లోపానికి లోకం దొరకదని

లోపానికి లోకం దొరకదని

అడిగితే సాయమవని దేహం
అరిషడ్వర్గాలను జయిస్తుందా…?
పొరబడిన తలరాత ముఖచిత్రమై
ఆప్తులను సంగ్రహించడంలో ఒరిగిన
వృక్షంగా…మొలవని జాతకంతో పాపమని
సాయం చేసిన చేతులకు సాహసంగా
తోడు నడువని బతికున్న జీవచ్ఛవం…
అర్థంలేని ఈ బతుకు నిర్వచనమై
నిలబడుతుందా….

ఆరాధించలేని ప్రకృతి అందాలు…
కంటి చెమ్మలుగా తడి ఆరిపోతున్నాయి
చెడిన పేగుబంధం అతుకు బడక…
కుక్కిన బతుకును ఆధరించలేని
వాలుతనమై చతికిలపడుతు…చూడని
సమాజంలో అంధకార బంధాలు చిరిగిన
విస్తరులై సవరించుకోలేని ఆశల పల్లకి
ముస్తాబులు దూరమవుతు…కుంచకు
దొరకని రూపం కురూపిదై మా తరానికి
ఆదర్శంగా నిలబడలేక పోతున్నది…

త్యాగం…. తెలిసిన నిద్దుర మత్తని
మానని గాయంతో లక్ష్యంగా కనబడే
శిఖరాలను అధిరోహించలేక పరిస్థితులను
ప్రాధేయపడుతు…. నా నిత్య పరిశోధనలో
తెలిసిన నిజం ఒక్కటే….జీవితమంటే
గమ్యాన్ని చేజిక్కించు కోవడం కాదని….
కదలని నాస్థిరత్వం కనుపాపలపై స్థూపమై…
భోధిస్తున్నది సముద్రమంతటి విశాలంతో
ఎత్తు పళ్ళాల ఎగవేతలను లెక్క చేయక…
అందరి సముచ్ఛాయాలను కదిలించేదే
జీవితమని…

అడుగు స్వచ్చత తెలియని నా శరీరానికి
లోపం పూచిన బహుమానమని….లోకం
పోకడలని గెలువని మనస్సున సంధ్యలు
పొదుగుతు…చీకటిగా విరబూసిన బతుకు
సమరంలో లోపానికి లోకం దొరకని
అవిటివాదమని…నిరంతర శోభితాలు
నను మరిచిన శాసనమై తరగతి గదుల
తర్ఫీదులు పాఠాలుగా దాటిపోతున్నాయి…
కాలమా ఇది నీ నిర్ణయమా గరుకు రాయి
గంధంగా కరిగిపోవడమేనా….

 

-దేరంగుల భైరవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *