లిప్తకాల జీవితం

లిప్తకాల జీవితం

ఈ అనంత చరాచర సృష్టిలో..
అణువణువు నీ హస్తగతమే…
అమేయమైన ఈ ప్రకృతిలో… ప్రతిపదార్థము నీ పాదక్రాంతమే…
సమస్త విశ్వాన్ని గుప్పిట బంధించి..
సకల జీవకోటిని..
పోషించి ఆక్షేపించి నిర్దేశించే…
జగన్నాటక సూత్రధారివి..
జగద్రచనా అధ్యక్షుడివి..
అనివార్యమైన జనన మరణ చక్రంలో…
అధ్యంతాలే గోచరించని నీ అద్భుతమైన యోగ మాయలో..
నేను ఒక పాత్రధారిని.
నా ప్రమేయం లేకుండానే అందిన..
ఈ చిరు ఉనికికి ఆశల పుప్పడి అద్దుకొని..
ఆత్మీయ రాగాలను ఆలపించాలని..
ఆత్రపడే గాత్రధారిని..
అలాంటి ఈ అర్బకురాలిపైన..
ఎందుకు నీ శీతకన్ను..?
నీవు బిక్షగా ప్రసాదించిన లిప్తకాల జీవితంలో కూడా…
ఆనందాలను విలుప్తం చేసి…
నా బతుకు ఆటను ముగించాలనే..
వికృత క్రీడా వినోదం నీకేలా?

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *