్నామని మీరు భావిస్తే అవును, కాదు అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

మా వాచ్మెన్ తంపులు పెట్టి మాకేమీ తెగతంపుల సమస్య తేవటం లేదు కానీ,వాళ్ళు మాత్రం ఊరెళ్ళొస్తామన్నారంటే  మాపని అయిపోయినట్టే.అదేదో ప్రపంచయాత్ర చేస్తామన్నట్టుగా వినిపిస్తుంది మాకు.

వీళ్ళు ఊరెళ్ళారంటే కనీసం నెలరోజులు పడుతుంటుంది.ఏదో పేరుకు పదిరోజులంటారు.మళ్ళీ అదే తతంగం రిపీట్ అవుతూ ఉంటుంది.ఇప్పుడూ అదే అన్న మాట అనుకుంటూ బయల్దేరాం.

“వచ్చారా..రండి…”

అని ఆహ్వానం పలికాక కాఫీ సత్కారాలను కానిచ్చాక విషయంలోకి వచ్చాడు సెక్రటరీ రామకృష్ణ.

“విషయం తెలుసుగా”

అంటూ మా అందరివంకా చూశాడు. మేం మా మొహాలు చూసుకున్నాం.

“మన వాచ్మెన్ వెళ్లి ఇన్నాళ్ళయిపోయింది. మీరేం చేస్తున్నారు. వాళ్ళని అడగరా అని నన్ను కడిగేస్తున్నారు.”

రామకృష్ణ గాంభీర్యాన్ని ప్రదర్శించినా కోపాన్ని దాచలేకపోతున్నాడు.

“అవుననుకోండి. ఎదురు అపార్ట్మెంట్ వాచ్మెన్ మోటార్ వేస్తున్నాడు. నీళ్ల సమస్య లేదు. సాయంత్రం లైట్లేస్తాడు. పొద్దున్న చీపురుతో తుడిచేస్తున్నాడు. ఇంక కంప్లెయింటేముంటుంది.” అన్నాను నేను పెద్దవాడిగా..

వెంకట్, రామారావు సాల్మన్ కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు.

“మరి జీతం ఎవరికివ్వాలి? ఈసారి మెయింటెనెన్స్ కూడా నేనే అడగవలసి వచ్చింది అందరినీ,మీరెవరూ బాధ్యత తీసుకోరుగా” కొంచెం అసహనంగా అన్నాడు రామకృష్ణ.

“ఇంతకీ ఇప్పుడెందుకు పిలిచారో చెప్పలేదు” అడిగాడు సాల్మన్.

“ఉన్న పాతికమంది ఫ్లాట్స్ వాళ్ళు నన్ను నిలదీస్తున్నారు.మీరు ఎట్లా ఊరుకున్నారు,వాళ్ళు అన్నాళ్ళు రాకపోతే.అందుకే వాచ్మెన్ జీతం ఆ ఎదురు వాచ్మెన్ కు ఇచ్చేద్దామనుకుంటున్నా”

“మాకేమీ అభ్యంతరంలేదు” వెంకట్ అందరి పక్షాన చెప్పాడు.

“వాళ్ళకు గట్టి వార్నింగ్ ఇచ్చాను.రేపటిలోగా రాకపోతే తీసేస్తామని.కోర్ కమిటీ సభ్యులుగా మీరూ అదేమాటమీద ఉండాలి” రామకృష్ణ గొంతులో స్థిర నిశ్చయం కనపడింది.

నేను జోక్యం చేసుకోక తప్పలేదు.

“మనమందరం ఉద్యోగస్తులమే. కొంతమంది గవర్నమెంట్ లోను, కొంతమంది ప్రైవేటు గానూ చేస్తున్నాం. మనకేమో సిక్ లీవ్, ఎర్న్ లీవ్, కాజువల్ లీవని కొంత సౌకర్యముంది. ఇలాంటి వాచ్మెన్ లకు ఎలాంటి రైట్సూ ఉండవు. ఏదో పది రోజులని నెలచేశాడని అంత తీవ్రంగా ఆలోచిస్తారా? ఆలోచించండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తాం అనటం కరెక్టేనా?”

ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

“ఏమిటీ శంకరంగారు చెప్పిందాన్ని పట్టుకు వేలాడుతున్నారా.. మనకు కావలసింది మన అపార్ట్మెంట్స్ సెక్యూరిటీ. దట్సాల్..” 

రామకృష్ణ ముక్కుపుటాలదురుతున్నాయి..  నావంక ఇబ్బందిగా చూస్తూ అందరూ లేచారు.. అక్కడితో ఆ ఘట్టం ముగిసింది.

*************

ఇది జరిగిన రెండురోజులకు మా వాచ్మెన్ కుటుంబం వచ్చింది. వీళ్ళకు ఇవ్వాలే లాస్ట్ డే అనుకుని నిట్టూర్చాను..

సాయంత్రం మళ్ళీ రామకృష్ణ పిలిచాడు. ఈసారి నన్నొక్కడినే.. వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్ళాను..

“శంకరంగారూ రండి.మీరన్నది కరెక్టే. రాత్రంతా ఆలోచించాను.అందుకని వాచ్మెన్ వాళ్ళని పంపించేయటం లేదండీ.ఈసారి సెలవులో వెళ్లితే కొంచెం వెంటనే రమ్మనిమని చెప్పాను”

ఆశ్చర్యపడటం నా వంతయింది.రామకృష్ణ సహృదయతను నమ్మలేకపోయినా అభినందించక తప్పలేదు..

ఆ మరుసటి రోజుకి మార్నింగ్ వాక్ కు బయల్దేరుతుంటే వాచ్మెన్ ఎదురయ్యాడు. ఏమయ్యా ఎలా ఉన్నారంటూ కుశలప్రశ్నలు వేశాను.

“బావున్నామయ్యా.. ఆ ఎదురు వాచ్మెన్ అడిగితే నెలరోజులయినా ఫరవాలేదు, చూసుకుంటానని మాటివ్వటంతో వెళ్ళామయ్యా.. జీతం కూడా ఇస్తామని చెప్పానయ్యా..”

అతని అమాయక మాటలు వింటుంటే టీవీ డిబేట్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిక్కుకున్న పిల్లపార్టీ ప్రతినిధిలా అనిపించి నవ్వొచ్చింది. బండి తీసుకొని బయటికొచ్చాను.

నాకోసం వెయిట్ చేస్తున్న సాల్మన్ “మీకో విషయం తెలుసా” అని మొదలెట్టాడు.

“మన వాచ్మెన్ వాళ్ళది శ్రీకాకుళం దగ్గర.జీడితోట పెంచుతున్నాడు. దగ్గర వాళ్ళకిచ్చినా సరిగ్గా చేస్తున్నారో లేదో అని చూట్టానికి వెళుతుంటాడు. మన రామకృష్ణ గారికి రెండుకిలోల జీడిపప్పు తెచ్చిచ్చాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయనగారు ఉబ్బితబ్బ్బిబ్బై వాడిక్కావలసిన వరమిచ్చాడు.ఇక పదండి.”

కాస్తో కూస్తో సహాయం చేస్తుంటానని  మా వాచ్మెన్ నాకూ చిన్న పేకెట్ ఇచ్చాడు.ఊరికే తీసుకోవటం ఇష్టం లేక అతని జేబులో ఐదువందల నోటు కుక్కాను పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ..

ఇదే విషయం చెప్పగానే సాల్మన్ పడీపడీ నవ్వాడు.

“బావుంది ఇక్కడ మీదగ్గర  తీసుకున్నాడు. అక్కడ సమర్పించుకున్నాడు.”

‘లౌక్యమూ లేక సౌఖ్యమూ లేదూ’ అని రాగయుక్తంగా అందుకున్నాడు.

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *